Bharadwaja Rangavajhala……….. దానవీరశూర కర్ణ విడుదలై నలభై ఐదు ఏళ్లయ్యిందని టీవీ 9 ఛానల్లో ఉదయం చూశాను. బానే ఉంది కానీ … ఆ సినిమాకు మొదట అనుకున్న సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు అనే విషయం చెప్తూ అనివార్య కారణాల వల్ల తప్పుకున్నారు అన్నారు . రాజేశ్వర్రావు గారు చేసిన ఓ ట్యూన్ వరుస కొంచెం సవరిస్తే బాగుండు అని త్రివిక్రమ రావు గారు అభిప్రాయపడడంతో సాలూరి వారు విరమించుకున్నారు… మర్నాడు ఎన్టీఆర్ ఫోన్ చేసి, రాలేదు ఏం అని అడిగితే… మీ తమ్ముడు గారికి సంగీత జ్ఞానం ఉంది, వారితో చేయించుకోండి అని చెప్పేశారుట మాస్టారు. అది సంగతి. ఏ తల్లి నిను కన్నదో పాట ట్యూను రాజేశ్వరరావుగారు చేసినదే. ఆలా ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు గారితో ఏర్పడిన అభిప్రాయబేధంతో రాజేశ్వరరావు ఈ ప్రాజెక్టును వదిలేశారు.
1977 సంవత్సరానికి ఎన్టీఆర్ సినీ జీవితంలో ఓ ప్రత్యేకత ఉంది. ఆ సంవత్సరం జనవరి పద్నాలుగున దాన వీర శూర కర్ణ విడుదలై అఖండ విజయం సాధించింది. అదే సంవత్సరం ఏప్రిల్ ఇరవైన అడవి రాముడు విడుదలై ఇరగదీసేసింది. అదే సంవత్సరం జులైలో ఎదురీత విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. దాని వెంటే చాణక్య చంద్రగుప్త విడుదలై అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చింది. చివరగా అక్టోబరు నెల్లో యమగోల విడుదలై దుమ్ము రేపేసింది. అక్కడ నుంచీ ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆ విజయయాత్ర అలా కొనసాగిపోయింది.
ఇంకో విచిత్రమేమిటంటే … 77 ఆలూమగలు తర్వాత ఎనభై వరకు అక్కినేని నాగేశ్వరరావుకు నిలబడి నాలుగు వారాలు దాటి ఆడిన సినిమాలు లేవు. ఎనభైలో వచ్చిన ఏడంతస్తుల మేడ మళ్లీ అక్కినేని నటనా జీవితంలోకి విజయాలను తెచ్చింది. డి.వి.ఎస్ కర్ణ సినిమా విడుదలైనప్పుడు ఎంత వసూలు చేసిందో సెకండ్ రిలీజులోనూ అంతే వసూలు చేయడం మరో విశేషం. డి. వి. ఎస్ కర్ణ సినిమా స్క్రిప్టు, డైలాగులు కట్టడంలో కొండవీటి వెంకటకవికి సహాయకుడుగా… అప్పటి హేతువాది, ఆ తర్వాత రోజుల దళిత నాయకుడు కత్తి పద్మారావు వ్యవహరించారు. వీటన్నిటికన్నా కూడా ఇంట్రస్టింగ్ విషయం ఏమంటే… ఈ సిన్మా కు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఎన్. టి రామారావు అని వేయడం అన్నమాట…
Ads
Share this Article