Bharadwaja Rangavajhala……………… నాటి క్రిష్ణ మొన్న మాట్లాడుకున్నాం కదా … నాటి క్రిష్ణ, నేటి క్రిష్ణ అని … నేటి భారతం, ఈ దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు లాంటి ఈ తరం సినిమాలు తీసిన టి.క్రిష్ణను నేటి క్రిష్ణ అంటారు. ఆయన హీరో గోపీచంద్ తండ్రి. ప్రకాశం జిల్లాకు చెందిన, కమ్మ సామాజిక వర్గానికి చెందిన, కమ్యూనిస్టు బ్యాక్ గ్రౌండ్ ఉన్న నట దర్శకుడు. ఇప్పుడు నేను మాట్లాడబోతోంది నాటి క్రిష్ణ గురించి …. వీరు బ్రాహ్మలు అని అనుకుంటా, అంత క్లియర్ గా తెలియదు గానీ … శాఖల జోలికి పోను గానీ … ఇన్ కేబుల్ కాకపోతే అసలు నేనెందుకు రాస్తాను చెప్పండి …
ఈ టి.క్రిష్ణ వరంగల్ జిల్లా … రాయపర్తిలో 1927 లో పుట్టారు. వారి తండ్రిగారు పండితులు … కుమారుడ్ని ఏదో చేద్దామనుకున్నారుగానీ … ఎదుగుతున్న కొద్దీ క్రిష్ణగారి ద్రుష్టి సినిమాలపై పడింది. క్రిష్ణ తండ్రిగారు మంచి పండితులు. ఉభయ భాషలలోనూ ప్రావీణ్యం కలవారు. భగవద్గీతకు వ్యాఖ్యానం చెప్పడంలో ఆయనకు మంచి పేరు ఉండేదట ఆ రోజుల్లో. తనలాగా కొడుకు కూడా ఉభయ భాషా ప్రవీణుడు కావాలని అనుకున్నారాయన. అయితే విధి మరో పద్దతిలో నడిచింది.
క్రిష్ణ నాటకాలకు చేరువ అయ్యారు. ఆయన అలా కావడానికి ఆయన మేనమామ గారు కారణం. ఆయనెవరో కాదు మాజీ మంత్రి, నక్సలైట్ల చేతుల్లో 91లో హతమైన టి.హయగ్రీవాచారి. హయగ్రీవాచారిని చంపడం మీద బోల్డు చర్చ ఉంది… ఆయన్ని హత్యచేయడం ద్వారా బ్యాన్ కొని తెచ్చుకుంది పీపుల్స్ వార్ అనే వాళ్లున్నారు. హయగ్రీవాచారి నాటి ప్రధాని పీవీ నరసింహారావుకు సన్నిహితుడు. ఉమ్మడి రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రిగా చేశారాయన. అప్పట్లో మా అత్తయ్య వాళ్లాయన ఈయన దగ్గర పిఎగా పన్జేయడం తెల్సు.
Ads
క్రిష్ణగారికి చదువు బానే అబ్బింది పాపం. ఉస్మానియా యూనివర్సిటీలో చేరి 1948లో బిఎ పూర్తి చేశారు అంతకంటే పాపం. ఇంకా చదువుతానంటే చదివించడానికి వారి తండ్రిగారు సై అన్నప్పటికిన్నీ … క్రిష్ణకు ఇంట్రస్టు లేదు. సినిమాల్లో నటించడానికి ఈ మాత్రం చాల్లే అనుకున్నారు. అనుకున్న తర్వాత సినిమాల్లో చేరడానికి ప్రయత్నాలు చేస్తూనే … సినిమా వాళ్ల కళ్లల్లో పడడానికి … గోల్కొండ పత్రికలో సినిమా సమీక్షలు రాయడం మొదలుపెట్టారు. దీంతో పాటు కాస్త డబ్బొచ్చే పని కూడా ఒకటి చేయాలని తలంచిన వాడై … హైద్రాబాద్ ఆలిండియా రేడియోలో తెలంగాణ యాసలో లింగడు అనే పాత్ర ద్వారా … గ్రామీణ వార్తలను చెప్పడం లాంటి పనులు చేసేవారు.
ఇక ఇవన్నీ చాలనుకుని 1950 లో ఎకాఎకిని మద్రాసులో కాలుపెట్టేశారు. భరణీ రామక్రిష్ణ గారిని కల్సారు. ఆయన సలహా మేరకు హెచ్ ఎమ్ రెడ్డి గారిని కల్సారు. నేను నటుడు అవుదామని వచ్చాను సారూ అని వెళ్లబోసుకున్న క్రిష్ణ గోడు అంతా విని రెడ్డి గారు ముందుగా పని నేర్చుకో అని దర్శకత్వ శాఖలో అవకాశం కల్పించారు. అయితే క్రిష్ణకు నటుడు కావాలని కోరిక ఉండేది అని చెప్పాను కదా . సర్లే, ముందు ఎంట్రీ దొరికితే అప్పుడు చూసుకుందాం అనుకుని అందులో చేరిపోయారు పాపం.
సరిగ్గా అలా అనుకుంటుండగా క్రిష్ణ పరిచయస్తులు ఆదర్శం పేరుతో ఓ సినిమా తీశారు. క్రిష్ణ అందులో ఓ కామెడీ రోల్ చేసేశారు కామెడీగా … మహానటి సావిత్రి అతనికి జోడీగా నటించింది విచిత్రంగా. హెచ్.వి బాబు డైరెక్టరు. క్రిష్ణ ఆయన దగ్గర అసోసియేట్ గా పన్జేశారు. ఎమ్.వి రాజన్ ఆ ఆదర్శానికి ఎడిటరు. సదరు ఎడిటర్ రాజన్ గారూ క్రిష్ణ గారితో ఏం చెప్పేవారంటే సినిమాకు ఎడిటింగ్ అనేది కాలా కీలకం … కనుక నువ్వు నేర్చుకుంటాను అంటే ఎడిటింగ్ నేర్పిస్తా అనేశారు.
అలా ఎడిటింగ్ రంగంలోకి దూకి … రాజన్ దగ్గర పన్జేయడం మొదలెట్టారు క్రిష్ణ. మోడరన్ థియేటర్స్ వారి ఆలీబాబా నలభై దొంగలు, రాజ్ కపూర్ ప్రేమలేఖలు లాంటి డబ్బింగ్ సినిమాలకు రాజన్ దగ్గర అసిస్టెంట్ గా ఎడిటింగ్ విభాగంలో పన్జేశారు. పనిలో పనిగా … ప్రేమలేఖలు సినిమాలో ప్రాణ్ కు డబ్బింగ్ కూడా చెప్పారాయన. ఇట్టా పని నడుస్తూండగా … కె.ఎస్ ప్రకాశరావుగారు కన్నతల్లి సినిమా తీస్తున్నప్పుడు అక్కడే ఆ సెట్స్ మీదే ఆదుర్తి సుబ్బారావుగారితో క్రిష్ణకు పరిచయం అయ్యింది.
ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి … కె.ఎస్ ప్రకాశరావు గారికో జబ్బుండేది … ఎవరైనా తనతో సినిమాలు తీయడానికి వస్తే … కమిట్ అవకుండా … నేనిప్పుడు ఓ సినిమా చేస్తున్నాను … మన మిత్రుడు ఒకతనున్నాడు … మంచి టేస్ట్ ఉన్నవాడు … అతన్ని పెడతాను .. మీకు చక్కని సినిమా తీసి ఇస్తాడు .. అని చెప్పి ఇంకొక్కరికి ఆ ప్రాజెక్ట్ అప్పగించేసేవారు. అలా ఆదుర్తికి అమరసందేశం అప్పగించింది ప్రకాశరావు గారే … ఆదుర్తి అమర సందేశం సినిమా చేసేప్పుడు ఎడిటింగూ డైరెక్షనూ వచ్చిన వాడ్ని తనకు సహాయకుడుగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ రెండు రంగాల్లోనూ అనుభవం ఉన్న టి.క్రిష్ణను ఆయన సెలక్ట్ చేసుకున్నారు. అలా అమరసందేశానికి అసిస్టెంట్ డైరెక్టరు గానూ అసిస్టెంట్ ఎడిటరు గానూ కూడా పన్జేశారు క్రిష్ణ. అలాగే తోడికోడళ్లు సినిమాకి కూడా. అప్పట్నించీ దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఆదుర్తితోనే కాపురం చేశారు. ఆదుర్తి క్రిష్ణ ప్రేమ తీసినప్పుడు ఈ క్రిష్ణకు ఎడిటర్ గా ప్రమోషన్ ఇచ్చారు. అప్పట్నించీ సుమారు ముప్పై సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు.
