నిత్యామేనన్… మనకున్న కొందరు మంచి నటుల్లో ఒకరు… బెంగుళూరులోని ఓ మలయాళీ కుటుంబంలో పుట్టిన ఆమెది ఓ డిఫరెంట్ పర్సనాలిటీ… ఆమె మెంటాలిటీ, థింకింగ్ రేంజ్, ఆలోచనల డెప్త్ సగటు నటీమణుల్లో అస్సలు ఫిట్ కాదు… చిన్నప్పుడు బాలనటి… డిగ్రీ అయ్యాక జర్నలిస్టు… తరువాత శిక్షణ పొందిన నటి… సినిమాలు… తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాలు… ఎడాపెడా సినిమాలు ఒప్పేసుకునే బాపతు కూడా కాదు…
ఆమె మంచి గాయని… ఓ సినిమాకు డాన్స్ కంపోజ్ కూడా చేసింది… కెమెరా మీద పట్టుంది… వెబ్ సీరీస్ చేస్తుంది, షార్ట్ ఫిలిమ్స్ చేస్తుంది… డబ్బింగ్ చెబుతుంది… ఇప్పుడు నిర్మాత… ఏమో, భవిష్యత్తులో డైరెక్టర్ కూడా అవుతుందేమో… పెద్ద, చిన్న హీరోలనే తేడా ఏమీ లేదు, తనకు నచ్చితే చాలు, చేసేస్తుంది, లేదంటే వదిలేస్తుంది… తను నటించే ప్రతి సినిమాలోనూ తనదే డబ్బింగ్, ఆయా భాషల్లో ఫ్లుయెన్సీ కోసం వాటిని నేర్చుకుంటుంది… ఏదో నాని నిర్మించిన సినిమాలో లెస్బియన్ పాత్ర కూడా వేసినట్టుంది… సంపూర్ణంగా ఆమె ఓ డిఫరెంట్ కేరక్టర్… ఆమధ్య రెండేళ్లపాటు అందరికీ దూరంగా ఆత్మచింతనలో పడిపోయింది… బరువు పెరిగింది… కొత్త సినిమాలేవీ రాలేదు…
Ads
చాన్నాళ్ల క్రితం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ ఇంటర్వ్యూ కొత్తగా సాగింది… ఆమెలోని మరో కోణాన్ని టచ్ చేసింది… ఆ తరువాత పెద్దగా ఆమె ఆలోచనల గాఢతను పట్టివ్వగల మరో ఇంటర్వ్యూ ఏదీ కనిపించలేదు… పైగా అసలు ఆమె ఇంటర్వ్యూలే పెద్దగా ఇవ్వదు… రొటీన్ ప్రశ్నలు, ఫార్ములా సినిమా ఇంటర్వ్యూలు అంటే చిరాకుపడుతుంది… గత నెలలో టీవీ9 కోసం ప్రేమ ఇంటర్వ్యూ చేసింది… పర్లేదు, కానీ నిత్యలోని మరో పార్శ్యాన్ని అంతగా పట్టుకోలేకపోయినట్టు అనిపించింది… కొన్నిసార్లు గెస్టుకన్నా హోస్టే ఎక్కువ మాట్లాడినట్టు కూడా అనిపించింది…
బరువు పెరిగిపోవడం, ప్రభాస్ ఎవరో తెలియదన్న వివాదం, ఇండస్ట్రీలో లింగవివక్ష నిత్యలో లోపించిన లౌక్యం, ఎట్సెట్రా అంశాలే ప్రధానంగా వినిపించినయ్… తనలో మనకు అంతగా తెలియని ఓ స్పిరిట్యుయల్ యాంగిల్ కూడా ఉంది… సరే, దాన్నలా వదిలేస్తే, ఇంటర్వ్యూలో ఓ అంశం కొత్తగా అనిపించింది… ఆచితూచి కేరక్టర్లను ఎంపిక చేసుకుంటుంది, పెద్దగా వెకిలి పాత్రల జోలికి పోదు అనే పేరుంది కదా… అసలు మన సినిమాల్లో హీరోయిన్లకు వేరే పనేమీ ఉండదు కదా, హీరోల పక్కన పిచ్చి పాటలకు ఎక్స్‌పోజింగ్, మసాలా గంతులేయడమే హీరోయినిజం కదా… మరి జనతా గ్యారేజీ, సన్నాఫ్ సత్యమూర్తి వంటి సినిమాల్లో డాన్సులు చేసింది… ఆ పాటల్లోని ఆ గెంతులు నచ్చి, ఇష్టపడే చేశారా అనడిగింది ప్రేమ… ‘‘లేదు, బాగా ఇబ్బందిపడ్డాను, ఆ తరువాత అలాంటివి తప్పించుకోవడానికి నాకు డాన్స్ రాదు అని అందరికీ చెప్పుకున్నాను, ఇప్పటికీ చాలామంది నాకు డాన్స్ రాదనే అనుకుంటారు’’ అని కాస్త నిజాయితీగానే చెప్పింది నిత్య… (సమంత ఊ అంటావా, ఉ ఊ అంటావా ఊపుళ్లు గుర్తొచ్చాయి)…
‘‘నేను నాట్యం నేర్చుకున్నాను… చిన్నప్పటి నుంచే భరతనాట్యం తెలుసు… మొన్నటి లాక్‌డౌన్‌లో కథక్ నేర్చుకున్నాను… భారతీయ నాట్యాలే కాదు, సాల్సా కూడా ఓ కళారూపం… కానీ సినిమా డాన్సులంటే ఏదో కాస్త ఇబ్బంది… కొన్ని స్టెప్పులు నేను వేయను, ప్రత్యేకించి ఆ నడుం ఊపుళ్లు (పెల్విక్ థ్రస్ట్) (ఈ మూమెంట్స్ కాస్త వికారంగా ఉంటయ్) నావల్ల కాదు… ఇక అందరూ ఈమెకు డాన్సు రాదులే అని వదిలేశారు… రీసెంటుగా నా టీచర్ కలిసింది… సినిమాలో ఇప్పటికీ నీ డాన్స్ చూడలేదు ఎందుకమ్మా అనడిగింది, స్కూల్ డేస్‌లో పిల్లలందరిలోనూ నేను టాప్… ఏదైనా పాటలో చేసి చూపించాలని ఉంది’’ అని చెబుతూ పోయింది… ఇది ఇంట్రస్టింగు అని ఎందుకు చెప్పుకోవడం అంటే… అసలు ఈ సినిమా డాన్సులు నావల్ల కాదుఫో అనే మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్‌ను చూడటమే వింతగా అనిపిస్తోంది కాబట్టి… అది పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది అని తెలిసినా, వాటిని వదిలేసుకుంది కాబట్టి… సో వాట్, ఐడోన్ట్ కేర్ అనే ధోరణిని కనబరుస్తుంది కాబట్టి…!!
Share this Article