కొత్త రాజ్యాంగం అవసరం ఈ దేశానికి..? ఈ మాట అన్నాక కేసీయార్ మీద బోలెడు వ్యాఖ్యలు, సెటైర్లు, విమర్శలు కనిపిస్తున్నయ్ సోషల్ మీడియాలో… కానీ చాలామంది నిజానికి తను సరిగ్గా ఏమన్నాడో పట్టుకున్నట్టు లేదు… ఆ మాటలు ఏ కాంటెక్స్ట్‌లో అన్నాడో, ఆయన ఆలోచన పరిధి ఎంత పరిమిత స్థాయిలో ఉందో ఓసారి చూడాలి… తను రాజ్యాంగానికి సవరణలు కాదు, కొత్త రాజ్యాంగమే అవసరం అంటున్నాడు… ఏం, 80 సార్లు మార్చుకున్నాం, ప్రపంచమంతా అవసరముంటే మార్చుకుంటూనే ఉన్నారు, ఇన్నేళ్లయినా మన దేశ ఆకాంక్షల్ని నెరవేర్చలేదు ఈ రాజ్యాంగం, మార్చుకుంటే తప్పేమిటి అనేది కేసీయార్ మాటల సారాంశం…
అవును, రాజ్యాంగాన్ని కొత్తగా రాసుకోవడం తప్పా ఒప్పా అవసరమా అనే చర్చ జరగాలే తప్ప, అది అసాధ్యమేమీ కాదు… రష్యా వందేళ్లలో అయిదుసార్లు రాజ్యాంగాన్ని కొత్తగా రాసుకుంది… అయితే భారతదేశానికి కొత్త రాజ్యాంగం అవసరమా..? రాజ్యాంగ మౌలిక స్పూర్తి చెడగొట్టకుండా, కాలానికి అనుగుణంగా సవరణలు చేసుకునే ఉంటున్నాం కదా… మరిక కొత్త రాజ్యాంగం దేనికి..? ఇది ప్రధానమైన ప్రశ్న… అది కేసీయార్ వివరించడు… ఓ డిబేట్ విసురుతున్నా అంటాడు, వెళ్లిపోతాడు, ఇక కొన్నాళ్లు మళ్లీ బుల్లెట్‌కు కూడా దొరకడు… కనిపించడు…
ముందుగా కేసీయార్ ఏమన్నాడో చూడండి… ఈ వీడియోలో…
Ads
ఒక ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ అధినేత, సుదీర్ఘకాలం రాజకీయానుభవం ఉన్న నాయకుడు… ఇంతటి కీలకమైన డిబేట్ జరగాలని కోరుకునే పక్షంలో ముందుగా కొత్త రాజ్యాంగం అవసరమేమిటో వివరించాలి… తను ప్రధానంగా ఏం మార్పులతో కూడిన కొత్త రాజ్యాంగం కావాలని కోరుకుంటున్నాడో చెప్పాలి… అప్పుడే కదా రాజ్యాంగం పట్ల తన అవగాహన ఏమిటో ముందుగా అర్థమయ్యేది… కొత్త రాజ్యాంగం అంటే అబ్రకదబ్ర, హాంఫట్ అనగానే తెల్లారేసరికి టేబుల్ మీద ఉండేది కాదు… అది ఓ పే-ద్ద తేనెతుట్టెను కదిలించడమే…
అప్పట్లో అంబేద్కర్ రాజ్యాంగ కమిటీకి నేతృత్వం… మంచి టీం దొరికింది… మనకు కొత్తగా స్వాతంత్ర్యం వచ్చింది… రాజ్యాంగం అవసరం… ఎవరికీ విమర్శించే చాన్స్ లేకుండా అన్నీ పరిశోధించి, పరిశీలించి, మన దేశానికి అనువైన రాజ్యాంగాన్ని పూర్తి చేసి, జాతికి ఇచ్చారు… ఇప్పుడు దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో మామూలు బిల్లులే సెలెక్ట్ కమిటీకి పోయి ఏళ్లు మూలుగుతున్నయ్… బొచ్చెడు పార్టీలు, ఎడ్డెం అంటే తెడ్డెం అనే ధోరణులు… ప్రజలు, పార్టీల అభిప్రాయాలు తీసుకుని ఓ కొత్త రాజ్యాంగం రచించడం సాధ్యమయ్యే పనేనా..?
