‘‘నా పేరు కృతి మహేశ్ మిద్య… ఈ మిద్య అనే పేరు ఈమధ్య ఎనిమిదేళ్ల క్రితం మొగుడిగా మారిన బాయ్‌ఫ్రెండ్ ఇంటి నుంచి వచ్చి చేరింది లెండి… తండ్రి పేరు మహేశ్… నా ఒంటి పేరు కృతి… నాన్న ఇష్టంగా పెట్టుకున్న పేరు ఇది… ముంబైలో ఓ తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను… మధ్యతరగతి… ఇద్దరం అక్కాచెల్లెళ్లం… శ్యామ్ సింగరాయ్ సినిమావాళ్లు నాకు క్రెడిట్స్ ఇవ్వలేదనే ఓ వార్త చదివాను… నిర్వేదంగా ఓ నవ్వు పుట్టుకొచ్చింది… నువ్వు ఆడితే నెమలి ఆడినట్టే ఉంటుందనే ప్రశంసల్ని, ఓ హిందీ పాటకు గెలిచిన జాతీయ అవార్డును ఎలా స్వీకరించానో… ఇలాంటి అవమానాల్ని, ఫీల్డులో ఎదురైన పరాభవాల్ని అలాగే స్వీకరిస్తా… అవునూ, ఇంతకీ నేనెవరినో చెప్పనేలేదు కదూ… చదవండి…
ఏడేళ్ల నుంచే అమ్మ శాస్త్రీయ నృత్యంలో శిక్షణకు వసంత టీచర్ దగ్గరకు పంపేది… రోజూ ఏడ్చేదాన్ని… నట్టువాంగం గతి తప్పితే విరుచుకుపడే ఆ టీచర్‌ను చూస్తే భయమేసేది… మొదట్లో అన్నీ కృష్ణుడి సంబంధ నాట్యాలే… లేదంటే దశావతారాల్లో మత్స్యావతారంగా…! ఇతర స్కూళ్లకు వెళ్లి ప్రదర్శనలు కూడా ఇచ్చేదాన్ని… అందరూ పార్టిసిపేటెడ్ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్లు తప్ప ప్రైజులు మాత్రం వచ్చేవి కావు… తరువాత ఓ ప్రదర్శన చూసి, మరో మాస్టర్ తన దగ్గర శిక్షణకు రమ్మన్నాడు… వెళ్లాను… నాట్యశిక్షణను ఓ శిక్షలాగా గాకుండా దాన్ని ఎంజాయ్ చేయాలనేది ఆయన చెప్పిన మొదటి పాఠం… తరువాత కృష్ణుడిని వదిలేసి, శివుడిని పట్టేసుకున్నాను… తాండవం ప్రాక్టీస్ చేశాను… చిత్రంగా ఈ ప్రదర్శనలన్నింటిలోనూ నాకు ప్రైజులు వచ్చేవి…
Ads
అరె, ఇదంతా ప్యాషన్… కానీ నా కెరీర్ ఏంటి..? ఇంజినీరా, సైంటిస్టా, డాక్టరా… ఏంటి..? బీఎస్సీ సైన్స్‌లో చేరాను, డాన్స్ కంటిన్యూ చేసేదాన్ని… కానీ కొన్నాళ్లకు నేను ఫోరెన్సిక్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం లండన్ వెళ్లాను… ఇంకేముంది..? మూడేళ్లు డాన్స్ లేదు, ప్రాక్టీస్ లేదు… గజ్జె కట్టలేదు, పాదం కదపలేదు… ఫోరెన్సిక్ సైన్స్ అంటే తెలుసు కదా… నేరగాళ్లను పట్టిచ్చే ఆధునిక శాస్త్రం… ఈలోపు డాడీ ఆరోగ్యం దెబ్బతిన్నది… ఇండియా వచ్చేశాను… అప్పుడే జీటీవీలో డాన్స్ ఇండియా డాన్స్ సీజన్ స్టార్టయింది… వెళ్లి ఆడిషన్ ఇవ్వొచ్చు కదా అన్నాడు డాడీ… డాన్స్ మరిచిపోయినట్టుగా ఉంది, వద్దులే నాన్నా అన్నాను… కొన్నాళ్లకు ఆయన వెళ్లిపోయాడు…
నాన్న కోరిక మేరకు, ఆ విషాదం నుంచి డైవర్ట్ కావడానికి డాన్స్ ఇండియా డాన్స్ సెకండ్ సీజన్ ఆడిషన్ వెళ్లాను… సెలెక్ట్ చేశారు… అక్కడా శివతాండవమే… కానీ మళ్లీ కృష్ణ సంబంధ డాన్స్ ఒకటి చేశాను… సెట్‌లో ఉన్నవాళ్లంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు… కృష్ణుడికి నేనంటే అలా ప్రేమ… బెస్ట్ సొలో పర్‌ఫార్మర్ అవార్డు దక్కింది… కానీ ఒకవైపు బయలాజిస్టుగా పనిచేస్తూ, ఈ డాన్స్ కొనసాగింపు కష్టమయ్యేలా ఉంది… టీవీ షో చూశాక సినిమా పరిచయాలు పెరిగాయి.. రెమో డిసౌజా దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేరాను… బాజీరావు మస్తానీలోని పాపులర్ పాట దీవానీ మస్తానీ పాటను లీడ్ చేసింది నేనే… ఏబీసీడీ-2 సినిమా కోసం నేను కొరియోగ్రాఫర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్… అలా అలా బాలీవుడ్‌లో ఇమిడిపోయాను…
తరువాత పద్మావత్ సినిమా… అందులో ఘూమర్ మంచి పేరు తెచ్చిపెట్టింది… జాతీయ అవార్డు కూడా సంపాదించి పెట్టింది… జీవితం కొరియోగ్రాఫర్‌గా కంటిన్యూ కావాలంటోంది… నేను చదివిన చదువు, ఫోరెన్సిక్ నైపుణ్యం అటకెక్కినయ్… ప్యాషనే మెయిన్ ప్రొఫెషన్ అయిపోయింది… జీవితం బాగానే ఉంది… సవాళ్లు ఉంటయ్, అన్నిరంగాల్లో ఉన్నట్టే ఇక్కడ కూడా… తోసేసుకుంటూ వెళ్లిపోవడమే… శ్యామ్ సింగరాయ్‌లో ప్రణవాలయ పాహి పాట అంటారా..? యశ్ మాస్టర్ కోఆపరేట్ చేశాడు… సాయిపల్లవి బాగా చేసింది… పాట బాగా వచ్చింది… క్రెడిట్స్ అంటారా..? జానేదేవ్… చల్తా…!!
Share this Article