అంటే అన్నామంటారు గానీ… అసలు ఏమిటండీ ఇది..? సంక్రాంతి అనగానే సకినాలు, మురుకులు, అప్పాలు, నువ్వుల ముద్దలు, పేలాల ముద్దలు, పల్లీల ముద్దలు, పాలతాలికలు, కజ్జికాయలు (గరిజెలు), జంతికలతోపాటు అరిసెలు మస్ట్ కదా… ఎంతసేపూ పండుగ అనగానే కాస్త పాయసం చేసుకోవడం, మమ అనిపించేయడం అలవాటైపోయింది చాలామందికి… అవున్లెండి, సకినాలూ కష్టమే, అరిసెలు కూడా కష్టమే… ఏదో ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుని తెప్పించుకోవడం బెటర్ అనుకునేవాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది… ఇక కడుపు చేత్తో పట్టుకుని దేశదేశాలు వెళ్లినవాళ్లకు అదీ కష్టమే… పండుగ అంటే మరీ పండుగపూటే చేసుకునే వంటలు కాదు సంక్రాంతికి… వారం ముందు నుంచే కథ మొదలవుతుంది…
చెప్పొచ్చేదేమిటంటే..? పాత తరం నేర్పించడం లేదు, కొత్తతరం నేర్చుకోవడం లేదు… వాళ్లకు అరిసెలు చేసేంత ఓపిక ఉన్నా సరే, ఆసక్తి ఉన్నా సరే, చేయడం తెలియదు… ఇంకేముంది..? జై యూట్యూబ్… కొన్ని వందల వీడియోలు కనిపిస్తాయి… కన్నడ, తెలుగు, ఒడియా, తమిళం, హిందీ… అతిరసాలు ఆర్ అరిసెలు… ఎక్కువగా సౌత్ ఇండియన్ స్వీట్ కదా… అయితే మీకు ఒక్కో వీడియో ఒక్కరకం… మచ్చుకు పదీపదిహేను చూస్తే ఇక మీరు జన్మలో అరిసెల జోలికి పోరు, అంత వైరాగ్యం వచ్చేలా చూపిస్తున్నారు…
చివరకు లక్షల వ్యూస్ ఉన్న వీడియోలు కూడా అంతే… మరేం చేస్తారు..? న్యూక్లియర్ ఫ్యామిలీస్ రోజులు… యూట్యూబే గురువు… వాటిల్లో చెఫ్స్ ఏది చెబితే అదే… అరిసెలు ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నవీ ఉన్నయ్… కానీ మరీ కొన్ని ఎంత భయానకం అంటే మరీ ఆకుపచ్చ కలర్ అరిసెలు కూడా కనిపిస్తున్నయ్… కొన్ని లేత గోధుమ రంగులో అదేదో కలకత్తా స్వీట్లాగా… పంచదారతో కొన్ని బూరెలు చేసి ఇవే అరిసెలు అంటున్నవాళ్లూ ఉన్నారు…, బెల్లంతో ఇంకొన్ని… కొన్ని గట్టిగా, మరికొన్ని మెత్తగా… కొన్ని నూనెతో, ఇంకొన్ని నెయ్యితో…
Ads
నిజానికి నువ్వులు లేని సకినాలు, కటికబెల్లం వాడని ముద్దలు ఊహిస్తారా..? నెవ్వర్… కదా… సేమ్, నువ్వులు అద్దిన అరిసెలు కాదు… అసలు గసగసాలు అద్దని అరిసెలు అసలు అరిసెలు అనబడవు… అదంతే… కొన్ని ఫేమస్ యూట్యూబ్ వీడియోలైతే అసలు నువ్వులను కూడా అవాయిడ్ చేసేశాయ్… బెల్లం పాకం పట్టిన బియ్యపు ముద్దల్ని నూనెలో గోలిస్తే వాటిని అరిసెలు అనాలా ఏం..? నిజానికి నేతి అరిసెలు అల్టిమేట్… ఇప్పుడు ఆరోగ్యకోణంలో నెయ్యి అనగానే వణుకుతున్నారు కొందరు, కనీసం ఈ పండుగ పూటైనా పల్లీనూనె లేదా నువ్వుల నూనె వాడితే ఆ రుచే వేరు… అలాగే నువ్వులు కాదు, అరిసెల మీద గసగసాలు అద్దాలి… తింటుంటే అవి రాలిపోకుండా ఉండాలి కూడా…
అసలే బియ్యపు పిండి, పైగా బెల్లం, ఇక నేతిలో వేయిస్తే కథ వేరే ఉంటది… దానికి తగ్గట్టు గసగసాలు కూడా కలిస్తే… ఆ అరిసెల రేంజ్ వేరు… నిజానికి ఇప్పుడున్న రోజుల్లో ఇవి కొందామన్నా మీకు బయట కూడా దొరకవు… చేసుకోవాల్సిందే… యూట్యూబు వీడియోల్లోనూ కనిపించవు… అందుకని బామ్మలకో, అమ్మలకో, అమ్మమ్మలకో వీడియో కాల్స్ చేసేసి, కాస్త వీడియో ప్రాక్టికల్ చూసేసి, మెల్లిమెల్లిగా ఆ మహత్తరమైన వంటను వంటబట్టించుకోవాల్సిందే..!!
Share this Article