డెబ్బయ్యో, ఎనభయ్యో వయస్సు… పేరు యాదగిరి అనుకుందాం… కొడుకును పెంచాడు, చదివించాడు… పెళ్లి చేశాడు… చాలా ఇళ్లల్లో ఉండే సమస్యే కదా… పేరెంట్స్‌ను పట్టించుకోకపోవడం… ఎక్కడో తేడా వచ్చింది… పై పోర్షన్లోకి తన మకాం మార్చాడు కొడుకు… తండ్రికి అనేకసార్లు కొడుకు వైఖరితో కోపం, దుఖం, చిరాకు, అసహనం ముంచుకొస్తున్నయ్… అప్పుడు తనేం చేయాలి..? తనకు అండగా ఏమైనా చట్టాలున్నాయా..? అసలు తన మొరను ఈ కోర్టులు గట్రా పట్టించుకుంటాయా..? ఈ ప్రశ్నకు సమాధానాలు చాలా సంక్లిష్టం కదా…
కేరళలో ఓ కేసు గురించి చెప్పుకుందాం… ఎర్నాకుళం దగ్గర ఎడపల్లి… ఆంటో తొప్పిల్ ఆయన పేరు… వయస్సు ఎనభై… ఆయన పరిస్థితి ఇప్పుడు మనం చెప్పుకున్నదే… తెల్లారిలేస్తే ఈ అశాంతి, పంచాయితీలు, మనస్పర్థలతో… ప్రశాంతంగా గడవాల్సిన తమ వృద్ధాప్యం తమకే బరువు అయిపోతుందనేది ఆ దంపతుల బాధ… ఆయన బాధలో అర్థముంది కదా… వేరేచోట నివాసం ఉండు అంటే కొడుకు వినడు, మరీ మొండిగా అక్కడే ఉంటున్నాడు…
అదేదో పాత తెలుగు సినిమాలో గొల్లపూడి ఇంటి నడుమ ఓ పెద్ద గీత గీసి, రెండు భాగాలు చేస్తాడు… శరత్‌బాబు, సుహాసిని కొడుకూకోడళ్లు… ఈ కేరళ గొల్లపూడి అలా గీత గీయడానికి కూడా లేదు… ఎవరి ఫ్లోర్ వాళ్లదే… ఐనా తరచూ ఏదో తగాదా అశాంతిని రేపుతూనే ఉంది…
Ads
(ప్రతీకాత్మక చిత్రం)
అసలు నా కొడుకును ఈ ఇంటి నుంచి ఖాళీ చేయించి, తనకు ప్రశాంతంగా, భద్రతతో, మానసిక ఆరోగ్యంతో బతికే భాగ్యం కల్పించండి మహాప్రభో అని మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌కు మొరపెట్టుకున్నాడు… ట్రిబ్యునల్ తోసిపుచ్చింది… నెలకు అయిదు వేలు మెయింటెనెన్స్ సొమ్ము చెల్లించవోయ్ అని చెప్పింది కొడుక్కి…
నాకు మెయింటెనెన్స్ కాదు కావల్సింది… నా కొడుకు కుటుంబాన్ని ఖాళీ చేయించండి అంటూ హైకోర్టుకు పోయాడు తొప్పిల్… నవంబరు 27న ఈ కేసు జస్టిస్ సతీష్ నైనన్ దగ్గరకు వచ్చింది… కేరళ మెయింటెనెన్స్ అండ్ వెల్పేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజెన్స్ రూల్-2009 అని ఓ చట్టం ఉంది రాష్ట్రంలో… తల్లిదండ్రులు, వృద్ధుల సంక్షేమం, భద్రత, పోషణ అంశాల్లో పలు హక్కుల్ని కల్పించింది ఆ చట్టం… దాన్ని బట్టి సినియర్ సిటిజెన్స్, పేరెంట్స్ హక్కుల్ని కాపాడే బాధ్యత కలెక్టర్లకు ఉందని కోర్టు స్పష్టం చేసింది…
ఈ పర్టిక్యులర్ కేసులో సదరు కొడుకు కుటుంబాన్ని ఆ ఇంటి నుంచి ఖాళీ చేయించాలని ఆదేశించింది… ఇది చిన్న వార్తగానే కనిపించవచ్చుగాక… కానీ వేల ఇళ్లల్లో ఇలాంటి పేరెంట్స్ ఎందరో… కొడుకులు, కోడళ్ల వల్ల అవస్థలు భరించలేక బాధను లోలోపల మింగుతూ, భరిస్తూ, కుంగిపోతున్నవాళ్లు బోలెడు మంది…
ఇళ్లల్లో ముసలివాళ్ల జీవితాలు అంటే సగటు తెలుగు టీవీ సీరియల్లో కనిపించే పిచ్చి కథలు కావు… అత్తల క్రుయాలిటీ, కోడళ్ల కన్నీళ్లు కాదు… రియాలిటీ వేరు… కేరళ చట్టం నిజంగా ఇలాంటివాళ్లకు ఒక అండ… ఈ కేసులో తీర్పు చెప్పినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే… మరీ ఏకపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు, కేసును స్టడీ చేసి, తగు నిర్ణయం తీసుకోవాలని జాగ్రత్తలు కూడా చెప్పింది… ప్రతి చిన్న విషయానికీ మరీ కుటుంబ విచ్ఛిన్నం దాకా పోనవసరం లేదనే జాగ్రత్త… తమ ఇళ్లల్లోనే కన్నీళ్లను దిగమింగుతున్న వేలాది మంది పేరెంట్స్‌కు ఇలాంటి వార్తలు ధైర్యాన్ని ఇస్తాయనేదే ఈ స్టోరీ పబ్లిష్ చేయడం వెనుక ఉద్దేశం…
Share this Article