2005… ఒక ఐఏఎస్ ఆఫీసర్… 21 లక్షల నగదును కర్నాటకకు తరలిస్తూ, బేగంపేట ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డాడు… అప్పట్లోనే 21 లక్షల నగదు అంటే తక్కువ అమౌంట్ కాదు.., అన్నీ 500, 1000 రూపాయల నోట్లు… ఓ ఐఏఎస్ అధికారికి కాల్ చేసి అడిగాను.., ఏమవుతుంది చివరకు అనేది నా ప్రశ్న… ఆయన పకపకా నవ్వాడు… ‘‘ఏమీ జరగదు, అది మరిచిపో… కానీ నగదును బయటికి ఎలా తరలించాలో, ఎక్కడ పట్టుబడే చాన్స్ ఉంటుందో కూడా తెలివి లేకపోతే తనేం ఐఏఎస్ అధికారి..?’’ అన్నాడు… అందరూ అని కాదు, కానీ మన సివిల్ సర్వీస్ అధికారుల కథలు రోజూ వింటున్నవే కదా… సకల అవలక్షణాల ప్రతీకలు… అన్నట్టు… సదరు ఐఏఎస్ అధికారికి నిజంగానే ఏమీ కాలేదు… చొక్కా మీద పావుతులం దుమ్ము కూడా పడలేదు… ఇప్పుడు బహుశా ఆయన స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కావచ్చు…
నిన్న ఓ ఇంగ్లిష్ వెబ్‌సైటులో చదివిన ఓ పరిశోధనాత్మక కథనం ఆ పాత ఇన్సిడెంటును ఎందుకో గుర్తుచేసింది… తెలంగాణలో కమాండ్ ఏరియా చూసే ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి బిడ్డ పెళ్లికి మేఘా ఇంజనీరింగ్ సంస్థ దాదాపు 23 లక్షలు ఖర్చు పెట్టి, అతిథులకు ప్రముఖ తాజ్ హోటళ్లలో తనే ఏర్పాట్లు చూసుకుందనేది వార్త… ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టొచ్చు అనుకుని, వెంటనే కాంగ్రెస్ పార్టీ ఈ కథనాన్ని అందుకుంది, విమర్శల బాణాలు ఎక్కుపెట్టింది… బీజేపీ వెంటనే అందుకోలేకపోయింది… ఈ ఖర్చు, ఈ బంధంలో ఔచిత్యం మాటేమిటని కాంగ్రెస్ ప్రశ్నించింది… సరే, ఆ కథనంలోని నిజానిజాల జోలికి ఇక్కడ పోవడం లేదు… ఆ సైట్ ఎక్స్‌క్లూజివ్ స్టోరీ అది… సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ తెలుగీకరించిన ఆ కథనం వాట్సప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా పోస్టుల్లో ఆల్‌రెడీ హల్‌చల్ చేస్తోంది… కానీ..?
Ads
కొన్ని అంశాలు, ప్రశ్నలు చకచకా సినిమా తెర మీద కదిలినట్టుంది… ఎందుకంటే..? ప్రభుత్వం తరఫున చేసే ఏ కంట్రాక్టు పనైనా సరే… ఊళ్లలో సైడు కాలువ దగ్గర్నుంచి లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు దాకా… అసలు కమీషన్లు లేకుండా పని జరుగుతుందా..? ప్రతీ దశలోనూ ముట్టజెప్పాల్సిందే… అది ఓ అలిఖిత నియమావళి… ఎవరూ పత్తిత్తులు కారు… నిజాయితీ, నీతి అనే పదాలు ప్రభుత్వ పనుల్లో నిషిద్ధం… అందరూ లబ్ధిదారులే… నాయకులు, అధికారులు, చివరకు బిల్లుల చెల్లింపుల దాకా..! అసలు ఇవేవీ లేకుండా ఏదైనా పని జరిగితేనే అది అబ్బురం…!!
అంటే ఈ సైట్ కథనాన్ని తప్పుపట్టడం లేదు… మనం బతుకుతున్న సిస్టం గురించి నిజాయితీగా చెప్పుకోవడం, అంతే… అసలు మేఘా వాళ్ల డబ్బు, వివిధ రాష్ట్రాల ఎన్నికలకూ తరలివెళ్లిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి కదా… అవన్నీ ఇంకాస్త సీరియస్ కథలు… ఆ రేంజ్ వ్యవహారాల్లో, ఈ ఇరిగేషన్ విభాగం చూసే ఓ సీనియర్ అధికారి బిడ్డ పెళ్లికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టడం (కట్నం చదివించడం) అనేది పెద్ద అంశమేమీ కాదేమో…
కానీ ఎవరైనా ఇలాంటి ఖర్చులకు ఏమైనా డబ్బు అడ్జస్ట్ చేయండీ అనడిగితే… ఎవరి ద్వారానో పంపించేస్తుంటారు, సమయానికి పెళ్లికి వెళ్లి అందరిలాగే భోజనాలు చేసి, అక్షింతలు చల్లి వచ్చేస్తుంటారు… ఇక్కడ ఈ పెళ్లి ఖర్చుల్ని చూపించుకోవడానికి ఐటీ సంబంధ ఇష్యూస్ వస్తాయని భయపడితే… డ్రైవర్లు, ఇంట్లో వాచ్‌మెన్, కుక్, అటెండర్లు, క్లర్కుల పేర్లతో హోటల్ బిల్లుల్ని చెల్లించడమో… వాళ్ల పేర్లతోనే రూమ్స్ బుక్ చేయడమో… ఫుడ్ ఆర్డర్లు పెట్టడమో చేస్తే సరిపోయేది కదా… అధికారులు చేసేది ఇలాగే కదా…
అందుకే బేగంపేట ఎయిర్‌పోర్టులో నగదుతో పట్టుబడిన అధికారి గుర్తొచ్చాడు… ఐనా ఇలాంటి ఖర్చులకు మేఘా కంపెనీ ప్రత్యేకంగా షెల్ కంపెనీలను రన్ చేయడం, వాళ్ల సిబ్బందితో డమ్మీ మెయిల్ ఐడీలను ఉపయోగించడం, వాళ్లే కొన్ని పనులను నెత్తిన వేసుకుని పర్యవేక్షించడం విస్మయకరం అనిపించింది… (ఒకవేళ ఇదంతా నిజమే ఐన పక్షంలో… మేఘా కంపెనీ ఆ కథనాన్ని ఖండించింది…)… అవును గానీ, ఫలక్‌నుమా ప్యాలెస్‌ను తాజ్ వాళ్లు హోటల్‌గా మార్చేశారు కదా, అక్కడ గ్రాండ్ నిజాం డైనింగ్ హాల్‌లో భోజనం చేస్తే, ఒక్కొక్కరికీ 16 వేల బిల్లా..? బంగారు మెతుకులతో స్పెషల్ బిర్యానీ పెడతారా..?!
Share this Article