రాక రాక వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, మంచి పేరు తెచ్చుకుంటూ ఇంకా ఎదగాలంటే… ముందుగా నోటిని అదుపులో పెట్టుకోవాలి, ప్రతి మాటా ఆచితూచి వాడాలి, మాటల్లో సంస్కారాన్ని ప్రోదిచేయాలి, హుందాగా అడుగులు వేయాలి, పరిపక్వ రాజకీయం వైపు ఆలోచించాలి… కానీ మన తెలుగు రాష్ట్రాల రాజకీయం మొత్తం బూతులు, కక్షసాధింపులు, అబద్ధాలు, యూటర్నులు, కేసులే కదా… ఒక్కసారి స్టాలిన్ వైపు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది…
జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు… తోటి భాగస్వామ్య పక్షాలకు సీట్ల కేటాయింపు దగ్గర్నుంచీ, విపక్షాల పట్ల మర్యాద, సంస్కారంతో కూడిన పరిపక్వ ప్రవర్తనను కనబరుస్తున్నాడు… అదే సమయంలో మరింత పాపులర్ కావడానికి కొత్త ఎత్తుగడల్ని రచిస్తున్నాడు… అందులో ఒకటి, తాజాగా తను 37 రాజకీయ పార్టీల ముఖ్యనేతలకు లేఖలు రాశాడు… ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీలను విడిచిపెట్టి, మిగతా అన్ని ముఖ్య పార్టీల నేతలకూ ఆ లేఖలు చేరాయి…
అందులో తన ప్రధాన ప్రత్యర్థి పార్టీ అన్నాడీఎంకే కూడా ఉంది… ఇంకా కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, టీఎంసీ, నేషనల్ ఫ్రంట్, ఎన్సీపీ, జేడీఎస్, టీడీపీ, బీజేడీ, పీడీపీ, శివసేన కూడా ఉన్నయ్… మొత్తం జాబితా కావాలంటారా..? వోకే… ఆప్, టీఆర్ఎస్, వైసీపీ, జేఎంఎం, ఎన్ఆర్ కాంగ్రెస్, జేడీయూ, ఎస్పీ, బీఎస్పీ, ఎఐఎఫ్‌బీ, మజ్లిస్, ఐయూఎంఎల్… జనతా కాంగ్రెస్, అకాలీదళ్, లోకజనశక్తి, ఎంఎన్ఎస్, ఐఎన్‌ఎల్‌డి,, తమిళ పార్టీలైన MDMK, PMK, VCK, MMK, KMDK… వీటితోపాటు కొత్తగా అమరీందర్ పెట్టిన పంజాబ్ లోక్ కాంగ్రెస్, ఏపీ జనసేన పార్టీలు కూడా ఉన్నయ్…
Ads
ఈశాన్య రాష్ట్రాల తామరతంపర పార్టీలు మినహా మిగతా దేశంలోని కీలక పార్టీలన్నీ దాదాపుగా కవరయ్యాయి… జనసేనకు కూడా డీఎంకే పార్టీ గుర్తింపు లభించింది… నిజానికి జనసేన ప్రస్తుతం బీజేపీ మిత్రపక్షంగా ఉంది… ఐతేనేం, తను కోరుతున్న లక్ష్యం వైపు పవన్ కల్యాణ్ కూడా కదిలి వస్తాడని స్టాలిన్ ఆశ… స్టాలిన్ కార్యాచరణ ఏమిటంటే..? దేశాన్ని మతం కోరల్లోకి నెట్టేస్తున్న బీజేపీని ఎదుర్కోవడానికి ‘‘ఆల్ ఇండియా ఫెడరేషన్ ఫర్ సోషల్ జస్టిస్’’ పేరిట ఏకమవుదామని పిలుపునిస్తున్నాడు…
తెలివైన ఎత్తుగడ… శరద్ పవార్ తన ప్రధాని ప్రయత్నాలను కట్టిబెట్టి అటక మీద పారేశాడు… మమతకు ఆశలున్నయ్, కానీ బెంగాల్ దాటి బయటికి వెళ్లేది లేదు, ఏ ప్రయత్నాలూ లేవు… కేసీయార్‌కు జాతీయ ప్రస్థానం ఆశలున్నయ్, కానీ మిగతా పార్టీల నుంచి సానుకూలత రావడం లేదు… చంద్రబాబుకు తన ఆత్మరక్షణే ప్రధానమైపోయింది… కాంగ్రెస్ సిట్యుయేషన్ నానాటికీ దిగజారుతోంది… ఈ స్థితిలో జాతీయ స్థాయిలో పాపులర్ కావడానికి రాజకీయాలకు అతీతం అని చెబుతూనే, రాజకీయ క్రీడకు తెరతీశాడు స్టాలిన్…
పార్టీలు, రాజకీయాలు అంటే నానా విభేదాలతో ఒక బ్యానర్ కిందకు రావడం కష్టం… సో, సామాజిక న్యాయం దిశగా ఐక్య కార్యాచరణ అంటున్నాడు… ఇక వ్యతిరేకించేది ఎవరు..? క్లిక్కవుతాడా లేదానేది వేరే సంగతి, చాలా ఫ్యాక్టర్స్ ప్రభావం చూపిస్తాయి… కానీ ఓ ప్రజాస్వామిక దేశంలో ఆచరణ ఇలాగే ఉండాలి… డీఎంకే ప్రారంభం నుంచీ తండ్రి వేసిన పునాదుల మీద స్టాలిన్ ఏ కట్టడమైనా కట్టగలడు… అది తనకు నైతిక ఊతం కూడా… తను ఎక్కడా కాంగ్రెసేతర, బీజేయేతర వంటి మాటలు మాట్లాడటం లేదు… ఒక లక్ష్యాన్ని చూపించి, అటు కదులుదాం అంటున్నాడు… సరే, ఇవి కదులుతాయా లేదానేది వేరే ప్రశ్న..!!
Share this Article