కొన్ని వార్తలు అసలు ఎందుకు మెయిన్ స్ట్రీమ్‌కు కనిపించవో, అవి వార్తలుగా ఎందుకు పరిగణనలోకి తీసుకోరో అర్థం కాదు… సొసైటీకి మంచి జరిగే ఆలోచనలు, వార్తలు మెయిన్ స్ట్రీమ్‌కు అస్సలు అక్కరలేదా..? ఈ వార్త ఫేస్‌బుక్‌లో ఓ మిత్రుడి వాల్ మీద కనిపించింది… వేములవాడలో ముస్లిం కమ్యూనిటీ ఓ భేషైన నిర్ణయం తీసుకుంది… అదేమిటో మీరే చదవండి…
Mujahid Pasha…………. అమ్మాయి పెళ్లిలో విందు భారం వద్దు వేములవాడ గ్రామస్థుల తీర్మానం
నికాహ్ (పెళ్లి) ఖర్చు అమ్మాయి తల్లిదండ్రులకు తడిసిమోపెడవుతోంది. వరుడి తల్లిదండ్రులు పెళ్లిలో పది రకాల వంటకాలతో అదిరిపోయే విందు ఏర్పాట్లు చేయాలనే డిమాండు అమ్మాయి తల్లిదండ్రులకు తలకుమించిన భారంగా మారుతోంది. కట్నకానుకలు సమర్పించుకోవడంతోపాటు విందు ఖర్చు తడిసిమోపెడవుతోంది. ఈ భారం నుంచి గట్టెక్కించేందుకు ఆ గ్రామస్థులంతా ఒక్కటయ్యారు. తమ ఊళ్లో జరిగే పెళ్లిళ్లలో కేవలం ఒకే ఒక్క వంటకంతోనే విందు ఉండేలా తీర్మానించారు. ఎవ్వరూ తమ కుమార్తెల వివాహ విందులో బగారా, చికెన్, ఒక స్వీటు తప్ప ఇతర వంటకాలేవీ వడ్డించవద్దని ముస్లిమ్ సంఘాల పెద్దలంతా ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు.
Ads
వేములవాడ ముస్లిములు తీసుకున్న ఈ నిర్ణయానికి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వాట్సాప్ గ్రూపుల్లో అందరూ అభినందిస్తున్నారు. పెళ్లిళ్లలో పేద, ధనిక అనే తాహతు చూడకుండా మగ పెళ్లివారు విందు గొప్పగా జరగాలనే డిమాండు పెడుతున్నారు. పెళ్లికొడుకు తమ స్టేటస్ చూపించుకునేందుకు పెడుతున్న ఈ డిమాండుతో ఆడ పిల్లల తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇది సమస్ఠిగా తీసుకున్న నిర్ణయమని వేములవాడ ముస్లిమ్ టౌన్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ముహమ్మద్ అక్రమ్, సయ్యద్ రసూల్ లు బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆడపిల్ల పెళ్లిలో విందు ఏర్పాటు చేసే ఆచారానికి ఇస్లామ్ లో తావులేదని, అలాంటిది వారిపై విందు ఖర్చు మోపడం సబబు కాదని పలువురు పెదవి విరుస్తున్నారు. వేములవాడ ముస్లిమ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఆడపిల్లల తల్లిదండ్రులకు కొంతలో కొంతైనా ఊరటనిస్తుందని భావిద్దాం. రాష్ట్రంలోని ఖాజీలు కూడా వరకట్నం తీసుకునే వారి పెళ్లిళ్లు జరపబోమని తీర్మానించాలనే డిమాండు తెరపైకి వస్తోంది. వేముల ముస్లిములంతా ఒకచోట సమావేశమై ఇంతమంచి నిర్ణయానికి రావడం నిజంగా అభినందనీయం. ఈ నిర్ణయానికి గ్రామస్థులంతా కట్టుబడాలని కోరుకుందాం….. – ముహమ్మద్ ముజాహిద్
నిజానికి ఇవి కదా వార్తలు… ముస్లిం కమ్యూనిటీలోనే కాదు, మిగతా మతాలు, కులాలు కూడా ఇలా తమ సామాజికవర్గ భేటీలు వేసుకుని, ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే ఇంకా బెటర్… ఒకరినిచూసి మరొకరు, విందుల ఖర్చులు పెరిగిపోతున్నయ్… ఎక్కువ ఐటమ్స్, అట్టహాసం, ఆడంబరం ఆడపిల్ల తల్లిదండ్రులపై బాగా భారం మోపుతున్నయ్… ఏమీ లేనివాడికి పర్లేదు, అన్నీ ఉన్నవాడికి పెద్దగా ఫరక్ పడదు… ఎటొచ్చీ మధ్యతరగతి వాడికే ఉరి… అందుకే పెళ్లిళ్ల ఖర్చు మీద ఓ క్యాంపెయిన్ అవసరం… మతాలవారీ, కులాలవారీ కఠిన నిర్ణయాలు తీసుకుంటే అంతకుమించి ఏం కావాలి..?! అవును, ఇలాంటివి ప్రభుత్వాలకు చేతకావు… సొసైటీకి మంచి అనేది ప్రభుత్వానికి ఎప్పుడూ పట్టదు… సొసైటీయే సంస్కరించుకోవాలి…!!
Share this Article