ఒక ఎమ్మెల్యే… అత్యంత విలువైన అర ఎకరం భూమిని ఆక్రమించాడు… చాలా ఏళ్లుగా నలుగుతున్న సమస్య… ఆ ఆక్రమణ ఊరివాళ్లకు కూడా సమస్యల్ని తీసుకొస్తోంది… పైగా అది చెరువు భూమి… ప్రహారీ కట్టాడు… ప్రతిపక్షమంతా ఏకమైంది… బంద్ నిర్వహించారు… మందలుగా వెళ్లి ఆ ప్రహారీ కూల్చేశారు… పోలీసులు కేసులు పెట్టారు… కొన్ని గంటలపాటు ఉద్రిక్తత… సమస్య ఇప్పటికీ అలాగే ఉంది……… ఇదీ వార్త… ఇప్పుడున్న స్థితిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ఇతర పార్టీలన్నీ ఏకమై తిరగబడటం, అక్రమ నిర్మాణాల్ని కూల్చేయడం అనేది జర్నలిస్టు కోణంలో ఇంట్రస్టింగు, ఇంపార్టెంటు వార్త…
మరి ఏ పత్రిక ఎలా కవర్ చేసింది..? ఉర్దూ, ఇంగ్లిషు పత్రికలకు ఇది పెద్దగా ఆనకపోయినా.., తెలుగు పాఠకుల్లో ఎక్కువ రీచ్ ఉండే మెయిన్ స్ట్రీమ్ పత్రికలయితే ప్రయారిటీ వార్తే కదా..? ఇక్కడ ఎమ్మెల్యే తప్పు చేశాడా..? ప్రతిపక్షాల ఆరోపణలో తప్పుందా అనే చర్చలోకి వెళ్లడం లేదు… జస్ట్, ప్రజలు, ప్రతిపక్షాల ఆగ్రహాన్ని ఎవరెలా రిపోర్ట్ చేశారనేది మాత్రమే పరిగణనలోకి తీసుకుందాం… ఎందుకంటే… పత్రికలు ఇప్పుడు పత్రికల్లాగా లేవు కదా… పార్టీలను బట్టి అనేక రంగులు… పైగా ఇది పొలిటికల్ లింకున్న వార్త… అధికార పార్టీ ఎమ్మెల్యే…
….. ఈ శీలపరీక్షలో మంచి మార్కులతో పాసయింది ఆంధ్రజ్యోతి… ఫస్ట్ పేజీలో ఒక ఫోటో… అందులోనే అసలు సమస్య ఏమిటో అర్థమైపోతోంది… ఇన్సెట్లో ప్రహారీని కూల్చేస్తున్న ఫోటో… అసలు వార్త సారాంశం ఏమిటో బ్లర్బులు… సరైన ప్రయారిటీ… అదే సమయంలో పాత్రికేయ కోణంలో ఆ ఎమ్మెల్యే వివరణకు కూడా సరైన ప్రాధాన్యం ఇచ్చి, ఆ వార్తతోపాటే ప్రచురించింది… కరెక్ట్ రిపోర్టింగ్… ఎమ్మెల్యే వెర్షన్ ఏమిటో కవర్ చేయడం సరైన పద్ధతి… మహాగ్రహం అనే హెడింగ్ మాత్రం ఆప్ట్ కాదు… కాస్త అతి…
Ads
ఈమధ్య చాలాకాలంగా రంగు, రుచి, వాసన, చిక్కదనం లేకుండా పోతున్న ఈనాడు ఈవిషయంలోనూ హ్యాండ్సప్… జిల్లా పేజీకి పరిమితం చేసుకుంది… అదీ కేసులు, ఉద్రిక్తత అనే కోణానికే సరిపుచ్చింది… సాక్షి లోపల పేజీలో కవర్ చేసినా సరే, వార్త బాగానే కనిపించేలా పెట్టింది… ఈమధ్య మరీ నమస్తే సాక్షిలా మారిపోయిన పత్రికలో ఈ వార్తకు ఈమాత్రం ప్రయారిటీ దక్కడం అభినందనీయమే…
మిగిలిన పత్రికల్లో చెప్పదగింది నమస్తే తెలంగాణ… తమ ఎమ్మెల్యేకు సంబంధించిన వార్త కాబట్టి దాని జోలికి పోలేదు… వెళ్తే అది తనకుమాలిన ధర్మం అవుతుంది కూడా… కానీ ఇలాంటి సందర్భాలొచ్చినప్పుడు, అసలు విషయం చెప్పకుండా… తమ పార్టీ వెర్షన్ అచ్చేయడం దానికి అలవాటు… ఈసారి ముత్తిరెడ్డి వెర్షన్ ప్రముఖంగా వేస్తుందేమో అనుకున్నారు అందరూ… తమాయించుకుంది… గుడ్…
ఈమధ్య ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వెలుగు లోపలి పేజీల్లో వేసుకుంది… వివరాలన్నీ కవర్ అయ్యాయి కానీ… ప్రయారిటీపరంగా అది సరైన ప్లేస్మెంట్ కాదు… ఈ విషయంలో సీపీఎం కాస్త దూకుడుగానే వ్యవహరిస్తోంది కాబట్టి… నవతెలంగాణ కూడా ఓ డబుల్ కాలమ్ పబ్లిష్ చేసింది… తనకున్న స్పేస్ పరిమితుల్లో బెటర్ కవరేజీయే… ప్రభ ఎలాగూ నమస్తే ప్రభ… డిజిటల్ పేపర్ దిశ జిల్లా పేజీలో బాగానే పబ్లిష్ చేసింది కానీ… హుస్నాబాద్ నుంచి రిపోర్ట్ చేయడం ఏమిటో ఎవరికీ సమజ్ కాలేదు…
ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… ఈ సంఘటనే కాదు, ఇంకా పెద్ద వార్తలు ఏమున్నా సరే… పత్రికలు ప్రజలు, వార్త కోణంలో కాదు, జస్ట్, పార్టీల కోణంలో, తమ ప్రయోజనాల కోణంలో మాత్రమే చూస్తాయి, అచ్చేస్తాయి అని మరోసారి నిర్ధారించుకోవడానికి… ఈ లిట్మస్ టెస్టు…! టీవీల కవరేజీ గురించి పెద్దగా చెప్పుకోవడం కూడా దండుగే…!!
Share this Article