‘‘…. అంటే ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే మనుషులా..? పనిచేసినా, చేయకపోయినా, లంచాలతో తెగబలిసినా, పనిచేయడమే తెలియకపోయినా సరే, వాళ్లను మిగతా ప్రజలందరూ అల్లుళ్లలాగా మేపాలా..? ఈ కరోనా సంక్షోభంలో ఎన్నివేల ప్రైవేటు కొలువులు పోయాయి..? ఎన్ని వేల కుటుంబాలు బజార్నపడ్డాయి… వ్యవసాయం దెబ్బతిని ఎన్ని ఆత్మహత్యలు జరగడం లేదు..? ఏం..? వాళ్లంతా మనుషులు కారా..? ఒక్కసారి ప్రభుత్వ కొలువు వస్తే ఇక చచ్చేదాకా మేపే బాధ్యత సమాజానిదేనా..? అసలు జగన్‌కు దమ్ముందా..? తన వైఖరి మీద నిలబడే సాహసముందా..? ఎందుకు 62 ఏళ్లకు పదవీవిరమణ వయోపరిమితిని పెంచాలి… ఎవరడిగారు..? అసలు లంచాలతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికే వాళ్లను సస్పెన్షన్ కాదు, నేరుగా డిస్మిస్ చేసే చట్టం ఎందుకు చేయలేడు..? ఉద్యోగుల పనితీరు మదింపుకు కొత్త పద్ధతులు ఎందుకు తీసుకురాలేడు..? పనిచేయనివాళ్లను, చేయలేనివాళ్లను ఇంటికి ఎందుకు పంపించడు..? ఏసీబీ సిబ్బందిని నాలుగైదురెట్లు పెంచేసి ఎందుకు లంచాల మీద విరుచుకుపడలేడు..? ఇప్పటికే వశపడని జీతాలున్నయ్, ఇంకా ఎందుకు పెంచాలి’’…..
ఇలా సోషల్ మీడియా విరుచుకుపడుతున్న తీరు విస్మయకరంగానే అనిపిస్తోంది… ప్రభుత్వ ఉద్యోగి అంటే సమాజంలో పెరిగిపోయిన ఆగ్రహం సోషల్ మీడియా స్పందనలో కనిపిస్తోంది… ప్రభుత్వ ఉద్యోగి అంటేనే సమాజం ఓ శత్రువులా చూస్తోంది… ఏదో జగన్ వ్యతిరేకత పెరిగే అంశం కాబట్టి యెల్లో మీడియా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉద్యోగులకు మద్దతుగా మంటను ఎగదోస్తోంది… దాంతో సోషల్ మీడియా మరింతగా రెచ్చిపోయి ప్రభుత్వ ఉద్యోగుల మీద వ్యతిరేకతను వ్యక్తీకరిస్తోంది… యెల్లో మీడియా సహకారం ప్రభుత్వ ఉద్యోగులకే నష్టదాయకం… దాని క్రెడిబులిటీ అది… నిజానికి జగన్ ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే, వాటికి మద్దతుగా జగన్ బ్యాచ్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చెలరేగిపోతుంది, వ్యతిరేకుల మీద వ్యక్తిగత దాడులూ చేస్తుంది… (అఫ్ కోర్స్, జడ్జిల మీద వ్యాఖ్యలు ఎదురుతన్ని, ప్రస్తుతం అలాంటి పోస్టులు చాలా తగ్గిపోయాయి…)
కానీ ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీద వైసీపీ నుంచి రాజకీయపరమైన వ్యతిరేక వ్యాఖ్యలు పెద్దగా రావడం లేదు… ఎందుకంటే… జగన్ ఎప్పుడు యూటర్న్ తీసుకుంటాడో ఎవరికీ తెలియదు కాబట్టి… న్యూట్రల్ సెక్షన్ నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల వ్యతిరేకత కనిపిస్తున్నది… ఇప్పడొస్తున్న జీతాల్లోనూ కత్తెర పడుతుంది అని ప్రభుత్వ ఉద్యోగులు మొత్తుకుంటున్నా సరే పెద్దగా సొసైటీ నుంచి సానుభూతి రావడం లేదు… పీఆర్సీ మా ప్రాథమిక హక్కు, సమ్మె మా ప్రజాస్వామిక హక్కు, జగన్ ఎందరు సలహాదారుల్ని పోషించడం లేదు అనే వ్యాఖ్యలు ఉద్యోగవర్గాల నుంచి వస్తున్నాయి… నిజమే, జగన్ సలహాదారుల సంఖ్య, అప్పనంగా జీతభత్యాలు, వందల కార్పొరేషన్లు ఓ అపసవ్య, భ్రష్ట పాలనకు సంకేతాలే… జగన్ సలహాదారులు అంటేనే ప్రపంచమంతా పక్కున నవ్వుతున్న యవ్వారం…