ఇంతకీ కేసీయార్ అసంతృప్తి ఏమిటో తెలుసా..? రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం లాగేసుకుంటోందట… అందుకని కొత్త రాజ్యాంగం కావాలట… అంత పరిమిత స్థాయిలో తన ఆలోచనలు, పైగా దానికి దేశమంతా చర్చ జరగాలట… తనేదో చాలా మౌలిక అంశాల్ని ప్రస్తావిస్తాడేమో అనుకున్నారు అందరూ… తూచ్, అవేమీ లేవు…
అసలు కేంద్రం అంకుశం ఎందుకు పట్టుకుంది..? ఈ స్థితి ఎందుకు వచ్చింది..? ఎక్కడికక్కడ కుటుంబ పార్టీలు, రకరకాల అవలక్షణాలున్న పార్టీలు పుట్టుకొచ్చి, సంకుచిత ధోరణులు-అవినీతితో పలు రంగాల్ని కోలుకోకుండా చేస్తున్నందున… కేంద్రం ఆయా రంగాల్లో అధికారాల్ని కేంద్రీకృతం చేస్తోంది… ఉదాహరణకు, విద్యుత్తు రంగం… (దీనిపై రాస్తూ పోతే ఒడవదు, తెగదు… కేంద్రం కొన్ని అంశాల్ని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది… ఈ రంగంపై, సమాజంపై ప్రేమ ఉన్న నిపుణులు ఆహ్వానించేదే…)
రాష్ట్రాల హక్కులు, ఫెడరల్ స్పిరిట్, ఉమ్మడి జాబితా వంటి పదాలు, అర్థాలు, ప్రయోజనాలు ఏవైనా… క్రమేపీ కేంద్రం బోలెడు అధికారాల్ని రాష్ట్రాలకు అప్పగించాలనేది కేసీయార్ వాదన… ఈ పరిమిత అధికారాల్లోనే రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులో పడేస్తున్నారు.., ఇంకా అధికారాల్ని బదలాయిస్తే జరిగేది ఏమిటి..? జస్ట్, అదొక ఉదాహరణ మాత్రమే… ఆర్థికమే కాదు, చాలా అంశాల్లో రాష్ట్రాల విస్తృత అధికారాలు అభిలషణీయం కాదు… పంజాబ్ చూస్తున్నాం కదా… ఓ మాఫియా రాష్ట్రంగా మారిన యూపీని చూశాం కదా…
నిజానికి బలమైన కేంద్రమే ఈ దేశానికి అవసరం… సో, ఈసారి ఫెడరల్ ఫ్రంట్ కోసం కలిసొచ్చే పార్టీల ముఖ్యనేతల్ని పిలిచి భేటీ వేయాలి కేసీయార్… ముందుగా కొత్త రాజ్యాంగం అనే ప్రతిపాదన తీసుకురావాలి… ఆ తరువాత మిగతాది ఆలోచిద్దాం… ఐనా, కేసీయార్ సార్, అయిదారు కొత్త రాజ్యాంగ ముసాయిదాలు ఆల్‌రెడీ ప్రిపేర్ చేస్తివా కొంపదీసి… నెట్‌లో పెట్టేస్తే, డిబేట్ స్టార్ట్ చేసేద్దాం…!! ఈలోపు ఢిల్లీకి పోయి గత్తర లేపుతా, అగ్గిపెడతా వంటి ఆలోచనలు చేయకు ప్లీజ్, అసలే ఢిల్లీవాసులు కొన్నిరోజులుగా భోజనాలు కూడా సరిగ్గా చేయడం లేదట, కంటినిండా నిద్ర కూడా లేదట..!!
Share this Article