Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జనమా… ఇది వనమా..?! తెలంగాణలోని ప్రతి గుండె కలుక్కుమంది..!!

January 7, 2022 by M S R

తెలంగాణలోని ప్రతి గుండె కలుక్కుమంది… ఇద్దరు ముద్దులొలికే కవలపిల్లలు, అమాయకత్వం మూర్తీభవించిన ఆ ఇల్లాలు, నిస్సహాయుడిగా కుటుంబం మొత్తాన్ని బలిపెట్టిన ఆ భర్త… ! కారకుడు వనమా రాఘవ… ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు… ఆ భర్త తమ ఆత్మహత్యకు కారకులెవరో, కారణాలేమిటో వివరిస్తూ పెట్టిన సెల్ఫీ వీడియో నిన్నంతా వైరల్… చెమర్చని కన్ను లేదు… తిట్టని నోరు లేదు… అవును, మనం జనంలో బతుకుతున్నామా..? వనంలో బతుకుతున్నామా..? ఏమో, వనమే నయమేమో… వనంలోని క్రూరమృగాలు సైతం ఇలా ఉండవ్… కుటుంబ తగాదా ఒకటి తన దర్బారుకు వస్తే, ఆ బలహీనుడి ఆస్తిపై కన్నేసి, కాటేసి, కాజేసి, తీరా ఆయన పెళ్ళాం పైకి కన్ను మళ్లి, నీ పెళ్లాన్ని తీసుకురా అని హుకుం జారీ చేసిన ఆటవికధోరణికి, ఆ కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రత్యక్ష, పరోక్ష బాధ్యులందరికీ ఉసురు తగలడం మాత్రం ఖాయం… (ఆ కీచక దర్బారుకు న్యాయం కోరుతూ వెళ్లిన అక్క, తల్లి కళ్లు చల్లబడ్డాయా…)

vanama

అవును, తన చరిత్ర బయటికొస్తోంది… కొత్తగూడెం ప్రజలకు తెలుసేమో, కానీ ఇప్పుడు మొత్తం తెలుగు జనానికీ తెలిసొచ్చింది… కన్నుపడితే కబ్జా… ఆడదైనా సరే, ఆస్తయినా సరే… ఎవడైనా సలాం కొట్టాల్సిందే, అడిగింది సమర్పించుకోవాల్సిందే… పర్‌ఫెక్ట్ ప్యూర్ విలన్ కేరక్టర్… ఇప్పుడు ఓ బాధితుడు రామకృష్ణ మరణవాంగ్మూలం తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది… కానీ బయటపడని ఉదంతాలు ఎన్ని..? చివరకు అప్పట్లో ఓ పోలీస్ అధికారి భార్య మీద అత్యాచారం చేస్తే, ఆయన ఏమీ చేయలేక, సర్వీస్ రివాల్వర్‌తో సూసైడ్ చేసుకున్నాడనే విషయం షాకింగే… నిజానికి ప్రతి ఖాకీ గుండె రగిలిపోతూ ఉండాలి కదా…

Ads

vanama

ఎవరిది అలుసు..? తండ్రిది అలుసు, తండ్రి అధికారం ఇచ్చిన అలుసు… ఎమ్మెల్యేలకు అపరిమిత అధికారాలను ఇచ్చి, ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని ఓ సంస్థానంలా మార్చేసి, అనేకమంది నయా దేశ్‌ముఖ్‌లను రూపొందించిన సర్కారు విధానాలది తప్పు… మనం చాలాసార్లు చెప్పుకున్నాం… ఈ కొత్త గడీల దొరలు కోరిన వాళ్లే ఎమ్మార్వోలు, ఆర్డీవోలు, డీఎస్పీలు, సీఐలు… నచ్చకపోతే బదిలీలు… పైగా మళ్లీ మీకే టికెట్లు అనే భరోసాలు… ఇంకేం కావాలి..? నిజానికి కేసీయార్ టైటానిక్‌ను ముంచబోయేది వీళ్లే… రాజకీయాల్లో పండిపోయిన తను ఈ లాజిక్, ఈ ఫ్యాక్ట్ ఎందుకు అర్థం చేసుకోవడం లేదో తెలియదు… ప్రభుత్వపరంగా, పార్టీ విధానాలపరంగా ఎన్ని పథకాలు తీసుకొచ్చినా సరే, ఇలాంటోళ్ల ఆటవిక ధోరణులతో భగ్గుమనే నెగెటివిటీ ఆ పాలనతాలూకు పాజిటివిటీని మింగేస్తుంది…

