ప్చ్… అడ్డెడ్డే… ఎంత పనిచేస్తివి లక్ష్మిపార్వతీ… ఇంత లేటుగా ఈ విషయం వెల్లడిస్తే ఎలా..? ఎన్టీయార్ మరణించి 26 ఏళ్లయ్యాక హఠాత్తుగా ఈ ఆత్మబాంబు ఎందుకు పేల్చినట్టు తల్లీ..? ఇదేదో ముందే చెప్పి ఉంటే, వర్మ తీసిన సినిమా కథ వేరే ఉండేది… అసలు ఎన్టీయార్ చెప్పిన వివరాలతో రెండుమూడు సినిమాలు అలా అలా అలవోకగా చుట్టేసి, అవతల పారేసేవాడు… హెబ్బే… ఇప్పుడు ఏం చెప్పినా ఏం లాభం..? పోనీ, నువ్వయినా ఆత్మకథలో ఈ ఆత్మ ఎపిసోడ్ రాయకపోతివి..?
అవునూ, ఏమంటివి..? ఏమంటివి..? ఎన్టీయార్ మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో పుడతాను అన్నాడా..? ఓహో… ఈ ప్రజల్ని విడిచిపెట్టేది లేదు అన్నాడా..? అబ్బో… ఇంకా..? ఇంకా..? మరో చిత్రమైన విషయం చెబుతుంటివి, నిజమేనంటావా..? తెలుగు రాష్ట్రాల్ని పాలించే సీఎంల మనస్సుల్లో చేరి, వారికి ఎల్లప్పుడూ జనహిత కార్యక్రమాల్ని ప్రబోధిస్తూనే ఉంటానన్నాడా..? అయితే ఎన్టీయార్ పదవిని లాక్కున్న తమరి అల్లుడుంగారు, అనగా చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లు, మొన్నటిదాకా సపరేట్ ఆంధ్రకు అయిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశాడు కదా… అంటే తనను నిండా ముంచి, తన మరణానికి పరోక్షంగా కారకుడైన చంద్రబాబును కూడా క్షమించేసి, ఆయన హృదయంలో కూడా చేరి, మంచి వైపు ప్రబోధాలు చేసేవాడా ఎన్టీయార్..? ఏం చెప్పావమ్మా..?
అవునూ, అకస్మాత్తుగా ఏమైంది తమరికి..? ఈ ఆత్మ ఏమిటి..? జీవిత నిన్ను చెన్నై తీసుకుపోవడం ఏమిటి..? కుముద్విని అనే పదహారేళ్ల పిల్లతో మాట్లాడించడం ఏమిటి..? ఆ పిల్ల ఎన్టీయార్ ఆత్మను ఆవాహన చేసుకోవడం ఏమిటి..? నీతో ముచ్చటించడం ఏమిటి..? ఇదంతా ఇప్పుడు తమరు వెల్లడించడం ఏమిటి..? పోనీ, అదంతా ఎడమచేత్తో ఓ పుస్తకం రాసి పడేయకపోయావా అమ్మా..? (ఎన్టీయార్ గారే వచ్చారేమో అనే భ్రమ కలిగింది నాకు అంటావ్ మళ్లీ… అంటే భ్రమా, నమ్మకమా..? అసలు ఇంతకీ అంతిమంగా ఫీలైందేమిటి..? మనమధ్యే ఆయన ఆత్మ తిరుగాడుతోంది అంటావ్, ఎక్కడో ఇక్కడే పుడతాడనన్నాడు అంటావ్, తెలుగు రాష్ట్రాల్లోనే పుడతాను అన్నాడంటివి, అంటే రెండు తెలుగు రాష్ట్రాలు అవుతాయని ఎన్టీయార్‌కు మరణానికి ముందే తెలుసా..? ఫాఫం, అది తమరితో చెప్పుకున్నాడా..?)
Ads
నిజానికి కొందరు మనుషులు ఆత్మలతో మాట్లాడటం అనేదేమీ కొత్త కల్పన కాదు.., కోరికలు తీరకుండా మరణించిన ఆత్మలు ఊర్ద్వలోకాలకు వెళ్లకుండా, ఇక్కడే తచ్చాడుతుంటాయనేది చాలామందికి ఓ నమ్మిక… అవి సరైన మాధ్యమం దొరికితే (మనుషులే) తమ మనస్సుల్లో ఉన్నవి చెప్పడానికి ప్రయత్నిస్తాయంటారు… దీనిమీద ప్రపంచ భాషలన్నింట్లోనూ బోలెడు సాహిత్యం ఉంది, సినిమాలు వచ్చాయి, వెబ్ సీరీస్ వచ్చాయి… ఊజా బోర్డుగా పిలిచే (పైన ఉంది చూడండి…) ఓ పటం మీద నాణెం ద్వారా లేదా గ్లాసు ద్వారా లేదా ఇంకేదైనా తేలిక వస్తువు ద్వారా ఆత్మ అక్షరాలపై కదులుతూ తనేం చెప్పాలనుకుందో చెబుతుంది… దీన్ని నమ్మేవాళ్లుంటారు, నమ్మనివాళ్లూ బోలెడు… అంతేతప్ప ఆత్మ నేరుగా మనుషుల్ని ఆవహించి, కావల్సినవాళ్లతో ముచ్చటించడం అనేది ఫిక్షన్… అవునూ, చెన్నైలో ఆ కుముద్వినిని ఆవహించాక ఎన్టీయార్ మళ్లీ లక్ష్మిపార్వతితో మాట్లాడటానికి ఇంకేదైనా మార్గంలో ప్రయత్నించాడా..? ఆమె ఇప్పటికీ అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉంటుందా..? ఏమో… ఆమే చెబుతుంది… వేచి ఉండండి… మీ నమ్మకం, మీ ఇష్టం… ఫాఫం…
Share this Article