ఓ ఇంట్లో కోడలు కొర్రమీను పులుసు చేస్తోంది… అందులోకి మసాలా వేస్తుంటే అత్తగారు చూసి కోప్పడిపోయింది… ‘‘ఇదేమిటే, బొచ్చెల ఫ్రైలో వేయాల్సిన మసాలా అది… కొర్రమీనుకు వేస్తావేంటి..? మొన్న కూడా అలాగే చేశావ్… గుత్తివంకాయ కూరకు వాడే మసాలాను ముక్కల పులుసుకు వాడేసినవ్… కనీసం ఏ కూరకు ఏ మసాలా వాడాలో కూడా తెలియకుండా పెంచిందా మీ అమ్మ..? ఆయ్ఁ…’’ ఆ కోడలు మొహం మాడిపోయింది…
నవ్వొచ్చిందా..? ఇదేమిటి..? దాదాపుగా అన్ని కూరలకూ వాడే మసాలాలు సేమ్ కదా, మరీ బిర్యానీలయితే కాస్త తేడా, అంతే కదా… పైగా కూరకూరకూ ఒక్కొక్కరకం మసాలా ఉండటం ఏమిటి..? అబ్సర్డ్… అని తిట్టేసుకోకండి… దిగువ ఓ ఫోటో చూడండి… ఈనాడు పత్రికలో మాస్ట్ హెడ్ పక్కన ప్రియ పచ్చళ్ల యాడ్ అది… పైపైన చూస్తే ఏముంది ఇందులో, వాళ్ల సొంత యాడ్ కదా, విశేషం ఏముంది అనిపిస్తుంది…
ఇది కొర్రమీను మసాలా అట… అంటే బొచ్చెలకు వేరు, జెల్లలకు వేరు, పులస అయితే వేరు ఉంటాయా..? రొయ్యలకు, ఎండ్రికాయలకు కూడా వేర్వేరు మసాలాలు అమ్ముతారా..? అని ఓసారి నవ్వొస్తుంది… నిజానికి మెజారిటీ ప్రజలు కూరలు వండుకునేటప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి ముద్దను తగిలిస్తారు… కూరను బట్టి పోపు పెడతారు… ప్రాంతాన్ని బట్టి తేడాలూ ఉంటయ్… తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకించి తెలంగాణ జిల్లాల్లో ఇంగువ పెద్దగా వాడరు, పట్టించుకోరు… కానీ ఆంధ్రలో దీని వాడకం ఎక్కువే… ఇళ్లల్లో నాన్-వెజ్ వండేటప్పుడు ఓ దాల్చిన చెక్క, ఓ బిర్యానీ ఆకు, నాలుగు యాలకులు, రెండు లవంగాలు వేసేస్తే సరి…
మరీ ఇప్పటితరానికే ఈ ఓవర్ మసాలా పిచ్చి… మొన్న ఓ యూట్యూబ్ వీడియోలో ఏదో వెజ్ కూర… (నిజానికి వెజ్ కూరల్లో మసాలాల వాడకం తక్కువ…) ఏమేం వేసిందో తెలుసా అందులో… పసుపు, కారంపొడి, ఉప్పుతో పాటు ఇంగువ, జిలకర పొడి, ధనియాల పొడి, మెంతుల పొడి, మిరియాల పొడి, ఇంకేవో రెండురకాల మసాలా పొడుల్ని కలిపింది… అవి గాకుండా పోపు… కరివేపాకు, కొత్తిమీర సరేసరి… అన్నీ అయ్యాక నువ్వుల పొడి, వేరుశెనగల పొడి కలిపి జల్లింది కూరపైన… హహహ… అసలు కాయగూర ఏమిటో అక్కర్లేదు… ఈ మసాలాలే గుప్పుగుప్పుమని వాసన కొడుతుంటయ్…
Ads
సేమ్, ప్రియ పచ్చళ్లు… ఒక్కసారి వాళ్ల వెబ్‌సైట్‌కు వెళ్లి చూస్తే బోలెడు మసాలాలు, అందులోనూ వెజ్-నాన్ వెజ్… నవ్వొచ్చినా సరే, వాటి సేల్స్ విపరీతంగా ఉంటున్నయ్… అవేకాదు, మసాలా పేస్టులు, పచ్చళ్లు, రెడీటుఈట్, ఇన్‌స్టంట్ మిక్సులు, పొడులు అన్నీ కలిపితే వందల రకాలు… కేవలం ప్రియ బ్రాండ్ మసాలాలే 55 రకాలు… అంటే డిష్‌ను బట్టి మసాలా అన్నమాట… ఆమధ్య ట్రెండ్ రోటీపచ్చళ్లు, వెంటనే అవీ ప్రవేశపెట్టేశారు… నిజానికి రోటీ పచ్చడి అంటేనే మనం ఇంట్లో రోట్లో దంచుకుంటాం అని కదా… ఆ పేరుతో పచ్చడి అమ్మేయడమే ఇది… ఇప్పుడు చిరుధాన్యాల ట్రెండ్ కదా… అవీ అమ్మేస్తున్నారు… ఎస్, మార్కెట్ తెలిసిన మాంత్రికుడు రామోజీ…
మొదట్లో ‘పచ్చళ్లు అమ్ముకునే రామోజీ’ అని వెకిలి వ్యాఖ్యలు చేసేవాళ్లు కదా… ఇప్పుడు ఆ వ్యాపారం లాభదాయకత ఏమిటో అర్థమవుతోంది అందరికీ… అనేక బ్రాండ్లు, దేశంలో ఏటా కొన్ని వేల కోట్ల టర్నోవర్… రామోజీ అప్పుడెప్పుడో ఊహించి, 1980లోనే ఫుడ్స్‌లో అడుగుపెట్టాడు… పచ్చళ్లలో నెంబర్‌వన్ ఇప్పటికీ ఆ ప్రియ బ్రాండే… కరోనా వచ్చి ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ సేల్స్ విపరీతంగా పెంచేసింది… ఈ ఫుడ్స్ వ్యాపార పరిణామం మూడునాలుగేళ్లలో డబుల్ అవుతుందని ఓ అంచనా… అర్థమైంది కదా, ఇదీ అసలు అదిరిపోయే ఘుటు మసాలా అంటే…!! స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ సప్లయ్ వ్యాపారం కథ వేరు, అదీ మరో కథనంలో చెప్పుకుందాం..!
Share this Article