మానవ నాగరికత, పరిణామ క్రమంలో జంతుజాలానికి మనుషుల మధ్య జరిగిన సంఘర్షణలో మనిషే విజేత. ఆ విజయం తిరిగి మనుషులు – మనుషుల మధ్య కొనసాగి, అది వివిధ తెగలలో హింసా పూరిత ఘర్షణగా మారి రూపాంతరం చెందుతూ వస్తూ ఉంది. ప్రాచీనకాలంలో అన్ని తెగలలో ప్రబలంగా ఉన్న “ఊడూ ఇజం” గురించి మనం చెప్పుకోవాల్సిన సందర్భం. ఆ ఊడూ ఇజం సృష్టించిన నరమేధం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ కొన్ని తెగలలో ముఖ్యంగా ఆ ఆఫ్రికాలోని కొన్ని సమూహాలలో ఊడూ ఇజం సంఘర్షణ, హింస రూపంలో కనిపిస్తూనే ఉంది.
తెలుగు సినిమా దర్శక ప్రముఖుడు ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న సినిమాలు ఊడూ ఇజం ఆధారంగా ఉంటున్నాయి. దీని ఆధారంగా తీస్తున్న వారి సినిమాలు సమకాలీన నాగరికతకు, విలువలకు పూర్తిగా భిన్నం. రక్త బంధ రాజ్యాల ఆధిపత్యం, కుటుంబ సభ్యుల మధ్య అధికారం కోసం రక్తతర్పణతో కూడిన హింస, కుట్రలు, ప్రతి నాయకుడు హీరో కంటే బలంగా ఉండటం వారి సినిమాల్లో ముఖ్య కథాంశాలుగా ఉంటాయి. చివరికీ అతణ్ణి హీరో జయించి వీరోచితత్వ విజయాన్ని శూరత్వ (హీరోయిజం) పరిధులు దాటి చూపించడమన్నది వారి సినిమాల్లో తప్పనిసరిగా ఉంటుంది. ఇలాంటి “బ్లడ్ లైన్ కల్ట్” కల్చర్ ఆహ్వానించతగినది కాదు.
Ads
ఊడూ ఇజం నేపథ్యాన్ని చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తెగలలో నరమేధాన్ని సృష్టించింది. రాజమౌళి తీసే చారిత్రక, వీరోచిత, రక్తసంబంధ కథాంశాల నేపథ్య చిత్రీకరణ, ఊడూ వైపరీత్యంగా మారుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా తెలుగులో కొందరు దర్శకులు విపరీతమైన శూరత్వాన్ని (హీరోయిజం) శిఖర స్థాయిలోకి తీసుకెళ్లే ధోరణి ఆరంభమైంది. కానీ ఊడూఇజాన్ని ప్రేరేపించే సినిమాల వల్ల సమాజానికి ఒరిగేదేమీ లేదు. ముఖ్యంగా బాహుబలిని తీసుకుంటే ఊడూఇజం ఛాయలు వెర్రి తలలు వేశాయి. చారిత్రక కథాంశాల నేపథ్యంతో ఎన్నో మంచి సినిమాలు తీసిన దర్శకులు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. కానీ ఊడూఇజం సైద్ధాంతిక నేపథ్యంగా ఇండియాలో సినిమాలు తీసేది మాత్రం రాజమౌళే... మంత్రాలు, తంత్రాలు, యుద్ధాలు, రక్త తర్పణాలు, అతి హింసాత్మక మానవ ఘర్షణ,
బాహుబలి ఇండియా సినిమా అంతర్జాతీయ స్థాయిలో అంతగా గుర్తింపు రాకపోవడానికి, అవార్డులు దక్కించుకోక పోవడానికి కారణం అది ఊడూ ఇజాన్ని బలపరుస్తుందని. ఈ విషయం చాలా మందికి తెలియదు. వీరోచిత గాథలను, చారిత్రక నేపథాన్ని, అసమాన శూరత్వాన్ని రక్త సంబంధ ఘర్షణలుగా మార్చడం, దానికి సంబంధిత హీరో ఆకారాన్ని, ఆహార్యంతో పాటు సామాజిక నేపథ్యాన్ని జోడించి సినిమాలు తీయడం ప్రొఫెషనలిజం కానే కాదు. సంస్కృతీ, నాగరికతల నేపథ్యంలో సినిమా వందల ఏళ్ళు నిలబడాలి అంటే ఊడూ ఇజం ఆధారిత సినిమాలు తాత్కాలికమైన వినోద, వ్యాపారపర విజయం వరకు పనికి వస్తాయి. సినిమా పరిధి విస్తృతమైంది. ఆధునిక డిజిటల్ శకంలో ఇంకా ఖండాంతరాలు వీక్షించి శెభాష్ అనుకోవాలి అంటే ఈ “ఊడూ” సినిమాలు వెర్రి తలలు వేయొద్దు…
– డా. శ్రీరామ్ కన్నెకంటి, సామాజికాంశాల విశ్లేషకుడు
Share this Article