మోడీ ద్వేషం… బీజేపీ ద్వేషం తప్పు కాదు… ఒక నాయకుడిని, ఒక పార్టీని వ్యతిరేకించడాన్ని తప్పుపట్టాల్సిన పనిలేదు… కానీ అది అదుపు తప్పి, విమర్శ, వ్యతిరేకతలు పర్వర్షన్గా మారిపోతున్న తీరు మాత్రం చెప్పుకోవాలి… ఇది అలాంటిదే… మోడీ ఏం బట్టలు తొడగాలో తన ఇష్టం… ప్రధాని పదవికి తగినట్టు ఆ వేషధారణ హుందాగా ఉందా లేదానేది మాత్రమే ముఖ్యం… ఒకసారి దిగువన ఓ వార్త చూడండి… ప్రజాశక్తిలో కనిపించింది… అది పక్కాగా చైనా అనుకూల పార్టీకి చెందిన పత్రిక…
ఈ చైనా పుత్రిక మాత్రమే కాదు, నిన్న ఆ సెక్షన్ మీడియా… అంటే యాంటీ-మోడీ సెక్షన్ మీడియా విరుచుకుపడింది… ‘‘ఎహె, ఇదేం వేషం..? ఆ టోపీ ఏంది..? ఆ పగిడీ ఏంది..? నాన్సెన్స్, ఎన్నికల స్టంట్, జనాన్ని పిచ్చోళ్లను చేయడమే ఇది… ప్రధాని పదవిని దిగజార్చడమే… అసలు ఆ ఉత్తరాఖండ్ టోపీ ఏంది..? ఆ మణిపూర్ కండువా ఏంది..? గతంలో కూడా అన్నీ ఇలాగే చేశాడు, చేస్తున్నాడు… చివరకు చైనా అధ్యక్షుడు తమిళనాడు వస్తే అక్కడికీ తమిళ వస్త్రధారణతో హాజరయ్యాడు… అదీ తమిళ ప్రజల మెప్పు పొందడానికి ఓ స్టంట్… రాజకీయాలు, తన విధానాలు చెప్పుకోవాలి తప్ప ఈ బహుళ వస్త్రధారణతో జనాన్ని మాయచేయడం ఏమిటి..?’’ అంటూ ఏదేదో రాసిపారేసింది…
Ads
మోడీని విమర్శించవద్దని ఎవరూ అనడం లేదు… దేశంలోని అనేకానేక పార్టీల్లో బీజేపీ ఒకటి… మెచ్చేవాళ్లు ఉంటారు, తిట్టేవాళ్లు ఉంటారు… అలాగే బొచ్చెడుమంది నాయకులు… మనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు… కానీ ఒక వ్యక్తి వేషధారణను కూడా కించపరచడం ఏమిటో అర్థం కాదు… సో వాట్… మోడీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకోవడానికి మాత్రమే ఇలా ప్రాంతీయతను సూచించే బట్టలు ధరిస్తూ ఉండవచ్చుగాక… కానీ అదేమీ నిందార్హం కాదు కదా…
పైగా మోడీ ఆ ప్రాంతాల ప్రజల సంస్కృతిని గౌరవిస్తున్నట్టే తప్ప, అవమానించడం లేదు కదా… మరి అభ్యంతరం ఎందుకు ఉండాలి… మోడీ వేషాన్ని బట్టి ప్రజలు వోట్లేస్తారా..? ఒకవేళ మోడీ కూడా అలాగే భావిస్తే దాన్ని ఆయన విజ్ఞతకో, జ్ఞానానికో వదిలేయాలే తప్ప, దాన్ని తప్పు అని తప్పుపట్టడం దేనికి..? స్వతహాగా వేరే మతాన్ని అనుసరిస్తూ, ఎన్నికలు రాగానే విభూతి పూసుకుని, చొక్కా విప్పేసి, జంధ్యం వేసుకుని, బొట్టు పెట్టుకుని, గుళ్లు తిరుగుతూ… నేను బ్రాహ్మడిని, నేను హిందువును అని ఫోటోలకు ఫోజులు ఏమీ ఇవ్వడం లేదుగా… నిజానికి ఒక కోణంలో అదీ తప్పుకాదు, తనేమీ ఒక మతాన్ని కించపరచడం లేదుగా… అవసరం కోసమైనా సరే, ఆశ్రయిస్తున్నాడు… శరణం మమ అంటున్నాడు…
