ఒక హ్యూమన్ ఇంట్రస్టింగ్ వార్తను ప్రజల్ని కనెక్టయ్యేలా రాయడం ఒకెత్తు… దాన్ని బరువైన హెడ్డింగ్‌తో, మంచి శైలితో రీరైట్ చేసి, పాఠకులకు ప్రజెంట్ చేయడం మరో ఎత్తు… మొదటిది రిపోర్టర్ పని… రెండోది డెస్కులో సబ్ఎడిటర్ పని… ప్రస్తుతం జర్నలిజం ప్రమాణాలు ఎలా ఉన్నాయో మనకు తెలుసు కాబట్టి, ఆ చర్చలోకి వెళ్లకుండా… ఈ ఒక్క వార్త సంగతే ఆలోచిద్దాం… నిజానికి మనల్ని కదిలించే వార్త… గుండెల్ని కొన్నివార్తలు మెలితిప్పుతాయి… ఇదీ అలాంటిదే… విధివంచిత కుటుంబాలు, జీవితాలు… మరీ లోతుగా ఆలోచిస్తే ఓరకమైన వైరాగ్యాన్ని కలిగించేవి…
విషయం ఏమిటంటే..? తెలంగాణలోని పాత కరీంనగర్ ఉమ్మడి జిల్లా, పెద్దపల్లి… చెల్లె చనిపోయింది… ఆ అక్క ఎవరికీ చెప్పకుండా ఆ మృతదేహాన్ని అలాగే ఉంచి ఏడుస్తోంది… నిజానికి ఏడుపు కూడా కాదు, అదోరకమైన షాక్‌లో ఉంది… అదీ వార్త… చెల్లె పేరు శ్వేత… అక్క పేరు స్వాతి… ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు… శ్వేత చదువుకున్నదే… ఎంసీఏ చేసింది… స్వాతి చదువుకున్నదే… ఎంటెక్ చేసింది, ఓ ప్రైవేట్ స్కూల్లో టెక్నిషియన్…
పదేళ్ల క్రితం అమ్మ చనిపోయింది… ఆ తరువాత తండ్రి రాజేశం వాళ్లను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు… వీళ్ల ఆలనాపాలన, మంచీచెడూ అమ్మమ్మ, తాత చూసుకునేవాళ్లు… ఆమధ్య వాళ్లూ మరణించారు… ఇప్పుడు ఏవో అనారోగ్య కారణాలతో చెల్లె మరణించింది… విధి రాసిన కన్నీటి కథలివన్నీ… అక్క మనసు ఎండిపోయింది… ఆ షాక్‌లో చెల్లె మృతదేహం పక్కనే అలా ఉండిపోయింది…
Ads
మన సొసైటీ సంగతి తెలుసు కదా… ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుంటే పోలీసులకు చెప్పారు… అప్పటిదాకా ఆ అక్కాచెల్లెళ్ల బాగోగులను పట్టించుకున్నవాడే లేడు… విధి కొట్టిన దెబ్బలతో, ఓరకమైన దుఖభరిత మానసిక స్థితిలో అక్కాచెల్లెళ్లు సొసైటీతో కూడా దూరదూరంగా ఉండేవాళ్లు… ఐనవాళ్లు లేరు, వరుసగా దెబ్బలు, మానసిక స్వాంతన లేదు… భరోసా లేదు… జీవితంలో కాస్త ఆశను వెలిగించేవాళ్లూ లేరు… రేప్పొద్దున మంచి రోజు అనేది కనిపించని బతుకులు అవి… ఆంధ్రజ్యోతిలో ఓ తలతిక్క హెడ్డింగు పెట్టి, మంచి శైలినీ చెడగొట్టి, హ్యూమన్ ఇంట్రస్టింగ్ వార్తను ఎలా రాయకూడదో ఓ ఉదాహరణగా మలిచారు…
‘‘మూడు రోజులుగా చెల్లెలి మృతదేహం వద్దనే అక్క సహజీవనం’’ ఇదీ హెడ్డింగ్… నిజంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను తలుచుకుని జాలిపడాల్సిన శీర్షిక… అసలు సహజీవనం ఏమిటి..? ఆ పదాన్ని దేనికి వాడతాం..? ఆమాత్రం సోయి లేదా ఆ డెస్కుకు..? మృతదేహంతో సహజీవనం అనే పదాల్ని చదవడానికే ఓరకమైన జలదరింపు… అప్పుడే అయిపోలేదు…
కరీంనగర్ ఎడిషన్… ఏడో పేజీలో తలతిక్క హెడ్డింగ్‌తో వార్త… అదే ఎడిషన్ మూడో పేజీలో ‘‘మృతదేహంతో మూడు రోజులుగా చెల్లెలి శవంతో ఇంట్లోనే అక్క’’ అనే హెడ్డింగ్‌తో మరో వార్త… రెండూ సేమ్… రిపిటీషన్… నిజానికి ఇలాంటివి రాయాలన్నా, ఓ మంచి హెడ్డింగ్ పెట్టాలన్నా కలానికి ఓ ఫీల్ కావాలి… అది లేకపోతే జర్నలిస్టు పనికీ, పనితనానికీ విలువ లేదు… ఇక్కడ అదే కనిపిస్తోంది… హెడ్డింగ్, శైలి, ప్రజెంటేషన్, రిపిటీషన్, ప్రయారిటీ… ప్రతి అంశంలోనూ దరిద్రమే… అవును… ఆ అక్కాచెల్లెళ్ల మానసిక స్థితికి ఆ వార్త అద్దం పట్టాలీ అంటే కలానికీ మనసుండాలి, అర్థం చేసుకోగలగాలి… ప్రతిదీ తుచ్ఛమైన రాజకీయ నాయకుల ప్రకటన వార్తల్లాగా రాసేయడం అలవాటైతే… నిజమైన వార్తలు కూడా, ఇదుగో, ఇలాగే భ్రష్టుపడతయ్…!! (టీవీల్లో కవరేజీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది… అసలు జర్నలిజం తెలిసిన చానెళ్లు తెలుగులో ఏమున్నాయని..?! అన్నీ డప్పు చానెళ్లు, డొక్కు చానెళ్లే కదా..!!) (ఆంధ్రజ్యోతిలోనే ఓ సగం పేజీ యాడ్ కనిపించింది, ట్రైనీ జర్నలిస్టులు కావాలీ అని… ప్లీజ్ సర్, మీ సిలబస్‌లో ఈ పాఠాన్ని కూడా చేర్చండి… ఓ వార్త ఎలా ప్రజెంట్ చేయకూడదో ఓ ఉదాహరణ…)
Share this Article