మీరు మీ వీథిలోనే ఉన్న ఓ కిరాణా షాపుకి వెళ్తారు… ఉప్పు, పప్పు, పేస్ట్, బియ్యం, సబ్బులతోపాటు… సేటూ, నాలుగు రెడ్ వైన్ బాటిల్స్, రెండు విస్కీ ఫుల్ బాటిల్స్ కూడా లిస్టులో చేర్చండి అంటారు… జస్ట్, కిరాణా సామగ్రిలాగే అవీ మీ ఇంటికి చేరతాయి….. భవిష్యత్తు అదే… అబ్బే, అదెలా కుదురుతుంది..? లైసెన్సులు, లాటరీలు, సిండికేట్లు, లంచాలు గట్రా చాలా బాగోతాలు ఉంటాయి లెండి అంటారా..? నో… గ్రాసరీ షాపుల్లో కూడా లిక్కర్ దొరికే రోజులు రాబోతున్నాయి… మొదటి అడుగు పడింది మహారాష్ట్రలో…
అసలు వైన్ లిక్కర్ కాదు అని తీర్మానించేసింది అక్కడి కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన ప్రభుత్వం… షాపింగ్ మాల్స్, చిన్న కొట్లలో కూడా వైన్ అమ్ముకోవచ్చునని చెబుతోంది… మాల్స్ అయితే 1000 స్క్వేర్ ఫీట్, షాపులైతే రెండుంబావు చదరపు మీటర్ల చిన్న పార్టిషన్ చాలు… జస్ట్, ఏటా 5 వేలు కడితే చాలు… ఛల్, మహారాష్ట్ర కాదు, మీరు మద్య రాష్ట్ర చేసేస్తున్నారు అని మాజీ సీఎం, బీజేపీ లీడర్ ఫడ్నవీస్ కస్సుమన్నాడు… దానికి శివసేన ప్రస్తుత చక్రధారి, ఎంపీ సంజయ్ రౌత్ ‘‘ఎహె, వైన్ అసలు లిక్కరే కాదు’’ అని తేల్చిపారేశాడు…
‘‘మేం రైతులకు మేలు చేస్తున్నాం తెలుసా..?’’ అని కూడా కాలరెగరేశాడు… సో, వైన్ మొదటి స్టెప్పు… తరువాత బీర్లు, ఆ తరువాత మిగతా లిక్కర్… అలా కిరాణాషాపులేం ఖర్మ… రాను రాను పాన్ షాపుల్లో, టిఫిన్ సెంటర్లలో కూడా లిక్కర్ దొరికే మద్యభారతాన్ని చూడబోతున్నాం… మొదటి స్టెప్పు మహారాష్ట్ర, తరువాత మిగతా రాష్ట్రాలు… ఇక దేశప్రజలకు కిక్కే కిక్కు… అవునూ, మీకు డౌట్ రాలేదా..? నిజంగానే వైన్ లిక్కర్ కాదా..? కాస్త వివరంగా చెప్పుకుందాం… దిక్కుమాలిన పాలసీలు తీసుకునే ప్రతి ప్రభుత్వం చెప్పే దొంగమాటలే ఇవి కూడా…
వైన్ లిక్కరే… వైన్ రకాన్ని బట్టి ఆల్కహాల్ పర్సంటేజీ 5 శాతం నుంచి 15 శాతం దాకా ఉంటుంది ఇండియాలో… ఫోర్టిఫైడ్ వైన్ అయితే కొన్నింట్లో ఏకంగా 20 శాతం దాకా… (ఏబీవీ- Alcohol by Volume)… మరి లిక్కర్ ఎందుకు కాదు..? నిజానికి బీర్‌లో కూడా దాదాపు అంతే కదా… ఉదాహరణకు కింగ్‌ఫిషర్ స్ట్రాంగ్, నాకవుట్ బీర్లలో 8 శాతం… ఇక వోడ్కా, జిన్, రమ్, టెకీలా విస్కీలలో నాలుగైదు రెట్లు అధికం… ఇంకా ఎక్కువ కూడా… ఇక రైతులకు ఉపయోగకరం అనే వాదన చూద్దాం…
Ads
వైన్ ద్రాక్షను పులియబెట్టి తయారుచేస్తారు… ఈ వైన్ ఉత్పత్తికి మహారాష్ట్ర ఆది నుంచీ పెద్ద అడ్డా… రైట్… కానీ చెరుకుకు కూడా మహారాష్ట్ర ఫేమస్ కదా… అందులో నుంచి మొలాసిస్, ఇథనాల్ గట్రా వస్తాయి కదా… అవే కదా ఎక్సట్రా న్యూట్రల్ ఆల్కహాల్‌ను, అంటే మద్యాన్ని తయారు చేసేది… మరి విస్కీ గట్రా ‘‘లైసెన్స్ ఫ్రీ’’ సేల్స్‌కు అనుమతిస్తే చెరుకు రైతులు మేలు అందామా..? అంతెందుకు… ఇప్పుడు డిస్టిలరీలు తృణధాన్యాల నుంచి కూడా తయారు చేస్తున్నారు… అంటే అది గోధుమ, వరి, జొన్న తదితర పంటలు వేసే రైతులకు కూడా బెనిఫిటే అందామా..?
వైనరీలు ద్రాక్షను పులియబెట్టి వైన్ తయారు చేసినట్టే… బ్రూవరీలు బార్లీయే కాదు, బియ్యం నూక, జొన్న, గోధుమలను కూడా వాడుతున్నయ్ బీర్ తయారీకి..! మరిక రైతు ప్రయోజనకరం కానిదేమున్నట్టు… ఇంకేం, సకల మద్యం రకాల్నీ ఉప్పుల్లా, పప్పుల్లా అమ్మకానికి ‘ఆంక్షలు’ తొలగిస్తే సరి కదా… ప్రజలు కూడా ఇక మద్యోన్మత్తులై, మత్తులో మునిగి సకల కష్టాల్నీ మరిచిపోయి, ఇల్లిల్లూ కిక్కెక్కి ఊగడమే..!! ఆగండాగండి… మరీ బరితెగించిన ప్రభుత్వాలు అయితే మరో పని చేయవచ్చు… బెల్లం వచ్చేది చెరుకు నుంచే కదా, బెల్లంతో వచ్చే నాటుసారాను కూడా అనుమతించాలి… చెరుకు రైతులకు ప్రయోజనకరం… ఇప్పసారాను ప్రమోట్ చేయాలి, ఇప్పపూల సేకరణతో గిరిజనులకు ప్రయోజనకరం… పనిలోపనిగా గంజాయిని కూడా ఫ్రీ చేసేస్తే, మేలురకాల గంజాయి విత్తనాల్ని కూడా ప్రమోట్ చేస్తే బెటర్ కదా… దమ్ మారో దమ్… మామా ఏక్ పెగ్‌లా…!!
Share this Article