రిపబ్లిక్ వేడుకల సందర్భంగా ఉత్తరాఖండ్ టోపీని, మణిపూర్ కండువాను ధరించడం వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉందని భలే విశ్లేషణలు చేశారు… మణిపూర్‌కు, ఉత్తరాఖండ్‌కు ఎక్కువగా వెళ్లలేకపోతున్నాడు, అందుకే ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని, ఆ ప్రజలను ఆకర్షించే చీప్ ఎత్తుగడకు దిగాడు అనేది విమర్శ… అందులో నిజానికి నిందించడానికి ఏముంది..? ఎన్సీసీ సిక్కుల పగిడీని ధరించాడు, తప్పేముంది..? పదవిని దుర్వినియోం చేయడం ఏముంది ఇందులో…? విమర్శలో సీరియస్‌నెస్ ఉండాలి, ఇలాంటి విమర్శలకు దిగితే అది మోడీకే నయం కదా… కీలక వైఫల్యాల నుంచి ప్రజల్ని మళ్లించే పని కూడా ప్రతిపక్షమే చేస్తే పాలకుడికి ఆనందమే కదా…
తమిళనాడు వెళ్లినప్పుడు లుంగీ కట్టాడు, వీళ్ల కలల యజమాని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆ ప్రాంత వస్త్రధారణతో స్వాగతం పలికాడు… నిజానికి అభినందిద్దాం… ఒక ప్రాంత సంస్కృతిని ఎలివేట్ చేసిందుకు, ప్రపంచ మీడియా ఎదుట ఎక్స్పోజ్ చేసినందుకు..! తను మంగోలియా వెళ్లినప్పుడు అక్కడి వస్త్రాలు ధరించాడు… అది వాళ్ల మనస్సుల్ని గెలుచుకునే చిన్న టెక్నిక్… వాళ్లతో కనెక్ట్ కావడానికి ఓ చిన్న ఎత్తుగడ… ఎహె, ఇండియా వస్త్రధారణ విడిచిపెట్టి, మంగోలియా వేషం ఏమిటని ఎవరూ తిట్టిపోయలేదుగా… ఇదీ అంతే…
ఎస్.., నోట్ల రద్దు దగ్గర్నుంచి, వేక్సిన్ పాలసీ దాకా బోలెడు విషయాల్లో మోడీ పట్ల రాజకీయేతర తటస్థుల్లో కూడా వైముఖ్యం ఉంది… మోడీ వైఫల్యాల తీవ్రత కూడా ఉంది… వాటిని విమర్శిస్తే, సగటు జనం పట్టని మోడీ విధానాల్ని విశ్లేషించి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తే ఎవరూ ఆక్షేపించరు… కానీ ఇదేమిటి..? మోడీ లుంగీ కట్టాడు, మోడీ టోపీ పెట్టాడు, మోడీ గంగలో మునిగాడు, మోడీ పగిడీ చుట్టాడు, మోడీ ఇడ్లీ తిన్నాడు, మోడీ పరోటా టేస్ట్ చేశాడు, మోడీ మిర్చి బజ్జీని కొరికాడు… లోకల్ చెప్పులు తొడిగాడు..!!
అసహ్యకరంగా లేనంతవరకు ఒక, నాయకుడి ఆహార్యం ఎలా ఉంటేనేం..? ఆహారం ఏదయితేనేం..? ఏ భాషలో పలకరిస్తేనేం..? విమర్శ కూడా హుందాగా ఉండాలి, ఏమయ్యా జిన్‌పింగ్, నీ సంప్రదాయిక చైనా వస్త్రధారణ వదిలేసి, ఈ సూటేంది..? ఈ పాశ్చాత్య వేషమేంది..? అని అడిగితే ఎలా తప్పో… ఏమోయ్ మోడీ, ఈ టోపీ ఏమిటి, ఈ కండువా ఏమిటి అనడిగినా తప్పే… తప్పున్నరే…!!
Share this Article