బాబాయ్, పంది గుండెను మనిషికి పెట్టేశారట… బాగానే సెట్ అయిపోయిందట… ఇంకేముంది..? మనిషికి చాలా రోగాల బాధ పోయినట్టే…
ఎందుకురా అబ్బాయ్… ఒకేసారి అంత మాటనేశావు..? ఆఫ్టరాల్ జలుబుకు మందులేదు ఇప్పటికీ… ఐనా ప్రకృతిని నువ్వు జయించేకొద్దీ అది కొత్త సవాళ్లు విసురుతూ ఉంటుంది… కరోనా రూపంలోలాగా… ఐనా పంది గుండె సక్సెసయితే రోగాల బాధ పోయినట్టేనా..?
కాదా మరి..? జస్ట్, ఈ రీసెర్చ్ ఇలాగే సాగితే, మనిషిలో ఏ అవయవం చెడిపోతే దాన్ని పీకేసి, ఏ జంతువు నుంచో కొత్త అవయవం పెట్టేయడమే… ఇప్పుడు పంది గుండె అడాప్టబులిటీలాగే… రేప్పొద్దున గాడిద ఊపిరితిత్తులు, కుక్కల కాలేయాలు, గుర్రాల మర్మాంగాలు, ఒంటెల జీర్ణాశయాలు… ఇలా కాస్త జెనెటిక్ మోడిఫికేషన్స్ చేసుకుని, అడాప్టబులిటీ, యాక్సెసబులిటీ సాధించేయడమే…
Ads
అయితే ఇక రోగాల్ని మనిషి మరిచిపోవాల్సిందే అంటావా..?
అంతేకదా మరి… అవయవాల కోసమే ప్రత్యేకంగా జంతువుల ఫారాలు పెట్టేయడం, కావల్సిన అవయవాన్ని తీసుకుని మన దేహాల్లో ప్లాంట్ చేసుకోవడమే… మనిషి ఓ వందేళ్లు వీజీగా బతికేస్తాడు చూస్తుండు…
బాగుంది… శాస్త్రం ఎప్పుడూ గొప్పదే… కానీ తనను జయించే శాస్త్రాన్ని ప్రకృతి ఎప్పుడూ సహించలేదోయ్… కాకపోతే మనిషికీ, ప్రకృతికీ నడుమ ఈ సమరం సాగుతూనే ఉంటుంది, సాగాలి… కానీ నువ్వు అనుకున్నంత వీజీ ఏమీ కాదు…
ఏం, ఎందుకు కాదు..? నీలాంటి ఛాందసులే అన్నింటికీ అడ్డంకులు… అపశకున పక్షులు…
సర్లేవోయ్… తల్లికి ఇష్టం లేని అబార్షన్లకే నానా ఆంక్షలు… చివరకు గర్భస్థ పిండంలో లోపాలు ఉన్నాయని తేలినా, పుట్టాక కష్టాలే అని తెలిసినా కొన్ని నెలలు దాటాక చంపనివ్వరు… అంటే ఆ భ్రూణహత్య చేయనివ్వరు… అంతెందుకు..? బతకడంకన్నా చావే నయం అనిపించే రోగాలతో మంచం మీద దిక్కులేక పడి ఉన్న స్థితిలో కూడా ప్రపంచం కారుణ్య మరణానికి అనుమతినివ్వడం లేదు… ఇవ్వదు, చచ్చే దాకా పోరాడు అంటుంది… ఆత్మహత్యనూ నిరాకరిస్తుంది… దేవుడిచ్చిన జీవాన్ని నీఅంతట నువ్వే చంపేయడం ఏమిటంటుంది, నేరంగా ప్రకటించి, శిక్షిస్తుంది… ఇన్నిరకాల నైతిక అడ్డుగోడలు…
కాలగతిలో అన్నీ కొట్టుకుపోతయ్… అంతెందుకు..? చైనాలో వుయిఘర్ ముస్లింల అవయవాలతో వ్యాపారం చేస్తున్నారనే వార్తలు వింటున్నాం కదా… అవసరాలు పెరిగేకొద్దీ నైతికతలు, మానవత్వ బోధలూ ఏమీ పనిచేయవ్ బాబాయ్…
అవును గానీ అబ్బాయ్… నీకు ఓ క్లాసిక్ ఉదాహరణ చెబుతాను… ఈ జంతువుల గుండెలు, కాలేయాలు, అవయవాలు సరే… కానీ మనుషులనే ఎందుకు పెంచకూడదు..?
అర్థం కాలేదు బాబాయ్… జంతువుల్ని అవయవాల కోసం పెంచి, చంపడమే రేప్పొద్దున మోరల్ ఆంక్షల్లో చిక్కుకుంటుందేమో అనుకుంటుంటే, నువ్వు ఏకంగా మనుషుల్నే పెంచి, ఆర్గన్స్ దందా చేయమంటావేం..?
