Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అజిత్ ఖాన్..! గోల్కొండ వజ్రానికీ ఈ అజిత్‌ఖాన్‌కూ ఆల్టర్నేట్స్ లేవు..!!

January 27, 2022 by M S R

హనుమకొండలో చదువుకు ఫుల్‌స్టాప్‌ పెట్టి, కాలేజీ పుస్తకాలన్నీ అమ్మేస్తే 113 రూపాయలు వచ్చాయి హమీద్‌ అలీ ఖాన్‌కి. వాటితో బొంబాయికి పరారు కావాలి. హనుమకొండే హమీద్‌ అలీని ‘చెడ గొట్టింది’… ఫుట్‌బాల్‌లో మేటి… అందగాడు… పి.వి.నరసింహారావుకు జూనియర్‌… ‘నీకేంరా. హీరో లెక్క ఉన్నవ్‌. సినిమాల్లోకి పో’ అనంటే ఆ నషా తలకెక్కింది. తండ్రి గోల్కొండలో నిజామ్‌ ఆర్మీ సైనికుడు. ఐదు పూట్లా నమాజీ. సినిమా అంటే హరామ్‌ అనుకునే ధార్మికుడు. ఆయనను అడిగితే పంపడం కుదర్దు. చదువు మానేసి పారిపోక తప్పలేదు. బొంబాయిలో మహమ్మద్‌ అలీ రోడ్‌లో పెద్ద పెద్ద పైపుల్లో జనం ఉండేవారు. ఒక పైప్‌లో హమీద్‌ అలీ. ప్రతి వారం గూండాలు వచ్చి హఫ్తా వసూల్‌ చేసేవారు. ఒక హఫ్తా హమీద్‌ అలీని అడ్డుకుంటే వారికి ముక్కాలాత్‌ ఇచ్చాడు. గూండాలు ఆ వైపుకు మళ్లీ రాలేదు. దాంతో హమీద్‌ అలీ అక్కడ చిన్న సైజు హీరో. చాయ్‌ పానీ ఫ్రీ. జనమే ఇచ్చేవారు.

 

జూనియర్‌ ఆర్టిస్టుగా రోజుకు 3 రూపాయలు, డైలాగ్‌ చెప్తే 6 రూపాయలు ఇచ్చేవారు సినిమాల్లో. అందుకు కాదు హమీద్‌ అలీ వచ్చింది. గోల్కొండ షాన్‌ ఉంది రక్తంలో. హీరో కావాలి. అలాగే అయ్యాడు. రాజ్‌ కపూర్, దేవ్‌ ఆనంద్, దిలీప్‌ కుమార్‌ ఉన్న రోజుల్లో ఈ కోర మీసం, చురుకు కన్నులు, గట్టి ఒళ్లు ఉన్న చిన్నవాడు… ఉర్దూ, హిందీ, తెలుగు తెలిసిన కుర్రవాడు. నళిని జయవంత్, మధుబాల, సురయ్యా… నాటి టాప్‌ హీరోయిన్స్‌ హమీద్‌ అలీ పక్కన వేశారు. ‘ఆజాకె ఇంతెజార్‌ మే… జానే కో హై బాహార్‌ కి’… రఫీ డ్యూయెట్స్‌ పాడాడు. ‘నాస్తిక్‌’, ‘బడాభాయ్‌’… పర్లేదు అనిపించాయి. కవి ప్రదీప్‌ రాసిన ప్రఖ్యాత గీతం ‘దేఖ్‌ తేరే సన్సార్‌ కి హాలత్‌ క్యా హోగయి భగవాన్‌ కిత్‌నా బదల్‌ గయా ఇన్‌సాన్‌’… హమీద్‌ అలీ మీదనే చిత్రీకరించారు.

Ads

 

స్టార్‌డమ్‌ రాలేదు. పేరు మారిస్తే వస్తుందేమో అనుకుంటే, మహేశ్‌ భట్‌ తండ్రి నానాభాయ్‌ భట్‌ ‘అజిత్‌ అని పెట్టుకో. దాని అర్థం ఎవరూ నిన్ను గెలవ (జీత్‌) లేరు అని’ అన్నాడు. హమీద్‌ అలీ ఖాన్‌ ఇప్పుడు అజిత్‌ అయ్యాడు. క్యారెక్టర్స్‌కు మారాడు. దిలీప్‌ కుమార్‌ పక్కన సై అంటే సై అంటూ డైలాగ్‌ చెప్పాలి. ‘నయాదౌర్‌’. చెప్పాడు. ‘మొఘల్‌ ఏ ఆజమ్‌’లో దుర్జన్‌ సింగ్‌. కణకణమంటే నెత్తురు ఉన్న రాజ్‌పుట్‌. మెరిశాడు. కానీ ఇంకేదో జరగాలి. జూబ్లీ హీరో రాజేంద్ర కుమార్‌ ఫ్రెండ్‌. ‘అజిత్‌ సాబ్‌. కలర్‌ జమానా వచ్చేసింది. విలన్‌గా మారండి’ అని సలహా ఇచ్చి తాను యాక్ట్‌ చేస్తున్న ‘సూరజ్‌’ సినిమాలో విలన్‌గా మార్చాడు. ‘సూరజ్‌’ మరో జూబ్లీ హిట్‌ అయ్యింది. రాజేంద్ర కుమార్‌కు ఏం పేరొచ్చిందో ఏమో. బాలీవుడ్‌ వెండి తెర మీద ఒక హైదరాబాదీ గొప్ప విలన్‌గా అవతరించాడు.

