సాధారణంగా మస్తు బ్యాక్ గ్రౌండ్ ఉండి, వారసులుగా తెర మీదకు అడుగుపెట్టే నటులకు కొన్ని మినహాయింపులు ఉంటయ్… పెద్దగా నటన తెలియకపోయినా, అసాధారణ ప్రతిభ చూపకపోయినా చల్తా… అభిమానులు ఉంటారు, ఎలాగోలా మార్కెట్ చేసేసి, చలామణీ చేసే శక్తులు ఇండస్ట్రీలో ఉంటయ్… ఫలానా హీరో కొడుకు, ఫలానా దర్శకుడి కొడుకు, ఫలానా నిర్మాత కొడుకు అంటూ ప్రేక్షకులు కూడా చూస్తూ, భరిస్తూ, పోనీలే పాపం అనుకుంటారు…
ఐనాసరే, చాలామంది వారస హీరోలు క్లిక్ కాలేరు… నటన మరీ అంత వీజీ కాదు… చాలా ఉదాహరణలున్నయ్ అలా… ప్రయోగాలు, విజయాలు అంటే తెగ ఇష్టపడే డాషింగ్ సూపర్ స్టార్ హీరో కృష్ణకు తన జీవితంలో ఏదైనా బలమైన నిరాశ ఉందంటే బహుశా తన కొడుకు రమేష్‌బాబు పెద్ద హీరోగా ఎస్టాబ్లిష్ కాకపోవడమే కావచ్చు… అఫ్ కోర్స్, ఆ నిరాశను మహేశ్‌బాబును చూస్తూ మరిచిపోతాడేమో కూడా…
Ads
అప్పట్లో… అంటే చాన్నాళ్ల క్రితం… రమేష్‌బాబును హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి కృష్ణ చేయని ప్రయత్నం అంటూ లేదు… అప్పట్లో ఎన్టీయార్ సహా పెద్ద హీరోలు, ప్రముఖ దర్శకులు, నిర్మాతల కొడుకుల్ని తెర మీదకు పట్టుకొస్తున్న కాలం… కృష్ణకూ, ఎన్టీయార్‌కూ నడుమ స్పర్థ… ఎన్టీయార్ ఏది చేసినా కృష్ణ కూడా చేసేస్తాడు…
ఆయన సింహబలుడు తీస్తే, ఈయన సింహగర్జన అంటాడు… ఆయన దానవీరశూరకర్ణ అంటే ఈయన కురుక్షేత్రం అంటాడు… ఎన్టీయార్‌ను విమర్శిస్తూ రాజకీయ సినిమాలు చేస్తాడు… అలాగే బాలకృష్ణకు దీటుగా తన కొడుకు రమేశ్ బాబును నిలపాలని కృష్ణ బలంగా ప్రయత్నించాడు… ట్రెయినింగ్ ఇప్పించాడు, కానీ… ప్చ్, రాసిపెట్టి లేదు… రమేశ్ హీరోగా క్లిక్ కాలేకపోయాడు… బాలయ్య మాత్రం అఖండుడిలా ఇప్పటికీ తెలుగు వెండి తెరను గొడ్డళ్ల నెత్తుటి వర్షంలో నరుకుతూనే ఉన్నాడు…
అప్పట్లో బాలయ్యకూ, రమేశ్‌బాబుకూ నడుమ ఓ పంచాయితీ… ఇద్దరూ సామ్రాట్ అనే పేరుతోనే సినిమా తీశారు… కృష్ణ కొడుక్కి ఈ సినిమా ఫుల్ ప్లస్ కావాలని బప్పీలహరి మ్యూజిక్… బాలీవుడ్ హీరోయిన్ సోనంను రప్పించారు… ఆ పిల్ల లేతగా అప్పట్లో భలే డిమాండ్‌తో ఉండేది… త్రిదేవ్ సినిమాలో మాధురీదీక్షిత్, అమృతలతో పాటు దున్నిపడేసింది…
తొలి దర్శకుడు మధ్యలోనే గాయబ్… తరువాత మరో దర్శకుడితో పూర్తిచేశారు… మరోవైపు బాలయ్య, విజయశాంతి జంటగా రాఘవేంద్రరావు సినిమా… సామ్రాట్ అనే టైటిల్ కోసం చివరకు కోర్టు దాకా వెళ్లింది తగాదా… ఇందులో రమేశ్‌బాబే గెలిచాడు, దాంతో బాలయ్య తన సినిమా పేరును సాహస సామ్రాట్‌గా మార్చుకున్నాడు… నిజానికి డాన్సులు అనబడే గెంతులు, మొహంలో హావభావాలు, ఆకారం (ప్రత్యేకించి నడుం కింద సట్టం) గట్రా ఇద్దరూ సేమ్… ఐతేనేం, బాలయ్య నిలదొక్కుకున్నాడు, రమేశ్‌బాబు క్రమేపీ ఓడిపోయాడు…
అప్పట్లో ఆహా విక్రమార్క అనే ఓ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయినట్టు గుర్తు… కృష్ణ ఎంత నెట్టాలని చూసినా, రెండు షెడ్యూల్స్ దాటి సినిమా ముందుకు కదల్లేదు… అంతేకాదు, భూలోకరంభ అని మరో సినిమా స్టార్ట్ చేశారు… ఇంద్రజ హీరోయిన్… అదీ ఒక షెడ్యూల్‌తోనే చతికిలపడింది… దాన్నే భూలోకవీరుడు- జగదేకసుందరి అంటూ ‘‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’’ అన్న తరహాలో… మళ్లీ పట్టాలెక్కిద్దామని చూశారు కొన్నాళ్లకు… ఐనా అదీ ఆగిపోయింది…
సాహసయాత్ర అని మరోసినిమా… ఏకంగా 150 మంది సిబ్బందితో అండమాన్ వెళ్లి మరీ షూట్ చేశారు… మొదట వంశీ అనుకున్నారు దర్శకుడిగా… ఇళయరాజా మ్యూజిక్, సిరివెన్నెల పాటలు… హిందీ విలన్ ఆమ్రిష్ పురి ఇందులో విలన్… వంశీ ధోరణికి వీళ్లకూ ఎలా పొసుగుతుంది… పొసగలేదు, ఫలితంగా వంశీ గాయబ్…
తరువాత కొన్నాళ్లకు కృష్ణ సినిమాలకు ఎక్కువగా దర్శకత్వం వహించే కేఎస్ఆర్‌దాస్‌ను రంగంలోకి దింపారు.. రెడ్డొచ్చె మొదలాడు అన్నట్టుగా… కథ మారింది, ఇళయరాజా బదులు రాజ్‌కోటి వచ్చారు… గౌతమి, మహాలక్ష్మి, రమ్యకృష్ణ, రూపిణి హీరోయిన్లు… చివరకు ఇది కూడా ఆగిపోయింది… ఇక ఈ సినిమాలు నావల్ల కాదులే అని రమేశ్‌బాబు హీరో అనే పాత్రను శాశ్వతంగా వదిలేసి, నిర్మాతగా మారాడు… సో, వారసహీరోగా నిలబడి, ప్రూవ్ చేసుకోవడం కూడా అంత వీజీ కాదు..!!
Share this Article