vanama

సమాజం అన్నీ చూస్తుంటుంది… లోలోపల చర్చ సాగుతూ ఉంటుంది… ప్రతిసారీ ఏదో ఒక ఎమోషన్ గట్టెక్కించదు… గండికొట్టేది ఇలాంటి చరిత్రలే… వనమా రాఘవకు ఇప్పటికీ తండ్రి వెనకేసుకురావడమే… తన కొడుకు నిర్దోషిత్వం నిరూపితమయ్యేవరకూ రాజకీయాలకు, నియోజకవర్గానికి దూరంగా ఉంచుతాడట… అంటే ఇప్పటికీ మావాడు శుద్ధపూస అని చెబుతున్నట్టేనా..? మరి ఇన్నాళ్ల తన చరిత్ర మాటేమిటి..? రామకృష్ణ కుటుంబం సూసైడ్ ఉదంతంపై నిన్న మీడియాకు ధైర్యం లేదు… నిజాలు చెప్పడానికి… సోషల్ మీడియా ఆ వీడియోను వైరల్ చేసింది… ఫలితంగా ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కదలక తప్పలేదు… ‘ఈనాడు’ ఫస్ట్ పేజీ ఫస్ట్ లీడ్ వార్త చూస్తే ఆశ్చర్యం వేసింది… ఇది ఈనాడేనా అనిపించేలా… ఇన్నాళ్ల చప్పిడితిండికి ఒక్కసారిగా ఇంత ధైర్యమొచ్చిందేమబ్బా అనిపించేలా…

vanama

నిజానికి ఈ వ్యతిరేకత సెగ ప్రభుత్వానికి అర్థమైంది… డ్యామేజీ జరుగుతోందని తెలుసుకుంది… అందుకే వెంటనే రాఘవ మీద కేసులు నమోదయ్యాయి… ఎమ్మెల్యే వేరే దిక్కులేక విచారణకు సహకరిస్తానంటూ ఓ లేఖ రాశాడు… అరెస్ట్ విషయంలో కొంత సందిగ్ధం కనిపిస్తోంది… కానీ కేసీయార్ నిజంగానే ఓసారి ఒంటరిగా కూర్చుని ఓ సీరియస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి… ‘‘ఇలాంటి నయా దేశ్‌ముఖ్‌లతో తనకు, తన పార్టీకి ఏం లాభం..? తెలంగాణ సమాజానికి ఏం లాభం..? ఇంతగా పాలుపోసి పెంచితే, రేప్పొద్దున అవి కాటేసేది ఎవరిని..? ఇప్పుడేం చేయాలి..? అభివృద్ధి అంటే నాలుగు డబ్బులు పంచడం, సంపాదించడం కాదు, ఇదుగో ఈ మృగాలు మీదపడని స్వేచ్ఛాయుత, భయరహిత సమాజం… అదే కదా ప్రత్యేక తెలంగాణ కోసం స్వప్నించిన లక్ష్యం… మరి ఈ విషవృక్షాలు ఎలా వేళ్లుపాతుకున్నయ్…’’ ఈ విషయంలో కేసీయార్ నుంచి తెలంగాణ సమాజం ఓ సీరియస్ స్పందనను ఆశిస్తోంది…

vanama

ఆ కవలల్లో ఒక బిడ్డ ఒళ్లంతా కాలిపోయి, ఆసుపత్రిలో చేర్చబడింది కదా, ఆ అమ్మాయి కూడా ఈ చావుబతుకుల సమరంలో ఓడిపోయింది… ఈ పాపిష్టి లోకాన్ని చూసి, భయపడి, ఉండలేనంటూ తల్లిదండ్రుల వద్దకే వెళ్లిపోయింది… ఇంకా ఈ 77 ఏళ్ల వనమా పార్టీని, జనాన్ని ఉద్దరించేదేమీ లేదు సారూ… ఇప్పటికే జనం చస్తూ బతుకుతున్నారు అక్కడ… (విక్రమార్కుడు సినిమాలో విలన్, తన కొడుకు, ఎస్సై భార్యను ఎత్తుకుపోవడం వంటివన్నీ గుర్తొస్తున్నాయ్…) ఈ బురదను కడుక్కుంటే పార్టీకే మేలు… అవునూ… ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాయి కదా వివిధ రాజకీయ పార్టీలు, ఇదే కేసీయార్ రేప్పొద్దున ఇలాంటి కేరక్టర్లను వదిలించుకుంటే, ఇవే పార్టీలు వెళ్లి కండువాలు కప్పి మరీ, అలుముకుని తమ పార్టీల్లోకి స్వాగతిస్తాయి… పేరుకు తెలంగాణ మేధోసమాజం చైతన్యశీలం అనుకోవడమే గానీ ఒక్క గొంతూ పెగలదు… ఆఁ ఏముంది, అరెస్ట్ చేస్తే ఏమవుతుంది..? నాలుగు రోజులకు బయటికొస్తాడు… ఆ భయానక కొత్తగూడెం అడవిలో పడి స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాడు కదా అంటారా… అదీ నిజం… అదే నిజం…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions