అవునూ, ఈ వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎందుకు కనిపించలేదు… అంటే తండ్రి ఆవేశంతో, కోపంతో ఏదైనా ఘాతుకానికి పాల్పడితే తప్ప మెయిన్ స్ట్రీమ్‌కు వార్త కాదా ఏం..? నిజానికి ఇది వార్తే… తప్పకుండా రాయదగిన వార్త… సొసైటీలో చర్చ జరగాల్సిన వార్త… ఎందుకంటే..? కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందనే కోపంతో ఒక తండ్రి తన కూతురికి దినకర్మ పెట్టాడు… అంటే కర్మకాండ జరిపించేశాడు… అంటే తన దృష్టిలో మరణించినట్టు లెక్క… అంటే జస్ట్, తన కోపాన్ని, అయిష్టతను ఆ రూపంలో వ్యక్తీకరించాడు… అంతేతప్ప ఏ కత్తో ఏ కొడవలో పట్టుకుని బజారుకెక్కలేదు… తన బాధ అది…
ఇప్పుడు మళ్లీ ఓ చర్చ… కనిపెంచిన సంతానం భవిష్యత్తు కూడా బాగుండాలనే కదా ఏ పేరెంట్స్ అయినా కోరుకునేది… అన్నీ ఆలోచించే కదా నిర్ణయాలు తీసుకుంటారు… కానీ గుండెలపై తన్నేసి, తమకు ఇష్టం వచ్చినవాళ్లను పెళ్లాడేసి వెళ్లిపోతే… అందరూ తిట్టేది మళ్లీ పేరెంట్స్‌నే… పెంపకం సరిగ్గా లేదంటారు కొందరు, ఇష్టమున్నవారితో పెళ్లిచేసేయాలి కదోయ్ అంటారు మరికొందరు… పిల్లలు పెరిగాక ఇక నీ ఇష్టం ఏమిటోయ్ అనేస్తారు ఇంకొందరు… రేప్పొద్దున ఆ పెళ్లికేమైనా అయితే, బిడ్డ కదా, ప్రేమగా చేరదీయాలి కదా, ఇంకెవరు పట్టించుకుంటారు అనేది కూడా ఈ లోకమే…
Ads
నిజమే, ప్రేమ గుడ్డిది… కొన్నేళ్లుగా మరీ ఆ గుడ్డితనం స్కూల్ ఏజ్‌లోనే వచ్చేస్తోంది… థాంక్స్ టు అవర్ మూవీస్, అవర్ నవల్స్, అవర్ టీవీ సీరియల్స్ ఎట్సెట్రా… మరీ పది తప్పిన అబ్బాయి, ఇంటర్ చదివే అమ్మాయి.,. ఆలోపు కూడా… అసలు వాళ్ల మెంటల్ మెచ్యూరిటీ లెవల్స్ ఎంత..? ఆ తండ్రి వద్దు బిడ్డా అని వారిస్తే తప్పేమిటి..? సరే, అవన్నీ వదిలేద్దాం… ఇక్కడ ఆంధ్రప్రభలో ఈ వార్త చదువుతుంటే చాలా డౌట్స్… ముందుగా ఈ వార్త ఏమిటో చూద్దాం…
మహబూబ్‌నగర్ జిల్లా, చిన్న చింతకుంట మండలం, మద్దూరు గ్రామం… కోటేశ్వర్, పద్మ ఇద్దరు దంపతులకు ఇద్దరు బిడ్డలు… మొదటి బిడ్డకు ఆల్రెడీ పెళ్లయింది… రెండో బిడ్డ భార్గవి ఇంటర్ చదువుతోంది… అదే గ్రామంలో ఉండే కోటేశ్వర్ సోదరి కొడుకు వెంకటేశ్‌ను ఆ రెండో బిడ్డ ప్రేమించింది… తండ్రి వద్దన్నాడు… కానీ భార్గవి వినలేదు, పెళ్లి చేసుకుంది… దాంతో తండ్రి కోపంతో బిడ్డకు కర్మకాండ చేశాడు… గుండు గీయించుకున్నాడు… ఇదీ వార్త…
ఇక్కడ నిజానికి కులం అనే ఇష్యూ లేదు… ఎవరో తెలియని అబ్బాయి కూడా కాదు… పరువు పోయిందనే ఫీల్ ఎందుకో అర్థం కాదు… అఫ్కోర్స్, చదువూ సంధ్యా సరిగ్గా లేని వాడిని పెళ్లి చేసుకోవడం ఏమిటనేది తండ్రి కోపం కావచ్చు… చెల్లె కొడుకే, అంటే అమ్మాయికి బావ అవుతాడు… సో, వరసకు పెళ్లి చేసుకోదగిన సంబంధమే… కానీ ఆ పెళ్లి చేయడం తండ్రికి ఇష్టం లేదు… అంతేతప్ప ఇక్కడ పరువు కోల్పోయింది ఏముంది..? తండ్రి ఓవర్ రియాక్టయినట్టుగా అనిపిస్తోంది కదా… ఎట్లీస్ట్, ఆ వార్త చదివితే అలా స్థూలంగా అనిపిస్తోంది కదా… కానీ…?
ఇక్కడ మళ్లీ ప్రశ్న… తల్లిదండ్రులు తన గురించే కదా ఆలోచించేది, మరి కనిపెంచిన వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వొద్దా ఆ అమ్మాయి..? కనిపెంచిన వాళ్ల ప్రేమకు ఆమె ఇచ్చిన గౌరవం ఏమన్నట్టు..? అయితే దీనికి పూర్తి భిన్నంగా మరో ప్రశ్న ఏమిటంటే… ఆమె ఇష్టపడింది, వరుసైనవాడే… పెళ్లి చేసుకుంటానంది… చేస్తే తప్పేముంది..? పెరిగాక కూడా పిల్లల్ని, వాళ్ల ఇష్టాల్ని గౌరవించకపోతే ఎలా…? ఇదీ ఇంకో ప్రశ్న… సో, ఒక్కొక్కరు దీన్ని అర్థం చేసుకునే తీరు వేర్వేరుగా ఉండవచ్చు… ఎటొచ్చీ, చివరకు సొసైటీ ఏమంటుంది తెలుసా..? పిల్లల్ని కంటాం గానీ, వాళ్ల అదృష్టాల్ని కంటామా..? ఏమో వాళ్ల ఖర్మ, వాళ్లిష్టం… మరేం చేస్తాం..? ఇలాగే అంటుంది సొసైటీ… కానీ తల్లీదండ్రి మనస్సులు ఊరుకోవు కదా… అదుగో, ఆ కోపమే ఆ తండ్రి ‘కర్మకాండ’లో కనిపించింది… నిజానికి అది కోపం కాదు, తన కడుపులో నుంచి తన్నుకొచ్చే దుఃఖమే అది… ఆందోళనే అది… అసహాయంగా అలా తన బాధను వ్యక్తీకరించాడు… అంతే…!!
Share this Article