ఒక మీమ్ చూడండి… మీమ్ అంటే ఓ సెటైర్… ఓ జోక్… అంతే అనుకుంటున్నారా..? కాదు… మీమ్ అంటే ఓ విశ్లేషణ… రియాలిటీ కూడా…! ఒక కార్టూన్, ఒక ఫోటో వంద వార్తా కథనాలను విప్పి చెప్పినట్టే… ఒక మీమ్ కూడా అంతే… ఇది కూడా అంతే… తెలంగాణ ప్రభుత్వం థియేటర్లలో టికెట్ రేట్లు పెంచింది… ఎగ్జిబిటర్ల మాఫియా అంటే మామూలుది కాదు కదా… అది తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ప్రభావితం చేసింది… ఇదేమీ జగన్ ప్రభుత్వం కాదు కదా… ఇంకేముంది..? చిరంజీవి సహా చాలామంది ఆహా, ఓహో… కేసీయార్ దేవుడు, తలసాని ఆ దేవుడి మంత్రి, సంతోష్ ఆ దేవుడి ఛాయ అన్నట్టుగా భలే ప్రకటనలు జారీచేశారు… ఎల్లరూ సుఖులే కదా అనుకున్నారు అందరూ… కానీ నిజానికి జరిగేది ఏమిటి..?
తెలంగాణలోనే కాదు, ఏపీలో కూడా… అనేక థియేటర్లను లీజుకు తీసుకున్నట్టు రాయించుకుని, టూత్ పాలిష్ పైపై మెరుగులు దిద్ది…. ఆల్‌రెడీ 35 ఎంఎం, 70 ఎంఎం అని ఉన్న డ్యుయల్ థియేటర్లకే మల్టీప్లెక్స్ ముద్రలేసి… అవసరమైతే థియేటర్లలో ఓ క్యాంటీన్, ఓ బట్టల షాపు, ఓ ఐస్‌క్రీమ్ షాపు పెట్టేసి… దాన్ని ఓ మల్లీప్లెక్స్ కమ్ షాపింగ్ మాల్‌గా కలరిచ్చేసి… అడ్డగోలుగా రేట్లు పెంచేసుకుంటున్న రోజులివి… దాదాపు ప్రతి థియేటర్ ఎగ్జిబిటర్ల సిండికేట్ అలియాస్ మాఫియా గుప్పిట్లో ఇరుక్కుపోయింది… ఇప్పుడేం జరుగుతుంది..?
Ads
ఉదాహరణకు శ్రీవిష్ణు నటించిన అర్జున ఫల్గుణ సినిమా తీసుకుందాం… పట్టణాల్లో, నగరాల్లో ఆ రేట్లకు టికెట్లు కొని, ఆ సినిమా చూడాలని ఎందరికి ఉంటుంది..? పైగా మొదటిరోజే ఫ్లాప్ టాక్… ఈమాత్రం దానికి ఇంత ఖర్చుతో థియేటర్‌కు ఎవడు వెళ్తాడులే… ఓటీటీలో రాదా..? టీవీలో రాదా..? అంత ఎగబడి, పరుగులు తీస్తూ థియేటర్ వెళ్లాల్సిన సినిమా ఏమీ కాదు కదా అనుకుంటాడు సగటు ప్రేక్షకుడు… మరి రేపు రేపు..? అయిపోయింది, సినిమా పని..!! అంటే టికెట్ల రేట్ల పెంపు చిన్న సినిమాను దెబ్బతీస్తోందా..? మంచి చేస్తోందా..?
సింపుల్… ఇవన్నీ పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతల బొక్కసం నింపేవి… లాబీయింగ్ చేతనయ్యేది వాళ్లకే… కుర్చీల్లో ఉన్నవాళ్లకు అర్థం కానిదీ అదే… బెనిఫిట్ షోలు, అదనపు షోలు, ఈ టికెట్ల రేట్లతో నిండేది పెద్ద హీరోల జేబులే… అది తెలంగాణ ప్రభుత్వానికి అర్థం కాదు… కానివ్వరు… ఈ దెబ్బకు చిన్న సినిమా మరింతగా థియేటర్‌కు దూరం అవుతుంది… కాదు, కాదు… ఈ దెబ్బకు థియేటర్లు మరికొన్ని షాపింగ్ మాల్స్ అవుతాయి, ఫంక్షన్ హాల్స్ అవుతాయి… చిన్న నిర్మాత థియేటర్‌కు దూరం అవుతాడు… డీప్‌గా ఆలోచిస్తే అర్థమయ్యేది అదే… ప్రభుత్వానిదేముంది..? ప్రభుత్వ పెద్దలదేముంది..? పెద్ద హీరోల మొహాలు వెలిగిపోతే చాలు, పెద్ద నిర్మాతలు ఆనందంగా ఉంటే చాలు… వెరసి ఓటీటీ మార్కెట్ పెరుగుతుంది… వెరసి టీవీ రైట్స్ ధరలు పెరుగుతాయి… చిన్న సినిమాలకు అవే దిక్కవుతాయి… థియేటర్ వెళ్లే అలవాటున్న సగటు ప్రేక్షకుడు ‘ఎడ్డి మొహం’ వేస్తాడు… ఇంతకుమించి ఏమీ జరగదు..!! No, no, చిన్న సినిమాలకు ఎక్కువ రేట్లు వసూలు చేయకూడదు అని తాజాగా ఫిలిం ఛాంబర్ ఆంక్ష పెట్టిందిట… GO చెప్పేది కూడా అదేనట… అసలు చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఎవరు తేల్చాలి..? అమలయ్యేదేనా..? అసలు సినిమా రేంజ్ తేల్చేందుకు ఏదీ ప్రాతిపదిక..? పైగా ఇది కూడా పెద్ద హీరోలు, పెద్ద బడ్జెట్ సినిమాలకే ఉపయోగకరం అని అర్థం అవుతూనే ఉందిగా..!! ఏపీలో అదొక ఎక్స్‌ట్రీమ్… తెలంగాణలో ఇదో ఎక్స్‌ట్రీమ్…. భలే ప్రభుత్వాలు…!!!
Share this Article