మీకు ఓ పెద్ద స్టార్‌తో సినిమా తీయాలని పెద్ద కోరిక… ఏ బాహుబలి ప్రభాస్‌నో, ఏ పుష్ప బన్నీనో తీసుకుని… ఏ పూజా హెగ్డేనో, ఏ దీపిక పడుకోన్‌నో పెట్టేసి, ఇంకా చాలా చాలా పెద్ద పేరున్న నటుల్ని వేర్వేరు పాత్రలకు తీసుకుని ఆ సినిమా తీయాలని కల… కానీ డబ్బు లేదు, అంత బడ్జెట్ చేతకాదు.., పెద్ద పెద్ద దర్శకులు, హీరోలు, హీరోయిన్లకే బోలెడంత రెమ్యునరేషన్లు… వందల కోట్లు… లేదా ఏరియా వారీ హక్కులు… పోనీ, డబ్బు ఉందీ అనుకుందాం… వాళ్ల డేట్లు కావాలిగా… వాళ్లు వేరే ప్రాజెక్టుల్లో బిజీ… పోనీ, కథే నచ్చకపోవచ్చు, ఫోబే నీ సినిమాలో ఎవడు చేస్తాడు అని రెఫ్యూజ్ చేయవచ్చు… మరెలా..?
కాల్ షీట్లు అవసరం లేకుండానే… మీతో సినిమా తీస్తాం అని చెప్పేయండి… జస్ట్, కాగితాలపై సంతకాలు చేసి, ఎంతో కొంత డబ్బు తీసుకుంటే సరి… ఏదో మల్టీనేషనల్ కంపెనీ ప్రొడక్ట్‌కు యాడ్ చేసినట్టు… ఇక కథ, డాన్సులు, ఫైట్లు, సీన్లు, కామెడీ గట్రా మన చేతిలో పని… అదేమిటి..? నటులు లేకుండా సినిమా ఏంటి అని ఆశ్చర్యపోకండి… సింపుల్… గ్రాఫిక్స్‌తో లాగించేయడమే… షూటింగ్ దగ్గర ఇగోలు లేవు, కాల్ షీట్లు అడ్జస్ట్‌మెంట్ పాట్లు లేవు… ఎహె, అదెలా కుదురుతుంది అని మొహాన్ని క్వశ్చన్ మార్క్ చేసేయకండి…
నిన్నామొన్నా ఓ వార్త చదివా… పూజా హెగ్డే ఇచ్చిన డేట్స్ అయిపోతే రాధేశ్యాం సినిమాలో ఓ పాటను గ్రాఫిక్స్‌తో లాగించేసి, సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారట… అఫ్‌కోర్స్, ఎవరూ నిర్ధారణగా చెప్పడం లేదు గానీ, మంచి చర్చకు మాత్రం ఆస్కారమే… అలా ఒక్క పాట తీయడం కాదు, ఏకంగా మొత్తం సినిమాయే లాగించొచ్చు, ఐనా నమ్మడం లేదా..? చాలా ఈజీ అండీ బాబూ… అలా తీస్తే ఎవరు చూస్తారు అనే పిచ్చి ప్రశ్న కూడా వేయకండి… థియేటర్ నుంచి సినిమా స్మార్ట్ ఫోన్లలోకి రాలేదా..? ఎప్పుడైనా ఊహించామా..? ఓటీటీ రిలీజుల్ని అంచనా వేశామా..? రీళ్లు అనే కాన్సెప్టు పోయి, జస్ట్ డిజిటల్ ఫార్మాట్ మాత్రమే ఉంటుందని కలగన్నామా..?
Ads
అంతెందుకు… ఇవ్వాళారేపు ఎంతోకొంత గ్రాఫిక్స్ సపోర్ట్ లేని సినిమా ఏముందని..? ఇదే రాధేశ్యాంలో 20 నిమిషాల గ్రాఫిక్ సీన్లున్నాయట… మొన్నటి మరక్కర్, రావల్సిన ఆర్ఆర్ఆర్ సహా అసలు గ్రాఫిక్స్ లేని సినిమా లేదు… నో, నో, నటీనటుల మొహాల్లో ఎమోషన్స్‌ను గ్రాఫిక్స్ ద్వారా తీసుకురాలేం అని కూడా తేల్చేయకండి… అసలు 80 శాతం మంది హీరోలకు, హీరోయిన్లకు ఆంగికం, ఆహార్యం, సాత్వికం, వాచికం అంటే తెలియదు… వాళ్లకు తెలిసింది డాన్సులు, ఫైట్లే కదా… గ్రాఫిక్స్‌లో వాటిని ఇరగదీయొచ్చు…
అప్పట్లో… అంటే ఇరవై ఏళ్ల క్రితం కలిసుందాం రా అనే సినిమాలో వచ్చిందీ పాలపిట్ట అనే పాటలో అకస్మాత్తుగా ఎన్టీయార్ వచ్చి వెంకటేశ్, సిమ్రాన్‌తో స్టెప్పులేశాడు గుర్తుంది కదా… అంతేకాదు, అదే ఎన్టీయార్ రాజమౌళి తీసిన యమదొంగ సినిమాలో హఠాత్తుగా వచ్చి జూనియర్‌తో ముచ్చట్లు కూడా పెడతాడు, సాంగేస్తాడు, బోలెడు వేషాల్లో కనిపిస్తాడు… డైలాగ్ డెలివరీ, లిప్ సింక్ కూడా తేడా అనిపించదు… ఇక ఇన్నేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, ఆగుమెంటెడ్ రియాలిటీ సహా బోలెడంత కొత్త గ్రాఫిక్ టెక్నాలజీ వచ్చింది… ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు… అంతా కనికట్టు…!
అప్పట్లో రజినీకాంత్ బిడ్డ సౌందర్య పూర్తిగా కంప్యూటర్ యానిమేషన్‌తో తండ్రితోనే ఓ సినిమా ప్లాన్ చేసింది… ఇంకో అడ్వాంటేజ్ ఉంటుంది గ్రాఫిక్ సినిమా అయితే… ఆయా నటీనటుల మైనస్ పాయింట్లన్నీ కవర్ చేసేయొచ్చు… సో, అసాధ్యం అని కొట్టిపారేయకండి… ఏమో… చెప్పలేం… ఏ నిర్మాత దానయ్యో, ఏ అల్లు అరవిందుడో సరదాగా బన్నీ, మహేశ్, ప్రభాస్, జూనియర్లతో ఇలా ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేయొచ్చునేమో…!! అఫ్‌కోర్స్, నలుగురు హీరోయిన్లూ ఉంటారుగా…!! ష్… ఐటం సాంగ్స్ అయితే మరింత మజా రేపేలా కుమ్మేయొచ్చు…!!
Share this Article