యూట్యూబ్ వీడియోల ఆదరణను మనం సాధారణంగా దేన్ని చూసి అంచనా వేస్తాం..? వ్యూస్, లైక్స్, కామెంట్స్ చూస్తాం… అదీ ఎంత తక్కువ రోజుల్లో అని చూస్తాం… అంతే కదా… కానీ ఈమధ్య ఆ అంకెలు కూడా మేనేజబుల్ అయిపోయాయి… మరీ ప్రధానంగా పెద్ద హీరోల టీజర్లు, ట్రయిలర్లు విడుదలైనప్పుడు ఈ పెయిడ్ నంబర్లు గిర్రున తిరిగిపోతుంటయ్… సరే, దాని గురించిన చర్చ కాదు ఇది… అంతకుమించి…
ఈమధ్యలో బంపర్ హిట్ సినిమా పుష్ప… ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా అది నిజం… హిందీలో దుమ్ము రేపింది సినిమా… ఆ వసూళ్ల అంకెల జోలికి పోవడం లేదు మనం… ఇక ఆ సినిమాలో కొన్ని సీన్లు, డైలాగులు కూడా బాగా హిట్టయ్యాయి… ఊ అంటావా, ఊఊ అంటావా పాట గురించి చెప్పనక్కర్లేదు… ఎక్కడ చూసినా అదే పాట… మీమ్స్, స్పూఫ్‌లు, రికార్డింగ్ డాన్సులు, రీల్స్… హోటళ్లలో, బార్లలో, బస్సుల్లో, పది మంది కలిసే ప్రతిచోటా అదే పాట… ఈ పాటతో సమంత అక్కినేని మళ్లీ పాత సమంత అయిపోయింది… ఐటమ్ డాన్సర్లను మించి ఊపేసింది…
Ads
ఈ పాట పాడిన ఇంద్రావతి ఇరగ్గొట్టేసింది… నిజానికి పాడటంలో తను పలికించిన అదోరకం జీర ఆ పాటకు కొత్త రుచిని, వాసనను అద్దింది… ఆ మసాలా ఘుమఘుమలే ఇప్పుడు దేశమంతా… మనం స్పూఫుల గురించి చెబుతున్నాం కదా… జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ అని రెండు కామెడీ షోలు వస్తాయి కదా ఈటీవీలో… ఆ రెండింట్లోనూ విడివిడిగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది పుష్ప సీన్లను అనుకరిస్తూ స్పూఫులు చేశారు…
వాటి నాణ్యత జోలికి పోవడం లేదు మనం… కానీ ఆ రెండింటి నడుమ యూట్యూబ్‌లో భలే పోటీ నడుస్తోంది… కొన్ని అంకెలు మరీ నవ్వొచ్చేలా ఉన్నయ్… నమ్మబుల్ అనిపించేలా కూడా లేవు… నిజానికి తెలుగు టీవీ తెర మీద ఇద్దరూ ఇద్దరే… టాప్ వన్, టాప్ టూ వాళ్లే… వాళ్ల వీడియోలు కోటి వ్యూస్ దాటడం కూడా గతంలో కూడా ఉన్నదే, అది కొత్తేమీ కాదు… ఎటొచ్చీ ఈ రెండు స్పూఫుల నడుమ సాగుతున్న గమ్మత్తయిన పోటీ ఎలా ఉందంటే…
హైపర్ ఆది స్పూఫ్… ఎనిమిది రోజులు… 1.23 కోట్ల వ్యూస్… సుధీర్ స్పూఫ్… ఏడు రోజులు 1.05 కోట్ల వ్యూస్.. మరేమనుకున్నారు…? పోటీ అంటే పోటీయే… ఆది స్కిట్‌కు 2.74 వేల లైకులు… సుధీర్ స్కిట్‌కు 2.47 వేల లైకులు… ఒక రోజు తక్కువ కదా… ఆ తేడా అన్నమాట… సుధీర్ 4771 కామెంట్లు… ఆది 4572 కామెంట్లు…
అసలు మరో విశేషం చెప్పుకోవాలి… సుధీర్ స్కిట్… సమ్ ఎక్స్ ఏదో కామెంట్ పెట్టాడు… దానికి ఏకంగా 4300 లైకులు… హైపర్ ఆది స్కిట్… సేమ్ అదే ఎక్స్… సేమ్ 4300 లైకులు… తగ్గేదేలా… ఆ సేమ్ కౌంట్ ఎలా సాధ్యం..? అదే మరి పుష్ప అంటే… ఫ్లవర్ అనుకుంటిరా… ఫైర్…
సరే, సరే, ఇంకొక ఉదాహరణ… సుధీర్ స్కిట్… సేమ్ వై కామెంట్ … 2100 లైకులు… హైపర్ ఆది స్కిట్… సేమ్ వై… సేమ్ 2100 ఫిగర్… ఒకాయన కామెంట్‌కు ఏకంగా 8200 లైకులు… మరొకాయన కామెంట్‌కు 3500 లైకులు… ఇలా సేమ్ పేర్లతో, సేమ్ లైకుల సంఖ్యతో, ఆ రెండు స్కిట్లలోనూ కామెంట్లు కనిపించడం ఓ కళ… పత్రికలకు ఏబీసీ, ఐఆర్ఎస్, టీవీలకు టీఆర్పీలు, సైట్లకు హిట్స్ ఎలాగో యూట్యూబ్‌కు వ్యూస్ సంఖ్య అంతే ప్రధానం… దానికోసం టెక్నికల్‌గా చాలా కథలు నడుస్తుంటయ్… జస్ట్, చూడటమే… ఎవరి తిప్పలు వాళ్లవి మరి…!!
Share this Article