నిజం చెప్పండి… చిన్నప్పటి నుంచీ మీరు చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, అనుభవించిన సీరియళ్లు గట్రా మొత్తం వడబోసి చెప్పండి… మనిషికి హఠాత్తుగా మతిమరుపు ఎందుకొస్తుంది..? గతం ఎందుకు మరిచిపోతాడు..? మళ్లీ ఎప్పుడు, ఏ సందర్భంలో పాతవన్నీ గుర్తొస్తాయి..? మన సినిమా పండితులు, మన సాహిత్యకారుల మేధస్సు చంద్రముఖి సినిమాలో రజినీకాంత్కన్నా పెద్దది కాబట్టి… సీరియళ్ల రచయితల మేధస్సు మరింత పెద్దది కాబట్టి… సింపుల్ సమాధానాలు దొరుకుతయ్… 1) యాక్సిడెంట్లలో గానీ, కొట్లాటల్లో గానీ హీరోకు తలపై ముందువైపు ఏదైనా దెబ్బ తగిలితే హఠాత్తుగా గత మరిచిపోయే ప్రమాదం ఉండును… 2) కథా సౌలభ్యం కోసం ఎవరైనా ధైర్యం చేసి, హీరో తలపై వెనుకవైపు అదే రేంజ్ దెబ్బ కొడితే మరిచిపోయిన గతం ఒక్కసారిగా డేటా రికవరీలాగా వచ్చిపడును… లేదా మనిషికి ఏదైనా బలమైన షాక్ అనిపించిన సంఘటనలు చూస్తే గతం మరిచిపోతారు… మళ్లీ అలాంటి సంఘటనలు చూపిస్తే గతం గుర్తుకు తెచ్చుకుంటారు…
ఇలా మన తెలుగు సినిమా పరిజ్ఞానాన్ని బట్టి ఈ సైకలాజికల్ యాక్సిడెంటల్లీ మెమొరీ లాస్ అనబడే వ్యాధి మనం అర్థం చేసుకోగలం… కదా, మీకు ఏమైనా డౌటుందా..? డౌటుందీ అంటే మీకు సినిమాలు గానీ, టీవీలు గానీ చూసే అర్హత లేదని అర్థం… ఇప్పుడు ఆ వ్యాధిని మరింత రేంజ్‌కు తీసుకుపోతున్నారు సీరియళ్ల రచయితలు… వాళ్లు రాసింది మళ్లీ వాళ్లు తెర మీద చూసుకోరు, చూస్తే వాళ్లకే పిచ్చి లేస్తుందని వాళ్లకూ తెలుసు… అసలు టీవీ సీరియళ్ల రచయితలు అంటేనే అదొక వింత జాతి కదా… ఇప్పుడు విషయం ఏమిటయ్యా అంటే..?
సాధారణంగా జీతెలుగులో సతీ త్రినయని అనే మూఢ, వింత నమ్మకాలు… కాదు, కాదు, ఓ మెంటల్ సీరియల్ వస్తుంటుంది… సమర్పకులు దిగ్రేట్ అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున గారు… నెవ్వర్, ఈ రేంజ్ పిచ్చి సీరియల్‌ను ఇంకెవ్వడూ తీయలేడు… అదేదో బెంగాల్ సీరియల్‌ను అచ్చు దింపేస్తున్నాడు దర్శకుడు… నాలుగైదు ఆస్కార్లనైనా ఇస్తే గానీ సదరు దర్శకుడి ప్రతిభను గుర్తించినట్టు కాదు… అఫ్ కోర్స్, ప్రేమ ఎంత మధురం అని మరో తిక్క సీరియల్ ఉందిలెండి… అదీ ఇంతే… ఫాఫం, గతంలో జీతెలుగు రేటింగ్స్‌లో ఇవి రెండూ ఫస్ట్, సెకండ్ స్థానాల్లో ఉండేవి… ఇప్పుడు ప్రేక్షకులు తొక్కిపారేశారు… బాబోయ్ అని తలలుపట్టుకుంటున్నారు… ఈ రెండు సీరియళ్లలో హీరో పాత్రల చిత్రీకరణ మరీ నల్కా రేంజ్… ఓసారి చూద్దామని సాహసించాను…
Ads
అన్ని సీరియళ్లలో ఉన్నట్టే ఇందులో కూడా ఓ లేడీ విలన్ ఉంటుంది… యాక్సిడెంట్ చేయిస్తుంది… హీరో, హీరోయిన్ పడిపోతారు… ఆ డాక్టర్ ఎవడో గానీ ప్రమాదానికి చికిత్స మరిచిపోయి అర్జెంటుగా కంటి మార్పిడి ఆపరేషన్ చేస్తాడు… అదేమిటో గానీ, అంత కార్పొరేట్ హాస్పిటల్ అయినా సరే, ఆ తెల్ల బ్యాండేజీల మీద రక్తపు చుక్క ఒకటి లీకవుతూనే ఉంటుంది… అసలు అదికాదు నవ్వొచ్చేది… హీరో గతం మరిచిపోతాడు… కానీ తనకు ప్రమాదంలో మరణించిన మరో మనిషి కళ్లను పెడతారు కాబట్టి, ఆ కళ్లు చివరగా తన భార్యను చూశాయి కాబట్టి… మన హీరో కూడా ఇక ఆమే తన భార్య అని ఫిక్సయిపోతాడు… ఆ కళ్లు అదొక్కటే గుర్తుంచుకున్నాయట… ఇక హీరోయిన్ తన భర్తను మరో ఆడమనిషికి అప్పగించేనట… దేవుడా… ఏం ఖర్మరా తండ్రీ… ఖచ్చితంగా ఈ సీరియల్ దర్శకుడికి ఎవరో న్యూరాలజిస్టులు, సైకియాట్రిస్టులతో ఏదో ఒప్పందం ఉండే ఉంటుంది… అసలే ఒమైక్రాన్ సీజన్, దాంతోపాటు ఈ మెంటల్ కేసులు కూడా బోలెడు పెరుగుతూ ఉంటయ్… ఈ మెంటల్ డాక్టరీ చదివేవాళ్లు అనవసరంగా పెద్ద పెద్ద బుక్స్ తిరగేస్తూ మెదళ్లు చింపుకుంటారు గానీ, సింపుల్‌గా ఇలాంటి సీరియళ్లు చూసి, థీసిస్ రాసేస్తే, వెంటనే పీహెచ్డీ రాదా ఏం..?!
Share this Article