ఎందుకు క్రమేపీ కాంగ్రెస్ హిందువులకు దూరమైపోతోంది..? కమ్యూనిస్టులంటే సరే, నరనరాన హిందూవ్యతిరేకతను నింపుకున్నవాళ్లే… సోకాల్డ్ సెక్యులర్, కరప్టెడ్, రీజనల్, ఫ్యామిలీ పార్టీల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మేలు… కానీ ఓ ఉత్కృష్ట చరిత్ర కలిగిన కాంగ్రెస్ కూడా ఈ దేశ మెజారిటీ మతాన్ని, కోరికలను, మనోభావాలను జస్ట్, అలా చీప్‌గా తీసిపడేస్తుంది… దానికి కావల్సింది ఒకటే, మోడీని తిట్టేయాలి, బీజేపీని ఎండగట్టాలి… అంతే… ఇక సబ్జెక్టులో ఏముంది అనేది ఆ పార్టీకి అక్కర్లేదు… మోడీ చేస్తే వ్యతిరేకించాలి… బీజేపీ చేస్తే ఖండించాలి… ఏం పార్టీ..? ఏం నాయకత్వంరా బాబూ..? అందుకేనేమో గంగ స్నానాలు చేసినా, బొట్టు పెట్టుకుని, కృత్రిమ హిందూ వేషం వేసుకుని తిరిగినా ప్రియాంక గాంధీని యూపీలో ఒక్కరూ నమ్మడం లేదు, జై కొట్టడం లేదు… లడ్‌కీ హూ, లడ్ సక్తీ హూ అని హూంకరిస్తున్నా సరే, యాభై ఏళ్ల లడ్‌కీ ఏమిటి తల్లీ అని లైట్ తీసుకుంటున్నారు… ఇక రాహుల్ గురించి చెప్పనక్కర్లేదు… Hopeless… (Timely brahmana gotram, kashmiri identity, instant jandhyam, bottu, bonam)
విషయం ఏమిటంటే..? ఇతర మతాల సంస్థలు, ప్రార్థనాలయాలపై లేని ప్రభుత్వ పెత్తనం హిందూ గుళ్లు, సంస్థలపై ఎందుకు ఉండాలి..? ఆగమం సహా అన్నీ కోర్టులు, ప్రభుత్వాలే ఎందుకు శాసించాలి..,? అసలు వాటికేం తెలుసు..? (హిందువుల గుళ్ల నుంచి డబ్బులు వసూలు చేస్తుంది, అర్చకులకు వేతనాలు అంటోంది సరే, కానీ ప్రభుత్వానికి, ప్రజలకు పైసా ఆదాయం ఇవ్వని ఇతర మతాల పూజారులకు ప్రభుత్వం నెలనెలా డబ్బులు ఎందుకు ఇవ్వాలి..? ఈ ప్రశ్నకు ఏపీలో ప్రభుత్వ పెద్దల దగ్గర జవాబే లేదు…) అవునూ, కాంగ్రెస్ భావదరిద్రం గురించి కదా మనం ఇప్పుడు చెప్పుకునేది…
కర్నాటకలో మతమార్పిళ్ల బిల్లు తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వం తాజాగా హిందూ సంస్థలపై ప్రభుత్వ పెత్తనం తీసేసే బిల్లుకు రూపకల్పన చేస్తోంది, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టబోతోంది… మోడీ ప్రభుత్వానికి చేతకాని పనిని కర్నాటక ప్రభుత్వం చేస్తోంది… బీజేపీ ప్రభుత్వ నిర్ణయం అనగానే అక్కడ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది… తాము మెజారిటీ హిందువులను శత్రువులను చేసుకుంటున్నామనే సోయి కూడా లేదు ఆ పార్టీకి… ఐనా టెన్ జనపథ్ నుంచి గల్లీ దాకా ఇప్పుడు ఇదే ధోరణి కదా… వీఎస్ ఉగ్రప్ప అని ఓ కాంగ్రెస్ లీడర్ వెంటనే తెర మీదకు వచ్చేసి, ఠాట్, అలా గుళ్లను ప్రైవేటీకరిస్తే ఎలా..? రేప్పొద్దున అవినీతి జరిగితే ఎవరు బాధ్యులు..? చెత్తా నిర్ణయం అని ఏదేదో కూశాడు…
Ads