Ads
అయితే ప్రభుత్వ ఉద్యోగుల వాదనలకు పెద్దగా సోషల్ మీడియాలో సమర్థన రావడం లేదు… అంటే ఎవరికీ వాళ్ల కోరికల పట్ల సానుభూతి లేదు… ఐనాసరే జగన్ స్థిరంగా తన ధోరణి మీద నిలబడతాడనే భ్రమలు కూడా ఎవరికీ లేవు… గుడ్డెద్దు చేలోపడి ఎటు పరుగు తీస్తుందో ఎవరికీ తెలియదు… నిజానికి ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాల్ని కూల్చేస్తారు, ఓడిస్తారు అనేది తప్పుడు రాజకీయ అంచనా… ఉద్యోగులు చెబితే మిగతా జనం వినే సీన్ ఇప్పుడు లేదు… పైగా అది కౌంటర్ ప్రొడక్ట్ కూడా అయ్యే ప్రమాదం కూడా ఉంది… జగన్ తన రాజకీయ ధోరణుల మీద స్థిరంగా నిలబడే కేరక్టర్ కూడా ఏమీ కాదు… గత ఏడాది కాలంలో చాలా విషయాల్లో యూటర్న్ తీసుకున్న తీరు చూశాం… పైగా తనేమీ జయలలిత కాదు… ఒక్కసారి జయలలిత వర్సెస్ ప్రభుత్వ ఉద్యోగులు ఎపిసోడ్ ఈ సందర్భంగా అందరూ తెలుసుకోవాలి…
2003… తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు దిగారు… అప్పుడు జయలలిత ముఖ్యమంత్రి… ఆమె టెంపర్మెంట్ అందరికీ తెలిసిందే కదా… సమ్మె మొదలైన నాలుగోరోజే ఓ నిర్ణయం తీసుకుంది… టీఎన్ ఎస్మా (తమిళనాడు ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్) కింద సమ్మెకు దిగిన 1.70 లక్షల మందిని విధుల నుంచి పీకేసింది… దీనికోసం అప్పటికప్పుడు ఐదు ఆర్డినెన్సులు తీసుకొచ్చింది… వేలాది మంది అరెస్టు చేసింది… ఉద్యోగసంఘాలు చీలిపోయాయి… చాలామందిలో ఆందోళన… కొందరు గుండెపోట్లకు గురై మరణించారు… రాష్ట్రమంతా ఉద్రిక్తత… జయలలిత వీసమెత్తు లొంగుబాటు చూపలేదు… ఇంకా కఠిన చర్యలకు దిగుతామనే సంకేతాల్ని పంపించింది… నవ్వుతూ..!!
ఇది సుప్రీంకోర్టు దాకా వెళ్లింది… ధర్మాసనం ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసే నైతిక హక్కు లేదని, కాకపోతే మానవతాదృక్పథంతో ఉద్యోగుల్ని తిరిగి కొలువుల్లోకి తీసుకోవాలని సూచించింది… ప్రజలు ఇబ్బంది కలిగేలా ఆర్థిక, పారిశ్రామిక కార్యక్రమాల్ని స్తంభింపజేసే హక్కు పార్టీలకు లేదా సంస్థలకు లేదు అని ధర్మాసనం వ్యాఖ్యానించింది… దీంతో ఉద్యోగసంఘాలు జయలలిత ఎదుట సాగిలబడ్డాయి… మళ్లీ సమ్మెకు దిగబోమని లిఖితిపూర్వక ప్రమాణపత్రం తీసుకుని మరీ 1.56 లక్షల మందిని మళ్లీ కొలువుల్లోకి తీసుకుంది… (అయితే ఇతర సందర్భాల్లో పలు హైకోర్టులు ఉద్యోగుల సమ్మె హక్కును సమర్థించాయి…) ఇదంతా వేరు… కానీ ప్రభుత్వ ఉద్యోగి అంటేనే సొసైటీ ఓ శత్రువులా ఎందుకు చూస్తోంది..? డిబేటబుల్ ప్రశ్న… అవునూ, ఇదీ సరే… ఈ వ్యవహారంలో జగన్ ప్రభుత్వ యూటర్న్ ఎప్పుడు..? ఆల్ రెడీ చేతులు కాలినట్టేనా..? ఇప్పుడు ఆకులు పట్టుకుంటుందా..? లేక నిలబడుతుందా..?!
Share this Article