ప్రజాస్వామ్య విభక్తి సూత్రాల్లో ఆణి ముత్యాలు!
————————
“ప్రజాస్వామ్యమంతటి అరాచకమయినది ఇంకొకటి లేదు- ప్రజాస్వామ్యానికి మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేనే లేదు” అని బ్రిటన్ ప్రధానిగా పనిచేయడానికి ముందెప్పుడో విన్స్టన్ చర్చిల్ చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది. మన చాటువుల్లా ఒక్కోసారి చెప్పినవారెవరో ప్రధానం కాదు. చెప్పిన విషయమే ముఖ్యం. ప్రజలే ప్రభువులు అన్నది ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతం. దాని ప్రకారం విధి విధానాలు, ఎన్నికలు, ప్రాతినిథ్య ప్రక్రియలు ఏర్పడ్డాయి.
Ads
ప్రజల కోసం
ప్రజల వలన
ప్రజల చేత
ఎన్నుకుంటే ప్రజా ప్రతినిధులు గెలుస్తారు. కోసం, వలన, చేత విభక్తులే కాకుండా లోతుగా వెళితే ఈ ఎన్నికలస్వామ్య వ్యాకరణంలో ఇంకా మిగిలి ఉన్న విభక్తులు కూడా ప్రజలమీదే దాడి చేయడం కనిపిస్తుంది. మాతృభాష మీద, దాని వ్యాకరణం మీద మనకు గౌరవం ఉండదు కాబట్టి ఈ విభక్తులు మనమీద ప్రజాస్వామ్యం పేరిట చేసే దాడులను మనం గుర్తించలేం. లేదా వాటిని దాడులుగా గుర్తించే స్పృహ మనకు కలుగదు.
భక్తి లేకపోవడం అభక్తి. సంస్కృతంలో “వి” విశేషణానికీ పని చేస్తుంది. వ్యతిరేకార్థానికీ ఉపయోగపడుతుంది. శిష్ట – విశిష్ట కిరణం- వికిరణం – విభక్తిస్వామ్యం
————–
1. ప్రథమావిభక్తి-
డు, ము, వు, లు
తెలుగులో ఓట్/వోట్ అన్న మాటే లేదు. కాబట్టి మన ప్రథమా విభక్తి సూత్రం ప్రకారం ఏకవచనంలో వోట్ ప్లస్ ఉ – వోటు అయ్యింది. అదే బహువచనంలో వోట్ ప్లస్ లు- వోట్లు అయ్యింది. ఇదే సూత్రం ప్రకారం వోటు వేసేవారు ఏకవచనంలో ఓటరు, బహువచనంలో ఓటర్లు అవుతారు. ఓటరుడు, ఓటరుళ్లు అంటే బాగోదు. అరి, అరు సంబంధ వాచకంలో వచ్చి గడుసు- గడసరి అయినట్లు ఓటు వేసేవారు ఓటరు అన్న మాట అవుతుంది. ఇంతకంటే లోతుగా వెళితే ఓటుకు ఓటి విలువ కూడా దక్కదు.
2. ద్వితీయా విభక్తి-
నిన్, నున్, లన్, గూర్చి, గురించి
గెలిచిన నాయకుడే ఎప్పుడయినా ప్రథమా విభక్తి. మన భక్తి ప్రపత్తులన్నీ అతని లేదా ఆమె మీదే ఉండాలి. ఓటర్లుగా మనం ద్వితీయ స్థాయిలోనే ఉండాలి. అతడినిన్ లేదా ఆమెనున్ లన్ గూర్చి గురించే మనం భజన చేస్తూ ఉండాలి.
3. తృతీయా విభక్తి-
చేతన్, చేన్, తోడన్, తోన్
ప్రజా ప్రతినిధి చేతన్ చేన్ తోడన్ తోన్ మనం పాలింపబడతామన్న ఎరుక ఎప్పటికీ మరువకూడదు. మనం ఒకవేళ మరచిపోతే ప్రతినిధులు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు.
4. చతుర్థీ విభక్తి-
కొఱకున్ (కొరకు), కై
ప్రజా ప్రతినిధుల కొరకు, కై మన ప్రజాస్వామ్య మూల స్తంభాలు బలంగా ఉంటాయి. అందులో ప్రజా అని రెండక్షరాలున్నాయి కాబట్టి ఆ స్తంభం కింద రెండడుగుల్లోతులో ప్రజలుగా మనం అణిగి మణిగి ఉంటాం.
5. పంచమీ విభక్తి-
వలనన్, కంటెన్, పట్టి
ప్రజాప్రతినిధి వలన మనకు ప్రభుత్వం తెలుస్తుంది. ప్రతినిధి కంటే ప్రభుత్వం ఎప్పుడూ గొప్ప కాదు. ప్రతినిధిని పట్టుకుంటేనే పనులయ్యేలా వ్యవస్థ పట్టి ఉంటుంది.
6. షష్ఠి విభక్తి-
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
ప్రతినిధికి, ప్రతినిధి యొక్క, ప్రతినిధిలో, ప్రతినిధి ఇంటి లోపల అని అన్వయించుకుంటే చాలు. అంతకంటే లోపలికి వెళ్లడానికి ప్రతినిధి గన్ మెన్లు ఒప్పుకోరు.
7. సప్తమీ విభక్తి-
అందున్, నన్
ప్రతినిధినందునే ప్రజాస్వామ్యం ప్రతిఫలిస్తూ ఉంటుంది.
8. సంబోధన ప్రథమా విభక్తి-
ఓ, ఓరీ, ఓయీ, ఓసీ
నిజానికి ఇది డు ము వు లు కంటే ముందే ఉండాల్సింది. ఓట్లు వేయించుకునే వరకు అయ్యా, అమ్మా , అన్నా, అక్కా , తమ్మీ, బాబూ. గెలవగానే- ఓయ్, ఓరీ, ఒసేయ్.
అన్నట్లు- తెలంగాణాలో అయ్యా బాబూ ఫలానా పని మీరు హామీ ఇచ్చి చేయలేదు అని ఒక ఎమ్మెల్యేను బహిరంగ సభలో జనం నిలదీస్తే- అలా అడిగినందుకు అదే సభ వేదిక మీద ఆ ఎమ్మెల్యే పడుకుని నిరసన ప్రకటించాడు. ఆయనలా పడుకోవడాన్ని నిరసిస్తూ ఆ ఊరి మాజీ సర్పంచ్ ఒక అమాయక మహిళ కూడా ఆయన పక్కనే కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. ఎప్పుడో తప్ప ఇలాంటి ఆణి “ముత్యాలు” దొరకవు.
ప్రజాస్వామ్యం రెండు కళ్లల్లో ఈ ఇద్దరి నిరసన ఆనందాశ్రువులుగా మారి ఈరోజు వార్తలుగా పాఠకులదాకా వచ్చింది.
“ఉన్నది మనకు ఓటు-
బతుకుదెరువుకే లోటు.
గాంధి పుట్టిన దేశమా ఇది?
నెహ్రు కోరిన సంఘమా ఇది?
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా?”
- పమిడికాల్వ మధుసూదన్
Share this Article