బహుశా ఈ వార్త చదివాక చాలామంది నవ్వుతారు కావచ్చుగాక… ఈ చైసంచీ ఉద్యమం ఏంట్రా భయ్ అని…!! అసలు ఈ చైసంచీ అంటే ఏమిటి..? చేయి సంచీ, సైసంచీ, చైసంచీ… తమిళనాడులో మంజప్పై… అంటే చేతి సంచీ… ఇప్పుడంటే ప్రతి దానికీ ప్లాస్టిక్ కవర్లే కదా… ఈ చైసంచుల గురించి తెలిసినవాళ్లు తక్కువే… ఒకప్పుడు తమిళనాడే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు ఎటు వెళ్లినా ఓ చేయిసంచీ ఉండేది… బట్టతో కుట్టిన సంచీ… తమిళనాడులో అయితే పసుపు రంగులో ఉండేవి…
పెళ్లిళ్లకో, ఫంక్షన్లకో వెళ్తే… వధూవరుల పేర్లతో ముద్రించినవీ, లేకపోతే ముగ్గులు, దేవుళ్ల ఫోటోలు, పులిజూదం, అష్టాచెమ్మాల ప్రింటింగులతో కూడిన సంచులు… జేబులో ఇమిడేవి… ఏవైనా గిఫ్టులు ఇస్తే వాటిల్లోనే… అదొక సంప్రదాయం… ఏ ఇంటికి వెళ్లినా ఇలాంటి చైసంచులు బోలెడు… బయటికి వెళ్తే వెంట ఉండాల్సిందే… మధ్యలో కూరగాయాలు కొనాల్సి వస్తే, కిరాణ సామాగ్రి కొంటే, పండ్లు కొనుక్కుంటే వెంటనే చైసంచుల్లో చేరాలి… ఇంటికి చేరాలి…
మన ముఖ్యమంత్రులు అసలు బయటికే రారు, ఇలాంటివి అసలే పట్టవు, పట్టాలని ఆశించడమూ అత్యాశే… పెద్ద పెద్ద విషయాలకే జనంలోకి రావడం మానేశారు, ఈ చైసంచుల మాటేమిటి..? ఆఫ్టరాల్, నాన్సెన్స్, చిల్లర..! కానీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అలా అనుకోలేదు పాపం… ప్లాస్టిక్ భూతాన్ని నియంత్రించే ఏ అంశాన్నైనా సీరియస్‌గా తీసుకుంటున్నాడు… గత నెలలో Meendum Manjapai Vizhipunarvu Iyakkam అనే ఉద్యమానికి సపోర్ట్‌గా నిలిచాడు… అంటే మళ్లీ చైసంచుల కాలాన్ని తీసుకొద్దాం అని…!
Ads
హేమిటో, ఈ ముఖ్యమంత్రి ఏమిటో… ఎవరో చైసంచీ ఉద్యమ ఫౌండేషన్ ఓ ప్రోగ్రాం పెట్టగానే…. వాటిని మళ్లీ పునరుద్ధరిద్దాం అనగానే నేరుగా వెళ్లిపోయి, ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం ఏమిటో అంటారా..? ఫాఫం, ఆయనకు మన ముఖ్యమంత్రులకు ఉన్నంత సోషల్ కాన్షియస్నెస్ లేదు కదా… నిజానికి మనం పాతవన్నీ ఛాందసాలు, చాదస్తాలు, అనాగరికం, ఊరివేషం వంటి భ్రమల్ని తొలగించుకుని, వాటిని మన జీవనంలోకి ఆహ్వానించాల్సిన అవసరం ఇప్పుడు… కాదన్నవాడే అసలు మూర్ఖుడు…
మార్కెట్‌కు వెళ్లేటప్పుడు ఇంటి నుంచి సంచులు తీసుకెళ్లండిరా అంటే వినేవాడు దొరకడం లేదు… వాకింగ్ వెళ్లేటప్పుడు జేబులో పెట్టుకుపొండి, వచ్చేటప్పుడు ఏ పండో, ఏ కాయో, ఏ టాబ్లెట్‌లో, ఏ స్వీట్లో కొంటే అందులో వేసుకుని రండి… కర్రీ పాయింట్ల నుంచి తెచ్చుకునే రొట్టెలు గట్రా అందులో పడేయండి… కాగితాలు, హాస్పిటల్ రిపోర్టులకూ బెటర్… షాపింగ్ వెళ్తే ఓ మోస్తరు సామగ్రిని ఈ చైసంచీ చాలు… ప్లాస్టిక్ బ్యాగు కోసం డబ్బులు తగలేసే పనిలేదు… కారులో, బైకులో వెళ్తున్నా సరే ఈ సంచీ ఒకటి డిక్కీలో పడేయండి… కొన్ని సందర్భాల్లో ఎంత అక్కరకు వస్తాయో చూడండి… ఎటొచ్చీ దాన్ని ఓ చిన్నతనంగా భావించకండి… అదొక అవసరంగా భావించండి చాలు… మాసినట్టు అనిపిస్తే రెండుసార్లు నీళ్లలో జాడించి, ఆరేయండి, బస్… ఫ్రెష్ అండ్ న్యూ బ్యాగ్ రెడీ… పాటిద్దాం డ్యూడ్, పోయేదేముంది, ఆ ప్లాస్టిక్ భూతపు ప్రభావం తప్ప…!!
Share this Article