నిఖిల్ గౌడ… మాజీ ప్రధాని దేవగౌడ మనమడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు… ఆ కుటుంబ రాజకీయానికి వారసుడు… ఆమధ్య సుమలత మీద జనతాదళ్ (ఎస్) తరఫున పోటీచేసి, ఓడిపోయాడు… పొలిటిషియన్ మాత్రమే కాదు, సినిమా హీరో… 4 సినిమాల్లో హీరో… జాగ్వార్ అని తెలుగులో కూడా వచ్చింది… రెండు పడవల మీద కాళ్లు వేసి, కథ నడిపిస్తూ ఉంటాడు…
ఉదయనిధి స్టాలిన్… ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకు, కరుణానిధి మనమడు… ప్రస్తుతం ఎమ్మెల్యే, డీఎంకే యూత్ వింగ్ చీఫ్… స్టాలిన్ రాజకీయ వారసుడు… పొలిటిషియన్ మాత్రమే కాదు… నిర్మాత, హీరో, పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాడు… తను కూడా అంతే… రెండు పడవల మీద కాళ్లు వేసి, ఇప్పటికైతే సజావుగా బండి నడిపిస్తున్నాడు… ప్రస్తుతం అయిదు సినిమాలు చేతిలో ఉన్నయ్…
ఈ రెండు ప్రముఖ ఉదాహరణలు ఎందుకంటే… మంచైనా, చెడైనా పూర్తికాలం రాజకీయాల్లో కొనసాగుతూ, జనంలో ఉంటూ, జనంతో ఉంటూ, జనం కోసం ఉండటం అనేది కనిపించడం లేదు… వ్యక్తిగత పాపులారిటీ కావాలి, ఇండస్ట్రీ తాలూకు రంగులు, ఆకర్షణలు, డబ్బు గట్రా కావాలి… అదేసమయంలో రాజకీయ అధికారం, పెత్తనాలు కావాలి… ఏది పార్ట్ టైమో అర్థం కాదు… జనం భరించాలి… ఏం చేస్తారు ఫాఫం, నెత్తి మీద ఎక్కాక భరిస్తారు కదా… నిజానికి మన దేశ రాజకీయాల దౌర్భాగ్యం ఏమిటంటే… ఏ రంగంలోనైనా సరే కాస్త మెరిట్ కావాలి ఎదగడానికి, రాజకీయాల్లో ఏ మెరిటూ అక్కర్లేదు, వారసత్వం చాలు… కానీ లోకంలోని ప్రతి సుఖానికీ వాళ్లకే హక్కుల దఖలు పడి ఉంటయ్… ఐనా ఇండస్ట్రీ మాయ, ప్రలోభం నుంచి తప్పించుకోరు…
Ads
గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్… వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం, రాజకీయ నేపథ్యం… కానీ హీరో కృష్ణ, మహేశ్ బాబు సినీ వారసత్వమే ఆకర్షించింది… ఎవడో డబ్బు పెట్టడం దేనికి..? ఆ గంగాళంలో నుంచి చెంబెడు నీళ్లు తీసి, ఓ సినిమా తీసిపారేశారు… మరో వారస హీరో… హీరో అనే సినిమా ద్వారా ప్రేక్షకుల మీదకు రుద్దబడ్డాడు… హీరో కావడం పెద్ద ఇష్యూ కాదు అనుకుంటారు వీళ్లు… వీళ్లకు క్రియేటివ్ ప్రయోగాలు, సినిమా అనే కళ మీద ప్యాషన్ గట్రా ఏమీ అక్కర్లేదు కూడా…
