Bharadwaja Rangavajhala…………. ఆంధ్రా దిలీప్ అని చెలాన్ని, ఆంధ్రా దేవానంద్ అని రామ్మోహన్ నీ ఇలా పిల్చారు గానీ… అసలు ఆంధ్రా నసీరుద్దీన్ అనదగ్గ నటుడు సత్యేంద్ర కుమార్ గురించి అనరేం… నిజానికి ఈ పోలిక కోసం సత్యేంద్ర కన్నా ముందు నారాయణ రావు ఉన్నారనుకోండి… ఆయన నిజంగానే ఆంధ్రా, ఈయన తెలంగాణ అనుకుంటే సమస్యే లేదు కదా…
సత్యేంద్ర కుమార్ అసలు పేరు అన్నాబత్తుల సత్యేంద్రకుమార్ … ఊరు ఖమ్మం. ఖమ్మంలో కళా పరిషత్ ఏర్పాటు చేసి అనేక మంది రచయితల నాటకాలు ఆడేవారాయన. బికామ్ చదివి ఆర్ అడ్ బీ లో ఉద్యోగం చేస్తూ కూడా నాటకాలు వేసిన ఆయనకు అనుకోకండా సినిమా అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమాలో హీరో మారడంతో డిజప్పాయింట్ అయ్యారు. నటుడు మన్నవ బాలయ్యతో అన్నదమ్ముల కథ, ఈనాటి బంధం ఏనాటిదో లాంటి ఒకటి రెండు సినిమాల్లో చేసేసరికి ఆడియన్స్ లో అతను బాలయ్య తమ్ముడై ఉంటాడనే మాట ప్రబలంగా వినిపించేది. లేకపోతే ఎందుకు ప్రమోట్ చేస్తాడనేది మనోళ్ల లాజిక్కు.
సత్యేంద్ర నాటకాలు చూసి అతన్ని హీరోగా పెట్టి కోడెనాగు సినిమా తీయాలనుకున్నారు నిర్మాత ఎమ్మెస్ రెడ్డి. అయితే ఆ పాత్ర తను చేస్తానని శోభన్ బాబు పట్టుపట్టడంతో సత్యేంద్రకు ఆ అవకాశం మిస్ అయ్యింది. ఆ తర్వాత హీరో పక్కనుండే స్నేహితుల పాత్రలూ … ఓ మోస్తరు విలను వేషాలు వచ్చేవి. అలాంటి సమయంలో వచ్చిన అవకాశమే … ఊరుమ్మడి బ్రతుకులు. ఇది సిఎస్ రావు నాటిక… బిఎస్ నారాయణ డైరెక్షను… ఈయనా తెలంగాణయే…
Ads
ఆ వెనుక వచ్చిన అవకాశం చలిచీమలు. ఆ సినిమా నిర్మాణంలో ఆ తర్వాత దర్శకుడైన వేజెళ్ల సత్యనారాయణ కూడా కీలక పాత్ర పోషించడంతో సత్యేంద్ర కుమార్ కు హీరోగా అవకాశం వచ్చింది. ఆ సినిమాకు అవార్డులతో పాటు మంచి పేరూ వచ్చింది గానీ సత్యేంద్రకుమార్ కు హీరో పాత్రలను మాత్రం తేలేకపోయింది.
ఊరుమ్మడి బ్రతుకులు ప్రేరణతో… ఒక ప్రయత్నం చేద్దామని చలిచీమలు తీయడానికి మిత్రులను రెచ్చగొట్టారు వేజెళ్ళ. అలా రెండున్నర లక్షల రూపాయలతో అతి కష్టం మీద తీసిన సినిమా చలిచీమలు. దానికి ఆ తర్వాత రోజుల్లో విప్లవ నటుడుగా చెలామణీ అయిన శివకృష్ణ కూడా డబ్బులు పెట్టారు. అందులో ఓ ఆఫీసరు పాత్రలో కనిపిస్తారు కూడా. చలిచీమలు చిత్ర షూటింగ్ టైమ్ లో … కాగడాల సీను తీయడానికి నూనెకు డబ్బులు లేక అందరూ తలో కాస్త వేసుకుని అప్పటికప్పుడు నూనె తెప్పించిన ఘటనను బతికున్నంత కాలం దర్శకుడు దేవదాస్ కనకాల చెప్తూండేవారు…
ఆ సినిమా కూడా సత్యేంద్రకు పెద్దగా అవకాశాలు తేలేకపోయింది. కమర్షియల్ సినిమాలకు ఈయన పనికిరాడనే అభిప్రాయం బహుశా అప్పటి దర్శక నిర్మాతలకు ఉండడం ఓ కారణం కావచ్చు. వీరమాచినేని హనుమాన్ ప్రసాద్ సారధ్యంలో వచ్చిన కలియుగ మహాభారతంలో కర్ణుడిని పోలిన పాత్రలో కనిపిస్తారాయన.
ఆ తర్వాత రోజుల్లో హనుమాన్ ప్రసాదే తీసిన ఛాయ సినిమాలో రూప పక్కన హీరోగా నటించారు. ఆ సినిమా కూడా బాక్సాఫీసు దగ్గర పెద్దగా లాభాలు తీసుకు రాలేదు. హీరో అవుదామనే ఉద్దేశ్యంతో ఉద్యోగం కూడా వదులుకున్న సత్యేంద్ర 1998లో కన్నుమాశారు. తొంభై న్యూ ఎకనామిక్ పాలసి అనంతరం ఆర్ట్ సిన్మాను కమర్షియల్ సిన్మా మింగేసింది… సత్యేంద్ర లాంటి హీరో అవసరం పడలేదు తెలుగు సిన్మా కి…
Share this Article