సినిమా టికెట్ల వ్యవహారం అక్షరాలా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వైఎస్సార్సీపీ పార్టీ నడుమ పంచాయితీగా తయారైంది… ఎవరైనా సినిమా ప్రముఖుడు టికెట్ల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తే చాలు, వైసీపీ బ్యాచ్ విరుచుకుపడిపోతోంది… మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అందరూ తిట్టేస్తున్నారు… హీరోలకు నిర్మాతలు దోచిపెడుతున్న తీరు నుంచి హీరోల రెమ్యునరేషన్ల దాకా ప్రస్తావించేస్తున్నారు… సాధారణంగా సినిమావాళ్లు రాజకీయ నాయకుల జోలికి, ప్రభుత్వం జోలికి వెళ్లి ఏ విమర్శలూ చేయరు… జగన్ నిర్ణయం తమకు నష్టదాయకమే అయినా ఇండస్ట్రీలో చాలామంది ఏమీ మాట్లాడకుండా జగన్ దయచూపకపోడు అనుకుంటూ ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు…
కానీ పరిస్థితి ముదురుతోంది… అసలే ఏపీలో రాజకీయాలు మాత్రమే కాదు, విషయం ఏదైనా సరే, బూతులు ముందు, సబ్జెక్టు తరువాత… సంస్కారం, హుందాతనం గట్రా ఏమీ కనిపించవు… ముందుగా నోరువిప్పి, బూతులు మాట్లాడేసి, అప్పుడు అసలు విషయంలోకి వస్తారు… ప్రస్తుతానికి బోసిడికే భాష దగ్గర దాకా వచ్చేసింది యవ్వారం… ఇక బజార్లో పడి, బట్టలిప్పేసి తన్నుకోవడమే… ఎదుగుదల… ఈ సినిమా టికెట్ల వివాదంలో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ‘‘సినిమా వాళ్లకు బలుపెక్కువ’’ అని ఏదో కామెంట్ చేశాడు కదా…
వీఎన్ ఆదిత్య అని ఓ సినిమా దర్శకుడున్నాడు… ఎక్కడో కాలింది… ఏం చేయగలదు ఈ జగన్ ప్రభుత్వం..? ఏం..? ఉరితీస్తుందా..? కొరతేస్తుందా..? ఉప్పుపాతరేస్తుందా..? ఇన్ని మాటలు పడాలా అనుకున్నట్టున్నాడు… ఫేస్‌బుక్ వాల్ మీద ఘాటు పంచులతో రిప్లయ్ ఇచ్చాడు… అఫ్‌కోర్స్, ఫలానా నాయకుడి వ్యాఖ్యలకు కౌంటర్ అని రాయలేదు కానీ సులభంగానే అర్థమవుతుంది… ఓసారి ఆ లేఖ యథాతథంగా చదవండి…
Ads
వీ.ఎన్.ఆదిత్య
నిజమే కావచ్చుగాక… సినిమావాడు తన పెట్టుబడి పెడతాడు, వస్తే లాభం, లేదంటే మిగిలేది బుడ్డగోచీ… రాజకీయ నాయకుడికి అలా కాదు కదా… జనం మీద పడి బతికేయవచ్చు… అలాంటిది ఓ రాజకీయవేత్త సినిమావాడిని బలుపు అని తిట్టేయవచ్చా అనేది ఆదిత్య మాటల్లో కనిపించే ఆగ్రహం, ఆవేదన… కానీ ఆ ఫ్లోలో పడి తమ గురించి మరీ ఎక్కువ చెప్పుకున్నాడు… ఏదో సమాజాన్ని ఉద్దరించేస్తున్నట్టుగా ఫీలైపోయాడు… భాష అదుపు తప్పింది, బ్లడీ ఫూల్ అనే పదాలు వస్తున్నయ్… మరిక ఆ రాజకీయ నాయకుడికీ నీకూ తేడా ఏముంది..? సినిమాల్లో చూపించేది బూతులే, భాష కూడా బూతులూ, దైనందిన యవ్వారాల్లో కూడా బూతులేనా..? మొత్తానికి ‘బలుపు’’ యవ్వారం బాగా ముదురుతోంది…!! కమాన్, నెక్స్ట్స్ ఎవరు..? త్వరగా తెర మీదకు వచ్చేయాలి… ఈసారి బూతులు మరింత పదునుగా పడాలి… కమాన్…
Share this Article