ఎప్పుడైనా ఓ ముఖ్యమంత్రి ఎటైనా వెళ్తున్నప్పుడు గమనించారా..? ఓ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉంటుంది… ముందుగా రూట్ క్లియరెన్స్… తరువాత పోలీస్ వెహికిల్స్ వెళ్లి, మార్గమధ్యంలో రోడ్లు, కూడళ్ల వద్ద ట్రాఫిక్ ఆపేస్తాయి… బ్రిడ్జిలు, ఫ్లయ్ ఓవర్లు ఉంటే వాటి మీదకు కాన్వాయ్ దాటిపోయేదాకా వాటిపైకి జనాన్ని రానివ్వరు… కాన్వాయ్ ఒక్కసారి బయల్దేరిందంటే ఇక ఎక్కడా ఆగేది ఉండదు, అంత పక్కగా ఉంటయ్ ఏర్పాట్లు, ప్లానింగ్… మరి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు రక్షణతోపాటు దేశంలోకెల్లా అత్యంత పటిష్ఠ భద్రత ఏర్పాట్లు ఉండే ప్రధాని రాకపోకలకు ఎంత సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉండాలి..?
ఈ దేశప్రధానికి వందల కోట్ల ఆధునిక కాన్వాయ్ వెహికిల్స్, ఆయుధాలు మాత్రమే కాదు… భద్రత ప్రమాణాల్లో డొల్లతనం మీద ఎప్పటికప్పుడు సమీక్ష జరగాలి… సరిదిద్దబడాలి… అదుగో అదే లోపించింది… ఫలితం :: పంజాబ్‌లో ఓ విస్మయకరమైన ఎపిసోడ్… ఓ ఫ్లయ్ ఓవర్ మీద ప్రధాని కాన్వాయ్ 15-20 నిమిషాలపాటు ఆగిపోవాల్సి వచ్చింది… ప్రొటెస్టర్లు అడ్డంగా వెహికిల్స్ పెట్టేశారు… తన ప్రోగ్రాం ఒకటి రద్దు చేసుకుని వాపస్ వెళ్లిపోవాల్సి వచ్చింది… నిజానికి ప్రధాని సెక్యూరిటీ బాధ్యత తీసుకోవాల్సిన పంజాబ్ ప్రభుత్వానిదే కాదు… ప్రధాని సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో నిర్లక్ష్యం కూడా కనిపిస్తోంది… ఇక్కడ ప్రధాని ఎవరు, ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరిది అనేది ముఖ్యం కాదు, మన సిస్టమ్స్ సిగ్గుపడాల్సిన దయనీయ పరిస్థితి కదా…
Ads
నిజానికి తను హుస్సేనీవాలాలో జాతీయ అమరవీరుల స్మారకం దగ్గరకు వెళ్లాలి… దానికోసం భటిండా చేరుకున్నాడు… అక్కడి నుంచి ఛాపర్‌లో గమ్యం చేరాలి… కానీ బ్యాడ్ వెదర్ కారణంగా సాధ్యపడలేదు… పావుగంట చూసి, ఇక రోడ్డు మార్గంలో వెళ్లాలని నిర్ణయించారు… రెండు గంటలు పడుతుంది… సో, ముందుగా పంజాబ్ డీజీపీకి సమాచారం ఇచ్చారు… అనుకోని మార్పు కాబట్టి, పంజాబ్ డీజీపీ వెంటనే ఓ కంటింజెన్సీ ప్లాన్ ప్రకారం సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలి… కానీ ఏం జరిగింది..? గాలికి వదిలేశారు… ఆ మెమోరియల్ మరో 30 కిలోమీటర్లు ఉన్నదనగా ఫ్లయ్ ఓవర్ మీద చిక్కుపడిపోయింది ప్రధాని కాన్వాయ్… తరువాత ప్రోగ్రాం రద్దు చేసుకున్నాడు ప్రధాని…
అసలు ఆ ఫ్లయ్ ఓవర్ మీదకు వెహికిల్స్‌ను ఎలా అనుమతించారు..? ఇంత త్వరగా ప్రధాని వ్యతిరేక ఆందోళనకారులు అక్కడ ఎలా గూమిగూడారు..? కాన్వాయ్ ముందు వెళ్లాల్సిన అడ్వాన్స్ రోడ్ క్లియరెన్స్ పార్టీలు ఏమయ్యాయి..? ఒక అడ్వాన్స్ పెట్రోలింగ్ వెహికిల్ ఫ్లయ్ ఓవర్ దాటాక కదా, అసలు కాన్వాయ్ ఫ్లయ్ ఓవర్ మీదకు ఎక్కాల్సింది..? ఈ మొత్తం వ్యవహారంలో ఎస్పీజీ ఇన్చార్జి ఏం చేస్తున్నట్టు..? ఇప్పుడు కేంద్ర హోం శాఖ పంజాబ్ ప్రభుత్వాన్ని ఓ రిపోర్ట్ అడిగిందిట… నేనెన్నిసార్లు ఫోన్ చేసినా సీఎం స్పందించలేదు అంటాడు బీజేపీ అధ్యక్షుడు నడ్డా… సెక్యూరిటీ లోపాలకు సంబంధించి బాధ్యులను గుర్తించి, యాక్షన్ తీసుకుని, నివేదిక పంపండి అని చెప్పిందట హోం శాఖ… అదేమీ అయ్యేది లేదు, పోయేది లేదు… ఎన్నికలకు ముందు, రాజకీయ సున్నితత్వం దృష్ట్యా పంజాబ్ ప్రభుత్వాన్ని ఫిక్స్ చేసేందుకు కేంద్రమూ సిద్దపడదు… ఐనా మేఘాలయ గవర్నర్, బెంగాల్ సీఎం ఇష్టారాజ్యం మాట్లాడితేనే కిక్కుమనలేని స్థితి, ఇక పంజాబ్ సర్కారు జోలికి ఏం వెళ్తారులే…!!
Share this Article