అదే మరి… పర్ సపోజ్… నా దేహంలో చాలా రోగాలు చాలా ఆర్గన్స్‌ను దెబ్బతీశాయి… వయస్సుతో వచ్చే క్షీణత సరేసరి… నేనేం చేస్తానంటే… నా స్టెమ్ సెల్ నుంచి క్లోనింగ్ ద్వారా ఓ మనిషిని పుట్టిస్తాను.,. మంచి డిజైనర్ బాడీ… ఆరోగ్యకరమైన అవయవాలే ఉండేలా చూస్తాను… నాకు కావల్సిన కళ్లు, చర్మం, మొహం, ఇతర అవయవాలు తీసుకుని, మార్చుకుని, ఆ ‘సరుకును’ డిస్పోజ్ చేస్తాను… ఎలా ఉంది..?
అవయవాల కోసం మనుషుల్ని పుట్టించి, చంపేయడాన్ని ప్రపంచం అంగీకరిస్తుందా..? అదే జరిగితే రేప్పొద్దున సహజంగా పుట్టే సంతానాన్ని కూడా ఇలాగే వాడేసుకుని, తరువాత ‘దేహ పిప్పిని’ బయట పడేసే రాక్షసులు కూడా తయారవుతారు కదా…
పోనీ, మంచి డిజైనర్ మనిషిని పుట్టించి, అవసరమైన జన్యుమార్పులన్నీ గర్భంలోనే చేయించి, ఏ సరోగేట్ మదర్‌నో అద్దెకు మాట్లాడుకుని, లేదంటే ల్యాబులోనే ఇంక్యుబేటర్లను పెట్టేసి… పెంచి, ఓ ఫైన్ మార్నింగ్… మన మెదడును అనుభవాలు, జ్ఞాపకాలతో సహా కొత్త మనిషిలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసి, మన బాడీనే డిస్పోజ్ చేస్తే సరి… మళ్లీ కొత్త జీవితం, ఆరోగ్యం, ఆనందం… ఉనికి సేమ్, ఐడెంటిటీ వేరు… ఆ దిశలో ప్రయోగాలు బెటర్ కదా… మనిషికి ఇక మరణమనేదే ఉండదు… చిరంజీవి… ఎప్పటికప్పుడు డ్రెస్ మార్చుకున్నట్టు బాడీ మార్చుకోవడమే… అంతే…
నువ్వు మరీ వయోలెంట్‌గా ఆలోచిస్తున్నవ్ బాబాయ్… అదంత వీజీ కాదు… సయామీ కవలల్లో ఒకరిని విడదీసి, ఒకరిని బతికించాలనే ఆలోచనల్నే మన ప్రపంచం అంగీకరించడం లేదు, అంగీకరించదు… మనిషి ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కదా…
పిచ్చోడా… ఎన్నో ఏళ్ల క్రితమే క్లోనింగ్ గొర్రెల్ని పుట్టించాడు మనిషి… మనిషిని పుట్టించడం పెద్ద కథ కాదు… చాలా వీజీ… (చైనావాడు ఎక్కడో రహస్యంగా ఈ క్లోనింగ్ దందాలకు కూడా ఆల్‌రెడీ తెరతీసి ఉంటాడని చాలామందికి డౌట్)… ఎటొచ్చీ ప్రపంచమే అనుమతించడం లేదు… ఒక్కసారి మనం నువ్వు చెప్పిన నైతిక బారికేడ్లను ఛేదించుకున్నామా..? ఇక ఏదీ ఆగదు… ఐతే ప్రకృతి దీన్ని ఎలా బ్రేక్ చేసి, పకపకా నవ్వుతుందో మాత్రం ఊహించలేం… ఎందుకంటే… చావుపుట్టుకల్ని, అమరత్వాన్ని మనిషి తన చేతుల్లోకి తీసుకోవడాన్ని అదస్సలు అంగీకరించదు… అంతే…
కానీ ఎంతైనా ప్రస్తుత పంది గుండె మార్పిడి మాత్రం గ్రేటే బాబాయ్…
ఎహె, ఊరుకోరా… ఇప్పుడు తెల్లోడు చేశాడు కాబట్టి ఆహా ఓహో… పాతికేళ్ల క్రితమే మన ఇండియన్ దీన్ని సక్సెస్ చేసి చూపించాడు, తనను విపరీతంగా సతాయించి, దాడులు చేసి, తనకు జీవితం మీదే విరక్తి పుట్టించారు… కావాలంటే ఈ క్లిప్పింగ్ చదువుకో… ఇక ముగిద్దాం…
Share this Article