‘‘శ్రీ విష్ణును హీరో అనాలో, ఆర్టిస్టు అనాలో నాకు తెలియడం లేదు. కానీ సినిమాను లీడ్ చేస్తున్నప్పుడు హీరో అనే అంటాం. జయాపజయాలతో సంబంధం లేకుండా కొత్త దర్శకులకు అవకాశాలను ఇస్తూ నెంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నాడు శ్రీ విష్ణు. ఏదో ఒక రోజు అతని ప్రయత్నం పెద్దవాడ్ని చేస్తుంది. అయితే తన ప్రయత్నాలను మాత్రం శ్రీ విష్ణు ఆపకూడదు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు…. ఇదీ ఒక వార్త.. శ్రీవిష్ణు నటించిన అర్జున ఫల్గుణ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన ఆయన సొల్లిన శుభాకాంక్షల తీరు ఇది… పిలిచి మరీ తన్నించుకున్నట్టుంది సినిమా టీం… నిజానికి చిన్న హీరోలను మరీ చిన్నచూపు చూడటంలో దిల్ రాజు చాలా పెద్దోడు… గతంలో రాజ్ తరుణ్ గురించి కూడా ఇలాగే కించపరిచినట్టు మాట్లాడాడు…
నిజానికి పైపైన చూస్తే, శ్రీవిష్ణును ఆశీర్వదిస్తున్నట్టు, పెద్ద హీరో కావాలని అభిలషిస్తున్నట్టు అనిపిస్తయ్ తన మాటలు… కాకపోతే వాళ్ల ఈవెంట్‌కు వచ్చి, ఏవో నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్లిపోకుండా… హీరో అనాలో, ఆర్టిస్టు అనాలో తెలియడం లేదు, ఏదో ఓ రోజు పెద్దోడివి అవుతావు… ఇవేం మాటలు..? రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మాఫియా సిండికేట్లు ఎలా పాతుకుపోయాయో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు… ఆ బలంతోనే ఆ నోటి నుంచి ఇలాంటి మాటలు వెలువడుతున్నాయా..? ఇలాంటి మాటలు ఎవరైనా వారస హీరోను ఉద్దేశించి అనగలడా ఏమాత్రం దిల్ లేని రాజు…? కాస్త లక్కు, కాస్త మెరిట్, కాస్త మెళకువ, కాస్త చొరవతో కొంచెం కొంచెం ఎదుగుతున్న చిన్న హీరోలంటే అంత చిన్నచూపు దేనికి..?
నిజమే… శ్రీవిష్ణు హీరోయా లేదా ఆర్టిస్టా తెలియదు సరే… ఇంతకీ హీరో అంటే ఎవరు..? ఆర్టిస్ట్ అంటే ఎవరు..? ఈ హీరో అనే పదవినియోగ పైత్యం మన ఇండస్ట్రీదే… ప్రపంచంలో ఎక్కడైనా లీడ్ యాక్టర్స్ ఉంటారు తప్ప హీరోలు ఉండరు… పోనీ, మన ఇండస్ట్రీ భాషలో హీరో అంటే ఎవరు..? సినిమా మొత్తాన్ని తమ భుజాల మీద మోసేవాడనా..? పెద్ద యాక్టరా..? పెద్ద రేంజులో రెమ్యునరేషన్ గుంజే యాక్టరా..? పారితోషికంగా ఏరియాల వారీగా రైట్స్ లాక్కునే నటుడా..? ఎవరు హీరో అంటే..? ఇవేవీ లేకుండా నటన మీద, కెరీర్ మీద దృష్టి పెట్టి కష్టపడేవాళ్లు కేవలం ఆర్టిస్టులు అని పిలవబడతారా..? నటనలో బేసిక్స్ కూడా తెలియనివాళ్లు హీరోలుగా తెరకెక్కి, కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతూ, మన నెత్తి మీద తైతక్కలాడుతూ ఉన్నారు కదా… వాళ్లలో హీరోలు ఎవరు..? ఆర్టిస్టులు ఎవరు మిస్టర్ రాజూ..?
Ads
చిన్న చిన్న పాత్రలు చేసి, పెద్ద నటులుగా ఎదిగి, ఇండస్ట్రీని శాసించినవాళ్లు లేరా..? అంతెందుకు..? ఎన్టీయార్, ఏఎన్నార్‌లు మొదట్లో నెలజీతంతో పనిచేయలేదా..? రజినీకాంత్ సంగతేమిటి..? వీళ్లంతా అందివచ్చిన పాత్రల్నే కళ్లకద్దుకుని కష్టపడలేదా..? చిరంజీవి మొదట్లో చిన్న వేషాలు వేయలేదా..? ఇప్పటి నాని తన ప్రయాణాన్ని ఎక్కడ మొదలుపెట్టాడు..? అసలు హీరో వేరు, ఆర్టిస్టు వేరా..? హీరో ఆర్టిస్టు కానక్కర్లేదా..? ఆర్టిస్ట్ అంటే చిన్న కేటగిరీయా..? అసలు ఇదెక్కడి భాష..? ఇదేం వివక్ష… ఎవరి సినిమాకు వాళ్లే గొప్ప… అఖండ సినిమాకు బాలయ్య ఎంతో… అర్జున ఫల్గుణ సినిమాకు శ్రీవిష్ణు కూడా అంతే… రేంజ్ విడిచిపెట్టండి… పెద్దగా హిట్టయిన చిన్న సినిమాలున్నయ్… అడ్డగోలుగా బోల్తాకొట్టిన పెద్ద సినిమాలున్నయ్… దిల్ అని ఇంటిపేరుగా పిలిపించుకోవడమే కాదు, కాస్త హార్టిస్ట్ అనిపించుకోవాలి… ఏమంటవ్ భయ్యా..?!
Share this Article