కొన్ని కథలు ఇంతే… ఎవరిదీ తప్పు అని ఒకేసారి నిర్ధారణగా చెప్పలేం… బాహుబలి తరువాత ప్రభాస్ సరైన ప్లానింగుతో ఈరోజు పాన్ ఇండియా స్టార్‌గా వేల కోట్ల విలువైన ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు… తనతో సరిసమానంగా బాహుబలి విజయాన్ని ఎంజాయ్ చేసిన రానా మాత్రం సరైన పాత్రల ఎంపిక లేక, కెరీర్ ప్లానింగ్ సరిగ్గా లేక ‘అరణ్య’లు, 1945, విరాటపర్వం గట్రా చేస్తూ నానాటికీ మెట్లు దిగుతున్నాడు… సర్లె, ఎవరి అదృష్టానికి ఎవరు బాధ్యులు..? డెస్టినీ డిసైడ్స్…!! 1945 సినిమా చూస్తే మీకు పిచ్చి కోపం వస్తే అది మీ తప్పు కాదు… (ఈమాత్రం సినిమాలకు ఇంకా టికెట్ల రేట్లు పెంచాలట, అసలు ఇలాంటి సినిమా టికెట్లు కొన్నాక, సరుకు బాగాలేదు కాబట్టి, అన్ ఫినిష్డ్ సరుకు కాబట్టి, మరి డబ్బు వాపస్ ఎవడిస్తాడు..?)
రెండేళ్ల క్రితం కొన్ని వార్తలు అనుకోకుండా చదవబడ్డాను… ఏమిటంటే..? అప్పట్లో బాహుబలి తమిళ రైట్స్ తీసుకున్న ఎస్.ఎన్.రాజరాజన్‌కు రానాతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది… భారీ బడ్జెట్‌తో ఓ దేశభక్తి సినిమాను సత్యశివ దర్శకత్వంలో చేయాలని ప్లాన్ చేశారు… రెజీనా కసాండ్రా హీరోయిన్… సత్యరాజ్, నాజర్ ముఖ్యపాత్రలు… యువన్ శంకర్ రాజా సంగీతం… అన్నీ బాగానే కుదిరాయి… పైగా పీరియాడిక్, దేశభక్తి కథల ట్రెండ్… కానీ కొన్నాళ్లకు నిర్మాతకూ, రానాకు నడుమ ఏవో భేదాభిప్రాయాలు వచ్చినయ్… సినిమా ఆగిపోయింది… ఈలోపు రానా వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయిపోయాడు, కొన్నాళ్లు కరోనా సంక్షోభం… షూటింగు జరిగే స్థితి కూడా లేదు… పైగా నిర్మాతకూ రానాకు నడుమ గ్యాప్ అలాగే ఉండిపోయింది, ట్విట్టర్‌లో మాటామాటా అనుకున్నారు…… ఇదీ ఆ వార్తల సారాంశం…
సినిమా చూస్తుంటే అనిపించేది ఒకటే… అప్పట్లో ఆగిపోయిన ఆ సినిమాకు అలాగే డబ్బింగ్ చెప్పించేసి, యథాతథంగా రిలీజ్ చేశారు… చివరకు రానా డబ్బింగ్ కూడా లేదు… ఉండే అవకాశం కూడా లేదు కదా… కానీ లీగల్‌గా రానా నిర్మాత ఆ మూవీ రిలీజ్ చేయకుండా ఆపలేడు… తను కూడా నిర్మాతల కుటుంబం నుంచి వచ్చినవాడే… ఐనా ఆ సోయి కనిపించలేదు… అనేక సీన్లు, చివరకు క్లైమాక్స్ కూడా అర్థంతరంగా ఎండ్ అయిపోతుంది… టికెట్టు కొని థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుడు పిచ్చోడు… అంతే… సదరు తమిళ నిర్మాత ఉద్దేశం అదే… ఈ సగం సినిమాను నిర్మాత కల్యాణ్ తీసుకున్నట్టున్నాడు… తనే రిలీజ్ చేశాడు… ఈయన మరీ గొప్పాతిగొప్ప నిర్మాత కదా… ప్రేక్షకులంటే అమితాతి గౌరవం…! అసలు సినిమా ప్రమోషన్ ఏమీ కనిపించనప్పుడే అర్థమైంది ఇదేదో తేడా సినిమా అని…!!
Ads
నిజానికి సినిమా కథ బాగుంటుంది… బర్మా బ్యాక్ గ్రౌండ్‌లో ఓ యువకుడు బ్రిటిషర్లపై సాగించే స్వతంత్ర పోరాటం… సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది… ఇండియా నుంచి బర్మా (మయన్మార్) వెళ్లిన రానా ఏ పరిస్థితుల్లో ఈ పోరాటంలో భాగస్వామి కావల్సి వచ్చింది, ఈ రెజీనా ఎవరు..? ఇదీ కథ… దర్శకుడు కూడా ఫిలిమ్ మేకింగులో మంచి అనుభవం ఉన్నవాడే… మరీ తీసిపారేయదగిన దర్శకుడు కాదు… ఆకుల శివ డైలాగ్స్… కానీ రానా మధ్యలో తప్పుకోవడంతో సీన్ల సీక్వెన్స్ దెబ్బతింది… అందుకే ఓ ఎమోషన్ లేదు, లాజిక్కులు లేకుండా కథ ఏదో నడిపించామనిపించారు… సరే, వాళ్లూ వాళ్లూ ఏమైపోతేనేం… సగటు ప్రేక్షకుడి దృష్టికోణంలో చూస్తే… ‘‘సగం తీసిన సినిమాను మా మొహాన ఎందుకు విసిరికొట్టారు భయ్..?!
Share this Article