దేవాదాయ శాఖ అంటే ముజ్రయ్ డిపార్ట్‌మెంట్ ఇప్పుడు గుళ్లలో అవినీతి జరగకుండా కాపాడుతుందట… ప్రభుత్వ పెత్తనాన్ని తీసేస్తే అది ప్రైవేటీకరించినట్టు అనుకోవాలట… ఏం బుర్రలురా బాబూ..? ఇతర మతసంస్థలపై ప్రభుత్వ పెత్తనం లేదు, అంటే అక్కడ అవినీతి జరిగిపోతోందని అనుకోవాలా..? లేక హిందూ సంస్థల్లో మాత్రమే అవినీతి జరుగుతుందనేది కాంగ్రెస్ భావనా..? అసలు ఈ పార్టీకి ప్రైవేటీకరణ అంటే అర్థం తెలుసా..? ఏదో ఒకటి కూయడం, పత్రికల్లో వార్తలు రావడం… అంతే… పైగా ఈ నిర్ణయంతో గుళ్లను బ్రాహ్మణీకరిస్తున్నారట… అసలు కర్నాటక కాంగ్రెస్ పార్టీకి తమ రాష్ట్రంలో మతసంస్థల మీద ఓ అవగాహన కూడా లేనట్టుంది…
నిజానికి ప్రభుత్వ పెత్తనం తీసేస్తాం సరే, కానీ పెత్తనం చేసే వ్యవస్థ ఎలా ఉండాలి, ఆ కమిటీల్లో ఎవరు ఉండాలి, వారిని ఎలా ఎంపిక చేయాలి అనే విషయాల్లో ఇంకా మథనం జరుగుతోంది… అవినీతి అంటే ఓ లెక్క చెప్పుకోవాలి… రాష్ట్రంలో 1,80,000 గుళ్లు ఉంటే అందులో 35,500 మాత్రమే ముజ్రయ్ శాఖ పరిధిలో ఉన్నయ్… మిగతావన్నీ ప్రైవేటు గుళ్లే… ఈ 35,500 గుళ్లలో కూడా 34,219 గుళ్లు సీ గ్రేడ్… అంటే 5 లక్షల వార్షికాదాయంలోపు… అంటే నెలకు 40 వేలు… మరో 139 గ్రేడ్ బీ గుళ్ల ఆదాయం 5 నుంచి 10 లక్షలు… మరి ఈ గుళ్లలో అవినీతి పెచ్చుపెరిగేది ఏముంది..? ప్రభుత్వ పెత్తనం తీసేస్తే దాన్ని ప్రైవేటీకరించడం ఏమిటి..? నిజానికి ఈ దిక్కుమాలిన అధికారులు, నాయకుల పెత్తనంతోనే గుళ్లు మకిలిపట్టినయ్… అది తీసేస్తే స్థానిక వ్యాపారులు, పెద్ద కంపెనీలు దత్తత తీసుకుని, ఆ దేవుళ్లకు కాస్త నిత్యధూపం, దీపం, నైవేద్యమైనా సమకూరుస్తారు…
205 ఏ గ్రేడ్ గుళ్ల ఆదాయం మాత్రమే ఏటా 25 లక్షలు దాటి ఉంటుంది… నిజానికి కర్నాటక గుళ్లు మరీ తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గుళ్లలాగా కోట్ల సంపాదన ఉండేవి కావు… పటాటోపం, అట్టహాసాలు గట్రా తక్కువ… పైగా ప్రతిచోటా మధ్యాహ్నం, రాత్రి ఉచిత ప్రసాద వితరణ సాగుతుంది… వాటి ఖర్చే బోలెడు… పారిశుద్ధ్యం, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, ఇతర కనీసఖర్చులు కూడా టెంపుల్ ఆదాయం నుంచే..! ఇక ఈ మాత్రం ఆదాయం ఇప్పుడు అదుపు తప్పిపోతోందట, కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందట… ఎందుకయ్యా అంటే ఈ నిర్ణయం బీజేపీ ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి వ్యతిరేకించాలి, అంతే… చార్ ధామ్ యాత్ర చేస్తే, లేదా ద్వారక, పూరి, రామేశ్వరం వెళ్లొస్తే మనిషికి 20 వేలు, మానస సరోవర్ వెళ్లొస్తే 30 వేల చొప్పున సబ్సిడీ ఇస్తోంది ప్రభుత్వం… దాన్ని కూడా రద్దు చేసేయమని డిమాండ్ చేయదు గదా ఈ అద్భుత చరిత్ర కలిగిన పార్టీ..?!
Share this Article