అనామకంగా… ఓ సాదాసీదా అపార్ట్‌మెంట్… ఒక్కడే బతుకుతూ ఉండేవాడు… నియమబద్ధ జీవితం… మధ్యతరగతి జీవనం… ఎవరి మీదా ఆధారపడి బతకడం ఇష్టం లేదు… ఓనర్ తరచూ విసుక్కునేవాడు… అద్దె సరిగ్గా కట్టడం లేదంటూ నిందించేవాడు… ఇల్లు ఖాళీ చేసి, వెళ్లిపో అని అరిచేవాడు… ఆయన మౌనంగా భరించేవాడు, మీ అద్దె అణా పైసలతో సహా చెల్లిస్తాను అని చేతులెత్తి ఓ దండం పెట్టేవాడు… డబ్బు ఎక్కడ ఎలా కాస్త అడ్జస్టయినా ముందుగా అద్దె కట్టేవాడు… ఐనా కొన్నినెలలు బాకీ… రెండుసార్లు సామాను తీసి బయటపడేశాడు ఓనర్…
ఆ సామాను అంటే… ఓ పాత పరుపు, కొన్ని వంటపాత్రలు… పరువు పోతే అద్దె సక్రమంగా చెల్లిస్తాడని ఓనర్, అవీ బయటపడేసి, బజార్న నిలబెట్టాడు ఆ 94 ఏళ్ల పెద్దమనిషిని… అనుకోకుండా అక్కడికి వచ్చిన ఓ పత్రిక ఫోటోగ్రాఫర్ ఫోటో తీశాడు… ఆ అద్దెకుండే మనిషి ఎవరనేది ఓనర్‌కు తెలియదు, ఆ ఫోటోగ్రాఫర్‌కు తెలియదు… ఆ ఫోటో గ్రాఫర్ తను తీసిన ఫోటోను ఎడిటర్‌కు చూపించాడు… ఎడిటర్‌కు ఎక్కడో వెలిగింది, ఒకటికి నాలుగుసార్లు చూశాడు, లైబ్రరీ ఫోటోలతో సరిచూసుకున్నాడు… తీరా ఆయన చెప్పిన సంగతి తెలిసి ఫోటోగ్రాఫర్ షాక్ తిన్నాడు…
ఫోటో సంచలనం… ఎందుకంటే..? ఆయన ఈ దేశానికి రెండుసార్లు ఆపద్ధర్మ ప్రధానిగా పనిచేశాడు… పేరు గుల్జారీలాల్ నందా… తొలిసారి నెహ్రూ మరణించినప్పుడు… రెండోసారి లాల్ బహదూర్ శాస్త్రి మరణించినప్పుడు… రెండుసార్లు ఈయన హోం మంత్రిగా ఉన్నాడు, కాబట్టి తదుపరి ప్రధాని ఎవరో తేలేవరకు ప్రధానిగా వ్యవహరించాడు… మరి అద్దె కట్టలేని ఆ దుర్భర జీవితం ఏమిటి అంటారా..? అది ఆయన నమ్ముకున్న విలువలు కట్టబెట్టిన జీవితం కాబట్టి…
Ads
స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఆయన ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ ఛైర్మన్ కూడా… కొన్నాళ్లు ఆ ప్రణాళిక శాఖకు మంత్రి కూడా… కానీ ఆయనకు చివరకు సొంత ఇల్లు కూడా లేదు, కారు లేదు… మొదట్లో పింఛన్‌నే తిరస్కరించాడు… చివరకు వేరే దిక్కులేక, కూతురు ఇంట్లో ఉండేవాడు… అక్కడే కొంతకాలం అనారోగ్యానికి గురై అక్కడే మరణించాడు… ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న సియాల్‌కోటలో 1898లో పుట్టాడు… పంజాబీ కుటుంబం… 1921 నాటికే ఆయన నేషనల్ కాలేజీలో ఎకనమిక్స్ ప్రొఫెసర్… ఆయన సబ్జెక్టు లేబర్… వాళ్ల సంక్షేమం… గాంధీ పిలుపు మేరకు కొలువును వదిలి, పోరాటంలోకి వచ్చాడు, రెండుసార్లు జైలు జీవితం…
కాంగ్రెస్ కార్మిక అనుబంధ సంస్థ ఐఎన్‌టీయూసీకి ఒక దశలో అధ్యక్షుడు… లేబర్ డిస్ప్యూట్ బిల్లు ప్రవేశపెట్టింది ఆయనే… కాంగ్రెస్‌లో ఉన్నన్నిరోజులూ కార్మిక సంక్షేమమే లోకంగా బతికాడు… పనిచేశాడు… 1967 తరువాత రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యాడు… ముగ్గురు కొడుకులున్నా అందరినీ రాజకీయాలకు దూరంగానే ఉంచాడు… వ్యక్తిగతంగా అప్పులు చేయడానికి వ్యతిరేకి… ప్రభుత్వ సాయానికీ ఇష్టపడేవాడు కాదు… ఆయన మిత్రులు బలవంతంగా ఆయనతో సంతకం చేయించి, పింఛన్ వచ్చేలా చేశారు… దానిమీదే ఆధారపడి బతికాడు ఆయన…
Share this Article