నిజానికి చిరంజీవి అన్నదాంట్లో అనుభవం ఉంది, నిజాన్ని తెలుసుకున్న పాఠం ఉంది… పెద్దరికం అంటే అదెంత చిక్కుముడో తెలుసుకున్నట్టే ఉంది… తనేమన్నాడు అంటే..? ‘‘ఇండస్ట్రీ పెద్దరికం అనే హోదాలు, బాధ్యతలు నాకు వద్దు, పెద్ద అనిపించుకోవాలనీ లేదు… ఇండస్ట్రీకి ఆరోగ్యం, ఉపాధి వంటి సమస్యలు, సంక్షోభాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓ ఇండస్ట్రీ బిడ్డగా ముందుకొస్తా, బాధ్యత తీసుకుంటా, అదీ అవసరమైన సందర్భాల్లో మాత్రమే… అంతేతప్ప ఇద్దరి పంచాయితీలకో, రెండు యూనియన్ల తగువులకో తగుదునమ్మా అని దూరలేను’’ అని కుండబద్ధలు కొట్టేశాడు… స్థూలంగా చూస్తే బాగుంది… నిజానికి ఇదే పెద్దరికపు మాట…
అయితే తనకు తత్వం బోధపడింది అనుకోవాలి, అంటే… ఇండస్ట్రీ పెద్దగా గతంలో దాసరి పోషించిన పాత్ర పోషించాలని తనకూ ఉంది… ఆ ప్రయత్నాలు చేసిన ఉదాహరణలు కూడా కనిపిస్తాయి… కానీ ఎవరు చెబితే ఎవరు వింటారు ఇండస్ట్రీలో ఇప్పుడు..? పంచాయితీ చెబితే, ఒక్కరు వినకపోయినా ఇజ్జత్ పోతుంది… ఇది గతంలో ఉన్న ఇండస్ట్రీ కాదు… ఎవరి పెత్తనాలు వాళ్లవే… మొన్నామధ్య మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్‌రాజ్ హోరాహోరీ సాగింది… కులం ప్రవేశించింది… మాటల యుద్ధం జరిగింది… ఎంటైర్ మెగాక్యాంపు ప్రకాష్‌రాజ్‌కూ జై అన్నారు… వెంటనే యాంటీ-మెగా క్యాంపు ఒక్కటై జై మంచువిష్ణు అనేసింది… జరిగింది చూస్తూ ఉండటమే తప్ప చిరంజీవి ఒక్కమాట మాట్లాడలేదు…
Ads
పెద్దబిడ్డ అనిపించుకోవాలనే తాపత్రయంలోనే అటు జగన్‌తో, ఇటు కేసీయార్‌తో ఏ భేదాభిప్రాయం రాకుండా వ్యవహరించాడు, ఒకటీరెండు చోట్ల జగన్ పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశాడు కూడా… ఓసారి మిగతా పెద్దలతో కలిసి తన వద్దకు వెళ్లినట్టున్నాడు కూడా… కానీ టికెట్ల ధరల పంచాయితీ వచ్చినప్పుడు జగన్ ధోరణి అర్థమై చిరంజీవి దూరంగా ఉండిపోయాడు… ఇండస్ట్రీని నష్టపరచొద్దు అని ఓ విజ్ఞప్తి చేశాడు, అంతే… టికెట్ల ధరలు పెంచేయగానే కేసీయార్‌కు థాంక్స్ చెప్పాడు… అంతకుమించి టికెట్లు, ఆన్‌లైన్ బుకింగుల యవ్వారంలోకి తలదూర్చలేదు… పొలిటికల్‌గా కూడా తటస్థంగా ఉండిపోతున్నాడు… పేరుకు ఇంకా కాంగ్రెస్‌లో ఉన్నాసరే…!
నిష్ఠురంగా ఉన్నా సరే, ఓమాట చెప్పుకోవాలి… అల్లు అరవింద్ ఓ నిర్మాత, ఎగ్జిబిటర్ల సిండికేట్, ఒక ఓటీటీ, డిస్ట్రిబ్యూటర్, ఇంట్లో హీరోలు… తనే పెద్ద వ్యవస్థ… ఏదైనా పంచాయితీ వస్తే ఉదాహరణకు అరవింద్ చెబితే దానికి ఓ ‘బరువు’ అనగా వెయిట్ ఉంటుంది… అలాగే దగ్గుబాటి సురేష్, థియేటర్లను చెరబట్టిన ఆసియాన్ సునీల్ నారంగ్, దిల్ రాజు ఎట్సెట్రా… వీళ్లంతా చిరంజీవి చెబితే వినేవాళ్లే కావచ్చుగాక… అరవింద్ అయితే సొంత బావమరిదే కావచ్చుగాక… కానీ ఇండస్ట్రీలో దేనికదే… అసలు చిరంజీవి ప్రజారాజ్యాన్ని అరవింద్ తెర వెనుక నుంచి నడిపించకుండా ఉంటే, ప్రస్తుతం చిరంజీవి పాత్ర ఏపీ రాజకీయాల్లో నిర్ణాయకంగా ఉండేది… సో, రకరకాల అనుభవాలు, ఫలితాలు, తన పరిమితులు సరిగ్గా అవగాహన చేసుకున్నాడు కాబట్టే చిరంజీవి నుంచి ఈ ‘పెద్దమనిషి మాటలు’… గుడ్… నిజమే, పది మందీ తను చెప్పినట్టు వింటే పెద్ద తలకాయ, లేదంటే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు, అందుకని ప్రతి పంచాయితీలో తలదూర్చకుండా ఉండటం బెటర్ కదా… చిరంజీవి చేస్తున్నది అదే… పైగా మంచు మోహన్‌బాబు, జగన్ బంధువు బలం పెరిగింది… ఆల్‌రెడీ మొదలుపెట్టేశాడు… ఈ లేఖ చదవండి… పెద్దరికాల మాట వినగానే చిరంజీవి ఎటువైపు చూసి సందేహిస్తున్నాడో అర్థమవుతుంది…
Share this Article