సోషల్ మీడియాలో ఎప్పుడు, ఎవరు, ఎందుకు, ఏం పోస్ట్ చేస్తున్నారో కొన్నిసార్లు అర్థమే కాదు… మన బాగా చదువుకున్న మూర్ఖజనం, అదేలెండి, మన సోషల్ నెటిజన్స్ గుడ్డిగా వాటిని షేర్ చేస్తారు, కాపీ పోస్టులు, కట్ అండ్ పేస్టులు సరేసరి… ఈమధ్య ఓ న్యూస్ ఐటం పెట్టేశారు… చాలా మంది వాల్స్ మీద, వాట్సప్ గ్రూపుల్లో కనిపించేసరికి, అదీ పద్మశ్రీ అవార్డుకు లింకై ఉండేసరికి, ఓ సాదాసీదా చాయ్‌వాలాకు పద్మశ్రీ వచ్చిందనే ఆ వార్త హఠాత్తుగా ఆకర్షించింది…
అసలే ఇప్పుడు పద్మ అవార్డుల వార్తల సీజన్ కదా… సక్సెస్ స్టోరీలు, ఇన్‌స్పిరేషనల్ స్టోరీలు రాసేస్తూ మీడియా చప్పట్లు కొడుతూ ఉంటుంది… అవసరం కూడా… కానీ ఈ చాయ్‌వాల్ వార్త ఎలా మిస్సయ్యాను అని కాస్త సెర్చడం స్టార్ట్ చేస్తే… అసలు ఈసారి అవార్డుల జాబితాలో ఆయన పేరే కనిపించలేదు… మరి ఈ న్యూస్ ఎక్కడిది..? అని మళ్లీ సెర్చితే 2019 మీడియా వార్తల్లో కనిపించాడు… నాకూ చదివినట్టే గుర్తు… కానీ ఈ శోషల్ కొత్త పోస్టులతో కాస్త కన్‌ఫ్యూజన్‌లో పడిపోయా…
Ads
ఎందుకు గుర్తొచ్చిందీ అంటే… అప్పట్లో మోడీ ఈయన గురించి తన మన్‌కీబాత్‌లో ఓసారి ప్రస్తుతించాడు… కటక్‌లోనే ఏదో సందర్భంలో తనను కలిసినట్టు కూడా గుర్తు… నిజానికి ఆయన కటక్‌లో ఉంటున్నా, మన తెలుగువాడు… అలా గుర్తుంది… తన పేరు దేవరాపల్లి ప్రకాశరావు… ఆ కుటుంబం అప్పుడెప్పుడో ప్రకాశం జిల్లా నుంచి ఒడిశాకు తరలిపోయింది… నిజానికి ఈ పద్మశ్రీ తనకు 2019లో దక్కింది…
నిజమే… ఆరేడేళ్ల వయస్సు నుంచే తండ్రికి సాయంగా చాయ్ అమ్మేవాడు… అలా యాభయ్యేళ్లకు పైగా… అదే చాయ్… తనకు చదువు లేదనే బాధ, తోటి మురికివాడల పిల్లలైనా చదువుకోవాలనే తపనతో… తన సొంత సంపాదన మొదలయ్యాక, ఆదాయంలో సగం అట్టిపెట్టేవాడు… ఓ రెండు గదుల్ని బడిగా మార్చి, చదువు చెప్పించేవాడు… మొదట్లో ఆ పిల్లల పేరెంట్సే ప్రకాశరావును తిట్టిపోసేవాళ్లు… పిల్లల్ని పనికి పంపిస్తే నాలుగు డబ్బులు వస్తాయనేది వాళ్ల ఆశ…
కేవలం నలుగురితో మొదలైన ఆ బడిలో తన ఖర్చుతోనే మధ్యాహ్నం భోజనం పెట్టేవాడు… చెప్పులు, యూనిఫాం, పుస్తకాల ఖర్చు తనదే… తరువాత ఆ సంఖ్య వంద దాకా పెరిగింది… ఇవన్నీ నిజాలే… పద్మశ్రీకి అక్షరాలా అర్హుడే… సొంత లాభం కొంత మానుకుని సొసైటీ కోసం ఎవరు ఏం చేసినా వాళ్లు పద్మశ్రీలే… పెద్దవాడు, డబ్బులున్నవాడు ఖర్చుపెట్టి, పరులకు సాయం చేస్తే ఏముంది..? ఏమీ లేనివాడు తన సంపాదనలో సగం పరుల కోసం వెచ్చించేవాడే అపరకర్ణుడు… ఈ ప్రకాశరావు భార్య నర్స్, ఆమె జీతం ఇంటి ఖర్చులకు, తన చాయ్ సేల్స్ సంపాదన సమాజం కోసం…!!
అయితే అసలు ఇప్పుడు చెప్పుకోవాల్సిన వార్త ఆ పద్మశ్రీ కాదు… పాపం, తనకు గత డిసెంబరు 25న కరోనా సోకింది… ఓ హాస్పిటల్‌లో చేర్చారు… 20 రోజులైనా పరిస్థితి మెరుగుపడలేదు, అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కన్నుమూశాడు… గుర్తుచేసుకోవాల్సిన వాడే… కానీ ఇప్పుడు రాయాల్సిన వార్త ఇది కాదు… అన్నట్టు, ప్రధాని తనను కలిసినప్పుడు ఓ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు… పిల్లలకు రోజూ ప్రకాశరావు దాల్మా వండి పెడుతున్నాడు… మంచి పౌష్టిక విలువలున్న ఈ డిష్‌ను దేశమంతా పిల్లలకు మధ్యాహ్నభోజనంలో పెడితే బాగుంటుందీ అన్నాడు… ఆ దాల్మా గురించి మరో కథనంలో చెప్పుకుందాం.,.
Share this Article