అల్లూరి సీతారామరాజు కథను దారుణంగా వక్రీకరించారనీ, ఒక ఆరాధ్యుడైన వ్యక్తి చరిత్రకు తప్పుడు బాష్యాలు చెబుతున్నారనీ మొన్న ఎవరో కోర్టులో ఆర్ఆర్ఆర్ సినిమా మీద కేసు వేశారని చదివాను… అదేరోజు సోషల్ మీడియాలో ఓ వీడియో కనిపించింది… కంటికింపుగా ఉంది… తమ ఆచారాల్ని, తమ నమ్మకాల్ని, తమ దేవుళ్లని కొన్ని మానవసమూహాలు పదిలంగా కాపాడుకునే తీరు అబ్బురంగా కూడా ఉంది… గోండులు నాగోబా జాతర కోసం గోదావరి గంగను తీసుకురావడానికి వెళ్లే దృశ్యం అది… ముందుగా ఆ వీడియో చూడండి…
ఇది చూశాక అనిపించింది… ది గ్రేట్ ఇల్యూషనిస్ట్ రాజమౌళి తన సినిమాలో ఒక్కటంటే ఒక్కటి ఆ గోండుల చరిత్ర, సంస్కృతికి సంబంధించిన సీన్ తీశాడా అనే డౌట్ వచ్చింది… ఎందుకంటే… తన సినిమాలో చూపించే కుమ్రం భీం ఆ ఆదివాసీల కోసం జల్, జంగిల్, జమీన్ అంటూ కొట్లాడిన ధీరోదాత్తుడు కాబట్టి… లక్షల మంది గోండులకు ఆరాధ్యుడు కాబట్టి… మరి ఆయన చరిత్ర తీస్తున్నప్పుడు ఆ సమూహం కట్టుబాట్లు, జీవనసరళి, నమ్మకాల గురించి టచ్ చేసి ఉండాలి కదా… నో… రాజమౌళికి అవేమీ పట్టవు…
Ads
పోనీ, జోడేఘాట్ వంటి ఏరియాలకు రాజమౌళి టీం వెళ్లిందా..? ఏమైనా అధ్యయనం చేసిందా..? మొన్నామధ్య ఓ విలేకరి (మెయిన్ స్ట్రీమ్ విలేకరి కావచ్చు, సినిమా రిపోర్టర్ అయి ఉండడు…) ప్రెస్‌మీట్‌లో ఇదే అడిగాడు… రాజమౌళి సమాధానం చెప్పలేకపోయాడు… ఏదో తలాతోకా లేని వివరణ ఏదో ఇవ్వబోయి, మీరే సినిమా చూస్తారు కదా అని ముక్తాయించి, హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు… నిజమే, క్రియేటివ్ ఫ్రీడం పేరిట ఇద్దరు వేర్వేరు కాలాలకు చెందిన గిరిజన ఆరాధ్య నాయకుల పాత్రల్ని (అల్లూరి, కుమ్రం) తీసుకుని, వాళ్లిద్దరూ కలుసుకున్నట్టు, కలిసి పోరాడినట్టు ఏదో కథ అల్లి, ఇద్దరి చరిత్రల్నీ భ్రష్టుపట్టించే ప్రయత్నమే తప్ప మరొకటి లేదా..?
క్రమేపీ బలపడుతున్న సందేహాలు ఇవే… ఇప్పుడు సినిమా వాయిదా పడవచ్చుగాక… కరోనా థర్డ్ వేవ్ దృష్ట్యా, వసూళ్లు తగ్గుతాయనే సందేహంతో వాయిదా వేశారు… పలు భాషల్లో, దేశదేశాల్లో ప్రదర్శించి వేల కోట్లు సంపాదించాలి కదా… తప్పులేదు… కానీ 3 లేదా 400 కోట్ల ఖర్చు అంటున్నారు… వేల కోట్ల టార్గెట్ అంటున్నారు… కనీసం ఆ ఇద్దరు నాయకులు, వాళ్ల నేపథ్యాల్ని గౌరవప్రదంగా స్పృశించాలి కదా… సృజన అంటే చరిత్రకు మకిలి పట్టించడం కాదు కదా… ఈ కనీస సోయి రాజమౌళిలో లేదా..?
గోండుల జీవనసరళి సరే… పోనీ, మన్నెం గిరిజనుల ఆచారవ్యవహారాలు, అల్లూరి వాళ్లతో మమేకమైన తీరు సూచనప్రాయంగానైనా టచ్ చేశాడా రాజమౌళి… అదీ డౌటే… ఎందుకంటే… ఏ బ్రిటిష్ పోలీసుల్ని దునుమాడిండో ఆ బ్రిటిష్ పోలీసుల్లో అల్లూరి కూడా ఒకడిగా పనిచేసినట్టు సీన్స్ కనిపిస్తున్నయ్… దారుణం… ప్రజలు, కొన్ని సమూహాల మనోభావాలను తుంగలో తొక్కినట్టే… ఇష్టారాజ్యంగా చారిత్రిక నాయకుల కథల్ని మార్చిపారేసి, అదే క్రియేటివ్ ఫ్రీడం అనే సాకులు, కథలు చెబితే అది సమంజసమేనా..? ఇదీ చర్చ… మితిమీరిన హీరోయిజం, ఓ విదేశీ మహిళ పాత్ర, వీళ్ల నాటు నాటు స్టెప్పులు, సాంగులు, ఫైట్లు… సగటు తెలుగు హీరోయిజాన్ని ఆకాశానికెత్తితే అదే ఘనతా..? మరి వక్రీకరణకు గురయ్యే పాత్రల సంగతేమిటి మరి..?
జరగనివ్వండి చర్చ… తప్పులేదు… అల్లూరి సీతారామరాజు ఆహార్యాన్ని, క్లైమాక్స్‌ను సూపర్ స్టార్ కృష్ణ కూడా సినిమాటిక్‌గా మార్చుకున్నాడు… కానీ అది ప్రేక్షకుల మెప్పు పొందేలా ఉంది తప్ప, అల్లూరి పోరాటగాథను మరింతగా ఎలివేట్ చేసిందే తప్ప… పూర్తిగా ఆయన కథను, కేరక్టరైజేషన్‌ను భ్రష్టుపట్టించలేదు… అందుకే జనం ఆ సినిమాకు నీరాజనాలు పట్టారు… కోర్టులో కేసు అనగానే ఇవన్నీ గుర్తొచ్చాయి… ఏమోలెండి… జగమెరిగిన దిగ్దర్శకుడు కదా, బాహుబలిలోలాగే కొబ్బరి స్ప్రింగ్ చెట్ల క్రియేటివిటీ ఈ ఆర్ఆర్ఆర్‌లో కూడా చూపించే ఉంటాడు… చూద్దాం…!! తీసేవాడికి చూసేవాడు లోకువ…!!
Share this Article