మీరు జాగ్రత్తగా గమనించండి… సెలబ్రిటీల సోషల్ మీడియా పోస్టులే కొన్ని వార్తల్ని పట్టిస్తాయి… ప్రత్యేకించి బ్రేకప్పుల్ని పట్టించేవి వాళ్ల సోషల్ మీడియా ఖాతాలే… ఇండస్ట్రీలో వినిపించే సమాచారాన్ని బట్టి న్యూస్ ప్లాట్‌ఫారమ్స్ రాస్తేనేమో వెంటనే ఖండఖండాలుగా ఖండిస్తుంటారు… కానీ వాళ్లే తమ ఖాతాల ద్వారా బయటపడిపోతుంటారు… సమంత, చైతూ విభేదాలు, విడిపోయి బతుకుతున్న తీరు ఎప్పుడు లోకానికి తెలిసింది..? ఎప్పుడో తెలుసు..? చాలామంది రాశారు… కానీ ఎప్పుడైతే సమంత తన పేరు పక్కన అక్కినేని అనే పదాన్ని కత్తిరించేసిందో అందరికీ స్పష్టత వచ్చింది…
ఈ జంటది బ్రేకప్పు బాటే అని తెలిసింది… అందరూ రాయడం మొదలుపెట్టారు… అనుకున్నట్టే జరిగింది… చివరకు అక్టోబరు రెండున ఆ జంట అధికారికంగానే తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు… ఒకే నోట్… చై పేరు దగ్గర సామ్, సామ్ పేరు దగ్గర చై… ఆ రెండే మార్పులు, యథాతథంగా ట్విట్టర్, ఇన్స్టాలలో పోస్ట్ చేశారు…
Ads
‘‘మేం వేర్వేరు బాటల్లో ప్రయాణించాలని నిర్ణయం తీసుకున్నాం… పదేళ్ల బలమైన బంధం, ఇకపై స్నేహాన్ని కొనసాగిస్తాం… ఈ క్లిష్ట సందర్భంలో మాకు మద్దతుగా నిలబడిన ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు, మీడియా ఇకపై కూడా మా ప్రైవసీని గౌరవించాలని కోరుతున్నాం’’ అని చెప్పుకున్నారు… సహజంగానే బ్రేకప్పు కారణాలపై రకరకాల కథనాలొచ్చాయి… బ్రేకప్పు తరువాత సమంత ఓ ఐటమ్ సాంగ్ ఇరగదీయడం, తన పోస్టుల్లో ఇంకాస్త మసాలా పెంచడం వంటివి కూడా వార్తలయ్యాయి… ఆమె మారిన మానసిక ధోరణి ఇదీ, అందుకే విడిపోయింది అనే విశ్లేషణలూ వెలువడ్డయ్…
సరే, జరిగిపోయింది… మళ్లీ కొత్తగా రజినీ బిడ్డ ఐశ్వర్య, ధనుష్… చిరంజీవి బిడ్డ శ్రీజ, హీరో కల్యాణ్‌దేవ్ వార్తలు వచ్చేశాయ్… పాఠకులకు కొత్త ఒక వింత, పాత ఒక రోత… అందుకే చైతూ, సమంత విడాకుల వార్తలు రోత అయిపోయాయి… అవన్నీ పాతబడిపోయాయి… అనగా పాచిపోయాయి… హఠాత్తుగా సమంత ఇన్‌స్టాలో తమ బ్రేకప్ నోట్‌ను డిలిట్ కొట్టేసింది… అదేమిటి..? ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన నోట్ కదా… పైగా ఎన్నోరోజులు కూడా కాలేదు… కానీ ఆ అక్టోబరు మొదటివారం పోస్టుల్ని తీసేసింది ఆమె… అంటే ఏమిటి అర్థం..? బ్రేకప్ కేన్సిల్ అనుకోవాలా ఆమె ఫ్యాన్స్..? నిజంగా అంత సీన్ ఉందా..? ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఇంకా ఏమైనా బకాయిలున్నాయా..? సమంత మళ్లీ చైతూ కావాలని కోరుకుంటోందా..? నమ్మశక్యంగా లేదులే… కానీ చైతూ అలవిమాలిన ప్రేమతో క్షమిస్తాడేమో గానీ నాగార్జున క్షమిస్తాడా..? అసలే అఖిల్ మ్యారేజీ రద్దుతో డిస్టర్బయి ఉన్న ఫ్యామిలీ సమంత బ్రేకప్‌తో బాగా పరువు పోయినట్టు ఫీలైంది… అదిసరే గానీ, ఈ బ్రేకప్ నోట్ డిలిట్ చేయడం వెనుక ఉద్దేశమేంటి సమంత పాపా..?! ఊ అనే అంటున్నావా..? ఊహూఁ కేన్సిల్ అంటున్నావా..?
Share this Article