సినిమా టికెట్ల ధరల తగ్గింపు, చిరంజీవి రాయబారం, హీరోల రెమ్యునరేషన్ల రచ్చ, వైసీపీ నేతల విమర్శలు, సినిమావాళ్ల ఎదురుదాడి, తెలుగుదేశం వైఖరి, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ధోరణి, రాంగోపాలవర్మ దౌత్యం……. వీటి జోలికి పోవడం లేదు ఇక్కడ… అన్ని వైపులా తప్పుంది… ప్రత్యేకించి ప్రభుత్వ ఆలోచనల ధోరణిలోనూ తప్పుంది… దాన్నలా వదిలేద్దాం… రాంగోపాలవర్మ పేర్ని నాని దగ్గరకు దౌత్యానికి వెళ్లాడు… ఏం జరిగింది..? ఏమీ జరగదు… అక్కడ జగన్ ఆలోచనల్లో మార్పు రాకుండా ప్రభుత్వ నిర్ణయాల్లో వీసమెత్తు తేడా, మార్పు ఉండదు… అది క్లియర్… జగన్ ఆలోచనల్ని మార్చే సీన్ వైసీపీలో ఎవరికీ లేదు… ఇండస్ట్రీలో అసలే లేరు…
ఐతే ఆ వర్మను తీసుకొచ్చి, ఏబీఎన్ స్టూడియోలో కూర్చోబెట్టి, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే నిర్వహించడమే ఎబ్బెట్టుగా అనిపించింది… వర్మ కూర్చునే విధానం నుంచి మాట్లాడే తీరు వరకూ అన్నీ ప్రేక్షకుడికి చిరాకెత్తించాయి… నిజానికి వర్మను ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఆర్కే తనను తాను కించపరుచుకుని, దిగజార్చుకుని, వర్మ స్థాయికి కొన్నిసార్లు దిగలేక మొహమంతా గంటుపెట్టుకున్న తీరు నవ్వు పుట్టించడం కాదు, ఆర్కే మీద జాలేసింది… అసలు వర్మ దౌత్యంతో ఒరిగేదెంత..? వర్మ మాటలకు ఉన్న విలువెంత..? తన ఇంటర్వ్యూతో ఆర్కే పోగొట్టుకున్న ఇజ్జత్ ఎంత..?
ఉండొచ్చు, చాలామందికి ఆర్కే రాజకీయ అభిప్రాయాల మీద వ్యతిరేకత ఉండవచ్చుగాక… అది వేరు… కానీ తను జర్నలిస్టు… తనతో ఇంటర్వ్యూకు అంగీకరించి అక్కడికి రావడం అంటే, ప్రేక్షక జనానికి, పాఠకజనానికి, జనానికి జవాబులు చెప్పడం కోసం వస్తున్నట్టుగానే సదరు అతిథి ఫీల్ కావాలి… అది బేసిక్ కామన్ సెన్స్, మర్యాద కూడా… సరే, వర్మ అనే ఓ పర్వర్టెడ్ కేసుకు అవేమీ తెలియవు… తెలియవు అని జనం అందరికీ తెలుసు, మరి ఎందుకోసం వర్మ ఇంటర్వ్యూ..? సో, తప్పు అనేది ఆర్కే వైపు నుంచే జరిగింది… నీకే దిగజారాలని ఉన్నాక ప్రేక్షకుడేం చేస్తాడు..? ఫాఫం ఆర్కే అని జాలిపడతాడు… జరిగిందీ అదే…
Ads
ఇంటర్వ్యూ చేయడానికి వచ్చే యూట్యూబ్ ఫిమేల్ ఇంటర్వ్యూయర్లను చూస్తూ…. మీ పిక్కలు బాగున్నయ్, పక్కలోకొస్తారా అనడిగే బాపతు వర్మ… కొందరు ఇంటర్వ్యూయర్లు అలా అడక్కపోతేనే బాధపడతారట… అదీ తన ఇంటర్వ్యూల రేంజ్… ఓ వెగటు ప్రపంచం అది… (vyus.in తరఫున ఇంటర్వ్యూ చేసిన పురాణపండ జయంతి మినహాయింపు… ఆమెకు కూడా వర్మ అలాగే గౌరవం ఇచ్చాడు…) టీవీ5 మూర్తి ఇంటర్వ్యూకు వెళ్లి, బూట్లతో కాళ్లను ఆ టేబుల్ మీద పెట్టి, పెడసరంగా, నన్నెవడు ఏం పీకుతాడు అన్నట్టుగా వర్మ వ్యవహరించాడు… పరమ దరిద్రంగా ఉంది… టీవీ5 చానెల్‌కు, మూర్తికి ఎలా ఉందో మనకెందుకులే గానీ… చూసేవాడికి మాత్రం ఓ జలదరింపు… థాంక్ గాడ్, ఆర్కే ముందు కూడా అలాగే కూర్చున్నాడు, కానీ ముందు టీపాయ్ లేదు, లేకపోతే పెట్టేసేవాడేమో… ఎలాగూ కామన్ సెన్స్ అనేది వర్మ దరిదాపుల్లోకి కూడా రాదు కదా…
పదే పదే ఫోన్ చూస్తుంటే ఆర్కే అడిగాడు… కాస్త వ్యంగ్యం దట్టించి, చిరాకెత్తి అడిగినట్టున్నాడు… ఆ ఫోన్ పక్కన పడేయరాదూ, ఆ పెదవి కొరకడం, ఆ ఫ్యాన్ చూడటం ఆపలేవా అనడిగాడు… దటీజ్ ఆర్కే… టీవీ5 మూర్తి కాదు కదా… జర్నలిస్టు తన జర్నలిస్టిక్ టెంపర్మెంట్ను చంపుకుంటే జర్నలిస్టుగా కూడా మరణించినట్టే… దానికి కూడా వర్మ బదులిస్తూ నా ఇష్టం అన్నాడు… పదే పదే అది డిస్టర్బెన్స్… అలాంటప్పుడు ఇంటర్వ్యూకు ఎందుకు రావాలి..? కుదరదు అని చెప్పేయాల్సింది… ప్రేక్షకులు, పాఠకులు, ప్రజలంటే అంత చిల్లర అభిప్రాయం ఉన్నవాడు తన భావాలేమిటో వాళ్లకు చెప్పుకోవడానికి ఎందుకు రావాలి..? గో టు హెల్… నువ్వూ, నీ పేర్ని నాని కలిసి తందనాలాడండి… వూ కేర్స్..?
నిజానికి ఇంటర్వ్యూ అంతా రెండు ఎక్స్ట్రీమ్ కేరక్టర్ల చిట్‌చాట్ అనిపించింది తప్ప… అదొక ఇంటర్వ్యూ కాదు, ఓ హుందాతనమూ లేదు… మరీ నేలటికెట్టు రేంజ్… సారీ, అదంటే గౌరవం లేక కాదు… వర్మ ఇంటర్వ్యూకన్నా అది వేల రెట్లు బెటర్… ఇక మీరు చూడండి, రేపు ఈ తలతిక్క, వెగటు, చిల్లర, నేలబారు ఇంటర్వ్యూను ఫుల్ పేజీ అక్షరమక్షరం అచ్చేసి, రాధాకృష్ణ తనను తాను మరింత దిగజార్చుకుంటాడు… అది ఆంధ్రజ్యోతి ఖర్మ… ఆ పాఠకుల ఖర్మ…!!
Share this Article