పదేళ్ల సినిమా ప్రయాణం… పేరు ఆది… సాయికుమార్ వంటి నటుడి వారసత్వం… కాస్త వాచికం, నటన తెలిసిన మెరిట్… చూడచక్కని రూపం… అబ్బే, ఇవన్నీ ఎవరిక్కావాలి..? ఆల్‌రెడీ ఇంకో ఆది ఉన్నాడు, తనకూ కెరీర్ భారీ ఎత్తుపల్లాలు… ఈ ఆది కూడా అంతే… ఒక్కటంటే ఒక్కటీ ‘ఇది నా సినిమా’ అని చెప్పుకునే సినిమా లేదు ఇప్పటికీ…! ప్రయత్నలోపం ఏమీ లేదు… కానీ ఇండస్ట్రీలో పనిచేసే అంశాల్లో ప్రతిభ ఒకశాతమే… మిగతా 99 శాతం బ్యాక్ గ్రౌండ్, లక్కు… ఆది సాయికుమార్‌కు అది సహకరించడం లేదు… తాజా ఉదాహరణ ‘అతిథి దేవోభవ’…
నిజానికి ప్రస్తుతం ట్రెండ్ ఏమిటంటే..? విభిన్న టైమ్ జోన్ల నడుమ కథ ప్రయాణం, దేశభక్తి అనే ఎమోషన్ దట్టించిన కథలు, బయోపిక్కులు, కాదంటే జాతిరత్నాలు తరహాలో ఫుల్ లెంత్ కామెడీ కథలు… ఎస్, రకరకాల మానసిక సమస్యలతో కూడిన సినిమాలు అప్పట్లో వచ్చేవి… బాగా నడిచాయి… చంద్రముఖి తీసుకొండి, హీరోయిన్ మెంటల్ డిజార్డర్ అది… కానీ మాయలు, మంత్రాలు, మెంటల్ చికిత్స, కాస్త వెకిలి కామెడీ అన్నీ కలిపి వండారు… కానీ కథలో దమ్ముంది కాబట్టి సినిమా సూపర్ హిట్… మలయాళం, కన్నడం భాషల్లో ఇంకాస్త మెరుగు… అపరిచితుడు కూడా అంతే కదా…
Ads
అంతెందుకు, గజిని కూడా అదే టైపు, కాకపోతే మ్యాన్ మేడ్ మెంటల్ డిజార్డర్… కాకపోతే ఇవి సమర్థులైన దర్శకుల చేతుల్లో పడి, మెరుగులు దిద్దుకుని, ప్రేక్షకార్షణీయంగా రూపొందిన థ్రిల్లర్లు… ఆ హీరోల రేంజ్ కూడా బాగా ఉపయోగపడ్డవి… అది కాదంటే మతిమరుపు సబ్జెక్టుతో భలేభలే మగాడివోయ్, ఓసీడీ కాన్సెప్టుతో మహానుభావుడు… అవి కామెడీ బేస్డ్ కథనాలు… ఆ సీన్స్ బాగా రాసుకోబడ్డయ్ కాబట్టి సినిమాలు క్లిక్కయ్యాయి… చైతూ నటించిన సవ్యసాచి మరో తరహా… కానీ ఇప్పుడు ఆ తరహా కథలు పెద్దగా ట్రెండింగ్ కావు… కానీ ఆదిసాయికుమార్ ఆ జానర్ ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు…
మోనోఫోబియా అనే ఓ మెంటల్ డిజార్డర్ కథను ఎంచుకున్నారు సరే… అంటే ఒంటరిగా ఉండలేకపోవడం… భయం… చచ్చిపోవాలని అనిపించడం… ఓ ప్రేమికురాలు దీన్ని భరించలేక బ్రేకప్ అనేస్తుంది… సువేక్ష అనే మరో హీరోయిన్ తన జీవితంలోకి వస్తుంది… హీరో నిజం చెప్పడు, చెప్పలేడు… ఐనా చెబితే ఇక కథేముంది..? ఈలోపు పోలీసులు, సైకో ముద్ర, అరెస్టు… అదొక కథ… కానీ దాన్ని జనరంజకంగా మలచడంలో దర్శకుడు ఫ్లాప్… ఆది ఎలా నటించాడనేది అప్రస్తుతం… కొన్నిచోట్ల మరీ అతి అనిపించింది… ఒకటీరెండు పాటలు ప్లస్ కొత్త హీరోయిన్ సువేక్ష మాత్రమే ప్లస్ పాయింట్స్ సినిమాలో… ఇంకేమీ లేదు… బోర్, బోరర్, బోరెస్ట్… చివరిదాకా… చివరకు ఆ చివరి సీన్లతో సహా… అతిథి అనే ప్రేక్షకుడిని చావగొట్టి చెవులు మూస్తుంది… అతిథి భయానకో భవ…
నిజానికి రొటీన్, పిచ్చి ఫార్ములా కథల జోలికి పోకుండా భిన్నమైన జానర్లు, కథలు ట్రై చేయడాన్ని ఆహ్వానించాలి మనం… కానీ అవి సరిగ్గా రూపొందాలి… మోనో ఫోబియా, మల్టీ ఫోబియా అంటూ నోరుతిరగని రోగాల కథల్ని ఎంచుకుంటే… సరైన ట్రీట్‌మెంట్ లేకుండా ప్రేక్షకుల్లోకి వదిలితే… ఇక మాటీవీ వాడి కార్తీకదీపానికీ, జీటీవీ వాడి సతీ త్రినయనికీ, ఈటీవీ వాడి యమలీలకూ తేడా ఏముంటుంది..? ఆ మెంటల్ కథలే నయం కదా… చూస్తూ కాసేపు పకపకా నవ్వుకోవచ్చు, ఆయా దర్శకుల అజ్ఞానానికి, మన టీవీ ప్రేక్షకుల దురవస్థకు జాలిపడుతూ…!! చివరగా :: హైదరాబాదీ అమ్మాయి సువేక్షకు మంచి పాత్రలు దొరికితే బాగా రాణించే చాన్స్ ఉంది… మరొకటి చెప్పాలి… ఈరోజు విడుదలైన 1945, అతిథి దేవోభవ సినిమాల్లో సప్తగిరికి కీలకపాత్రలే దక్కాయి… కానీ రెండూ నాసిరకం సరుకులే కాబట్టి సప్తగిరికి నిలువు నామాలు తప్పలేదు… ఆకట్టుకోలేదు…!!
Share this Article