ఆదుర్తి తీసే హిందీ సినిమాలకూ టి.క్రిష్ణ అన్ని విభాగాలూ చూసుకునేవారు. ఎందుకంటే … ఆయనకు ఉర్దూ మీద పట్టుంది కాబట్టి ఆయన్ని కీలకం అనుకున్నారు ఆదుర్తి. అలా క్రిష్ణ బొంబాయిలో ఉండగా ఎక్ ముట్టీ ఆస్మాన్ అనే ఉర్దూ నవల చదివారు. ఆ కథ సినిమాగా బాగుంటుందనుకుని … రచయిత వీరేంద్రసిన్హాను సంప్రదించారు. అప్పటికే ఆ కథను ప్రేమ్ జీకి ఇచ్చేసినట్టు చెప్పారు సిన్హాగారు. ప్రేమ్ జీ దగ్గరకు పోతే దుష్మన్ అనే టైటిల్ తో సినిమా ప్రారంభించబోతున్నాను అనడంతో … తెలుగు రైట్స్ కావాలన్నారు. అలాగే అన్నారు ప్రేమ్ జీ.
వరంగల్ మిత్రులు మార్కండేయ, ఆంజనేయులు, హైద్రాబాద్ మిత్రులు బాబుల్ నాథ్, లక్షణరావు తదితరులను రంగంలోకి దింపి … బాలాజీ ఫిలిమ్స్ అనే సంస్ధను పెట్టించి ఖైదీబాబాయ్ గా దుష్మన్ ను తెలుగులో తీసి విజయం సాధించారు. టి.క్రిష్ణ తొలి చిత్రం అపాయంలో ఉపాయం. ఈ సినిమాకు మాత్రుక తమిళంలో ఎస్.బాలచందర్ తీసిన బొమ్మై. ఈ బొమ్మై మూవీ టైటిల్స్ విచిత్రంగా ఉంటాయి. ఎవరికి వారు తమను తాము పరిచయం చేసుకుని … అయ్యా నా పేరు ఫలానా .. నేను ఈ సినిమాకు ఈ పని చేశాను అని చెప్పుకుంటారన్నమాట …
అపాయంలో ఉపాయం ఓ మోస్తరుగా ఆడిందిగానీ … ఖైదీబాబాయ్ మాత్రం అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత ఆయన మంచి బాబాయ్ అన్నారు గానీ … జనం ఖైదీ బాబాయ్ లా మంచి బాబాయ్ ను ఆశీర్వదించలేదు. శోభన్ బాబుతోనే మొనగాడు సినిమా తీశారు… త్రివిక్రమరావు నిర్మాత అనుకుంటా ఆ సినిమాకి … ఇలా ఏవేవో క్రైమ్ కథలతో సినిమాలు తీశారు పాపం … చివర్లో సూపర్ స్టార్ క్రిష్ణ తోనూ ఓ సినిమా ఏదో తీశారు… ఎందుకో కాస్త క్రైమ్ అండ్ ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలే చేయడానికి ఉత్సాహం చూపించేవారు క్రిష్ణ గారు. ఇలా ఆయన తెలంగాణ డైరెక్టరు. రజాకార్ల దెబ్బతిన్న కుటుంబం ఆయనది …
Share this Article