ఓ పేద్ద గన్ను (ఇనుప సామాన్ల తయారీలో వాడే పెద్ద సుత్తి) పట్టుకున్న హీరో ఫోజు చూశారు కదా… నన్ను కవిని కాదన్నవాడిని కత్తితో పొడుస్తా అనే ఓ పాపులర్ కవిత తెలుసు కదా… అదుగో, అలాగే నన్ను హీరో కాదన్నవాడిని గన్నుతో ఇరగదీస్తా, తెర నిండా నెత్తుటి వానే అన్నట్టుగా… సినిమా కూడా మొత్తం అంతే… తన లుక్కే అంత ఇంప్రెసివ్‌గా లేదు… నటనలో బేసిక్స్ గురించి చెప్పనక్కర్లేదు… ఇలాంటి హీరో లాంచింగ్ సినిమాల్లో హీరో తప్ప ఇంకెవరూ కనిపించకూడదు కదా తెలుగు సినిమా సూత్రం ప్రకారం… ఇక్కడా అంతే హీరోయిన్ నిధికి పెద్దగా ప్రాధాన్యం ఏమీ లేదు, ఉండదు, ఉండకూడదు…
విసుగెత్తించే కామెడీ… ఎంతసేపూ సూపర్ హీరోయిజాన్ని ప్రొజెక్ట్ చేస్తూ… కృష్ణ, మహేశ్ సినిమాలను గుర్తుచేస్తూ… కాసేపు లవ్ బాయ్, కాసేపు కౌబాయ్… ప్రేమ కథ, హీరో కావాలనే కోరికలు, ప్రయత్నాలు కాస్తా ప్రమాదవశాత్తూ మాఫియా లింకుల్లోకి వెళ్లిపోతుంది… మరి యాక్షన్ సీన్లు గట్రా కావాలంటే, హీరోయిజాన్ని ఎలివేట్ చేయాలంటే మాఫియాతో రంగరించాలనేది ఓ పిచ్చి సూత్రం ఒకటి నడుస్తుంటుంది కదా మన తెలుగు సినిమాల్లో… సేమ్… పాటలు, బీజీఎం హోప్‌లెస్… డబ్బు, ఫ్యామిలీ నేపథ్యం, వారసత్వం గట్రా ఉంటే చాలు… హీరోగా వెండితెరను ఏలవచ్చు అనుకుంటే అదొక భ్రమ… చాలామంది వారసులు వస్తుంటారు, పోతుంటారు… నిలబడేది కొందరే… చాలా పరిస్థితులు అనుకూలించాలి, కష్టపడాలి, సినిమాను ప్రేమించాలి, ప్రేక్షకుడిని గౌరవించాలి… గల్లా అశోక్‌కు ఎవరైనా చెబితే బాగుండు…!!
ప్చ్, మన ఖర్మ… ఇక సినిమాలు చేయను అంటాడు ఓ పిచ్చి హీరో… జనం, రాజకీయాలే నా భవిష్యత్తు అని భీకరప్రకటన చేస్తాడు… ఎన్నికల్లో జనం కర్రుకాల్చి వాతపెట్టాక, ఇక సినిమాలు తప్ప ఇంకేమీ పట్టవు… మరో హీరో ఏకంగా పార్టీని అమ్మేసి, నమ్మిన జనాన్ని మోసం చేసి, అబ్బే, నాకు ఇకపై సినిమాలే లోకం అని హీరోయిన్లతో కుర్ర గెంతులు వేయడానికి నానా తిప్పలూ పడుతుంటాడు… ఫుల్ టైమ్ పొలిటిషియన్స్… అనగా, నిజంగా జనంలో ఉండే నాయకులకు, జనం వెంట ఉండే పొలిటిషియన్స్‌కు కరువొచ్చి పడింది… మరేటి సేస్తం..?! కొత్త తరం రాజకీయ వారసత్వం కూడా సేమ్ సేమ్..!! ఏమో… ఈ అశోకుడు అమరరాజాను పెంచుతాడో, రాజకీయ వారసత్వాన్ని చేపడతాడో, ఫుల్ టైమ్ యాక్టర్ అవుతాడో… అన్నీ కలగలిపి కథ నడిపించేస్తాడో…!!
Share this Article