ajith khan

1973. ‘ధరమ్‌ దయాళ్‌ తేజా’ రోల్‌ రాశారు సలీమ్‌ జావేద్‌. ‘విలన్లు గలీజు బట్టల్లో పెద్ద పెద్దగా అరవడం ఇక చాలు. నేను వైట్‌ అండ్‌ వైట్‌లో ప్రేమగా మాట్లాడుతూ తడిగుడ్డతో గొంతు కోసేలా నటిస్తాను’ అన్నాడు అజిత్‌. ‘జంజీర్‌’. భారతదేశ సినిమాలకు కొత్త విలనీ ఇచ్చింది. మన రావు గోపాలరావుతో సహా అందరూ ఆ ధోరణిలోనే ఆ తర్వాతి కాలంలో విలనీ చేశారు. జంజీర్‌లో అజిత్‌ మణికట్టుపై వేళ్లాడే గుర్రం బొమ్మ అందరికీ గుర్తు. ‘యాదోంకి బారాత్‌’, ‘కాళీచరణ్‌’…. ‘ఇస్‌ సారా షహర్‌ ముఝే లయన్‌ కే నామ్‌ సే జాన్‌ తాహై’ డైలాగ్స్‌ ఫార్ములాను రచించాయి. మోనా డార్లింగ్, రాబర్ట్‌… అజిత్‌కు కుడి ఎడమలు. ఈ ముగ్గురి క్యారెక్టర్ల తోటి కార్టూన్లు, జోకులు, మీమ్స్‌ నేటికీ వస్తుంటాయి.

అమెరికాలో గుండె ఆపరేషన్‌ చేయించుకున్నాక అజిత్‌ హైదరాబాద్‌ వచ్చేసి, హాయిగా సాయంత్రాలు ఇక్కడి ఇరానీ కేఫుల్లో టీ తాగుతూ కాలక్షేపం చేశాడు. ‘గోల్కొండ వజ్రానికీ నాకూ ప్రత్యామ్నాయం లేదు’ అని అజిత్‌ తరచూ చెప్పే మాట. ముగ్గురు కొడుకులను కని భార్య మరణించగా తన కంటే పదిహేనేళ్లు చిన్న సారా అలీ ఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మరో ఇద్దరు కొడుకులు. సినిమాల్లో స్థిరపడి డబ్బు సంపాదించి ఎన్నో కానుకలు తండ్రికి పంపితే వాటిని ఆయన కనీసం ముట్టుకోకుండా బీరువాలో పడేశాడు. ఆ డబ్బు ‘హరామ్‌’ అని… తాను పడింది చాలు తన పిల్లలు ఆ ఫీల్డ్‌లో వద్దు అనుకున్నాడు అజిత్‌… ఒక కొడుకు నటించి ఆగిపోయాడు. అజిత్‌ 1998లో తన సొంత మట్టి గోల్కొండలోనే తుది శ్వాస విడిచాడు.

హైదరాబాద్‌ నుంచి ముంబై వెళ్లి మెరిసిన తొలి కాలపు నటులు ముగ్గురు. పైడి జయరాజ్, అజిత్, చంద్రశేఖర్‌. పైడి జయరాజ్‌ ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ గ్రహీత. అజిత్‌ ‘ప్రేక్షక సాహెబ్‌ ఫాల్కే’ గ్రహీత. తెలంగాణ ప్రభుత్వం పైడి జయరాజ్‌ జయంతిని, ఆయన పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జయరాజ్‌ పేరును రవీంద్రభారతిలో ఒక మందిరానికి పెట్టింది.

హమీద్‌ అలీ ఖాన్‌ అలియాస్‌ అజిత్‌ పేరును కూడా ఏదో ఒక మందిరానికో రోడ్డుకో పెట్టేదే ఏమో కాని ఈ కరోనా హడావిడిలో మర్చిపోయినట్టుంది. సాంస్కృతిక శాఖ కూడా ఇతర పనుల హడావిడిలో ఉండి ఉండొచ్చు. గోల్కొండ ఒడిలో పుట్టిన నటుడు లక్‌డీ కా పూల్‌ దాకా రావాలంటే టైమ్‌ పట్టడం సహజం. శత జయంతి కార్యక్రమం అంటే వనరులు కూడా సమకూరాలి. అజిత్‌ సాబ్‌. అఫ్‌సోస్‌ నక్కో కరో. ఏక్‌ ఖుష్‌ ఖబరీ హై. సారా షహర్‌ ఆప్‌ కో అభీభీ లయన్‌ కే నామ్‌ సే హీ జాన్‌ తా హై. సలామ్‌… (మిత్రుడు Mohammed Khadeerbabu ఫేస్ బుక్ వాల్ నుంచి సేకరణ……… నిన్న అజిత్‌ ఖాన్‌ శత జయంతి…) 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions