22 జనవరి… అంటే మొన్న… మొన్నటికి అక్కినేని మరణించి ఎనిమిదేళ్లు… సాధారణంగా జయంతికో, వర్ధంతికో మీడియా ఒకింత నివాళి అర్పించి, సొసైటీ వారిని స్మరించుకునేలా చేస్తుంటుంది… కానీ అక్కినేనికి ఆ నివాళి దక్కినట్టుగా కనిపించలేదు… నిజానికి మరణించేనాటికి తెలుగు సినిమా వయస్సు 83 ఏళ్లు అయితే, అందులో 75 ఏళ్లు అక్కినేనితో సంబంధం ఉన్న కాలమే… అంటే ఒకరకంగా అక్కినేని చరిత్ర, తెలుగు సినిమా చరిత్ర… ఎంత పాపులారిటీ ఉన్నా సరే, కన్నడ రాజకుమార్‌లాగే రాజకీయాల్లోకి రాలేదు… ఎన్టీయార్‌కు అక్కినేని ఓ భిన్నధ్రువం…
ఏదైనా మీడియా తలుచుకుందా అని వెతుకుతుంటే… అప్పట్లో రాధాకృష్ణ తనతో చేసిన ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూ కనిపించింది… నిజంగానే అక్కినేని భేషజం, హిపోక్రసీ లేకుండా చాలా అంశాలు షేర్ చేసుకున్నట్టు అనిపించింది… అబద్ధాల్లేవు, ఆత్మవంచన లేదు… అయితే ఆ సంగతులన్నీ పక్కకుపెడితే ఒక అంశం ఇంట్రస్టింగ్… అక్కినేని సుదీర్ఘ సినీజీవనంలో బోలెడు అవార్డులు వచ్చినయ్… బహుశా లెక్కలేనన్ని… డాక్టరేట్లు, సినిమా అవార్డుల్ని వదిలేస్తే… పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్… దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు… వాట్ నాట్..? సినిమారంగంలో ఉన్నవాళ్లు అత్యున్నతంగా ఫీలయ్యే సినిమా పురష్కారాలు, పౌరపురస్కారాలన్నీ పొందినట్టే… ఇంకేం కావాలి..? సగర్వంగానే ఈలోకం నుంచి నిష్క్రమించాడు… పెద్దగా విషాదఛాయలు ఆవరించుకుండానే…!
Ads
కానీ తను ఆనందంగా చెప్పుకున్నది మాత్రం ఒక అవార్డు గురించి… అది కాళిదాసు కౌస్తుభ అవార్డు (కాళిదాస్ సమ్మాన్) గురించి…! ఎందుకని అడిగితే… ‘‘అవార్డులకు రకరకాల కొలమానాలు, ప్రామాణికాలు ఉంటయ్… ఈ కౌస్తుభ తీరు వేరు… వందరెండొందల మంది సంస్కృతి తెలిసిన నిపుణులు కలిసి ఎంపిక చేస్తారు… వాళ్లు నన్ను ఎంపిక చేయడంకన్నా ఆనందం ఏముంటుంది..?’’ అంటూనే… ‘‘ఆ సినిమాకు 17,500 ఇస్తామన్నారు, 12,500 మాత్రమే ఇచ్చారు… ఈ అవార్డు ప్రకటించేనాటికి దర్శకుడు, నిర్మాత, ముఖ్య పాత్రధారులు, గాత్రధారులు మరణించారు, నేనొక్కడినే బతికి ఉన్నా, అందుకే నాకు ఇచ్చారేమో..?’’ అని కూడా అనుమానపడ్డాడు… నిజంగానే నాలుగైదు రంగాల కళాకారులు ఈ అవార్డును అత్యంత విలువైందిగా పరిగణిస్తారు…
నిజానికి మహాకవి కాళిదాసు సినిమా తీసింది 1960లో… తరువాత 1966లో తమిళంలో శివాజీ గణేషన్ తీసిన కాళిదాసు కూడా తెలుగులోకి డబ్ చేసినట్టున్నారు… నెట్‌లో చూస్తేనేమో ఎయిటీస్ నుంచే ఈ పురస్కారం ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది… 1996 ప్రాంతంలో అవార్డు గ్రహీతల పేర్లు చూస్తేనేమో అక్కినేని పేరు కూడా కనిపించలేదు… కారణం తెలియదు… అక్కినేని అన్ని అవార్డులకన్నా ఎక్కువ గర్వంగా, సంతోషంగా ఫీలైన ఆ పురస్కారం గురించిన వివరాలే సరిగ్గా రికార్డ్ కాకపోవడం ఒకింత హర్టింగే..!!
Share this Article