వర్మ ఇంటర్వ్యూలు చూసీ చూసీ, అందరూ ఏమనుకుంటారు..? తనకు ఏ ఉద్వేగాలూ ఉండవు అని…! తను కూడా ఎప్పుడూ అదే కలరింగ్ ఇస్తుంటాడు… అన్ని బంధాలకూ అతీతుడు అనిపించుకోవాలని తన తపన… అదేం వ్యాధి అనకండి, అదొక తత్వం… పర్వర్షన్‌కు కూడా అందడు అనేకసార్లు..! అయితే తను చెప్పేదంతా నిజమేనా..? కాదు, తప్పు… ఎమోషన్ లేనివాడు ఎందుకు ఉంటాడు..? ఎంతటి స్వార్థపరుడైనా, రాక్షసుడైనా, యోగిపుంగవుడైనా ఏదో ఒక ఎమోషన్ కదిలించడం ఖాయం…
అంతెందుకు..? ఇదే వర్మ ఎన్నిసార్లు చెప్పాడు, తనకు శ్రీదేవి అంటే ఎంత పిచ్చో… అనేకరకాలుగా తన ఆరాధనను వ్యక్తపరిచాడు… దాచుకోలేదు… ఆమె కోసమే ఒకటీరెండు సినిమాలు తీశాడు… ఓ దేవతను బంధించి, ఓ సగటు గృహిణిని చేశాడని బోనీకపూర్‌ను కూడా తిట్టిపోశాడు… అఫ్‌కోర్స్, ఆమెను ఆరాధించే క్రమంలోనే..! అసలు శ్రీదేవి అనే దేవత చెప్పాలే గానీ, మరుక్షణం ప్రాణాలు ఇవ్వమన్నా ఇచ్చేస్తాను అనే రీతిలో షో చేశాడు…
ఆమె మరణించినప్పుడు పాపం, నిజాయితీగానే బాధపడ్డాడు… తన తత్వానికి విరుద్ధంగా సోషల్ మీడియాలో ఓ బహిరంగ లేఖ పోస్ట్ చేశాడు… తన ఉద్వేగాలన్నీ బయటపెట్టాడు… అక్కడ నటన లేదు, ముసుగు లేదు, కవరింగు లేదు, దాచుకునేదీ లేదు… ఆమె పట్ల ప్రేమను, ఆమె మరణం పట్ల కన్నీటిని కూడా ఆపుకోలేదు… పెళ్లి తరువాత ఆమె జీవితం ఎలా నరకప్రాయం అయ్యిందో పూసగుచ్చినట్టు ఆ లేఖలో చెప్పుకొచ్చాడు… మరి ఇంతటి ఆరాధకుడు కదా, అంతటి తన ప్రియ ఆరాధకుడికి ఆమె ఎందుకు లీగల్ నోటీస్ పంపించింది..? బోనీకపూర్ ఎందుకు వర్మ మీద కస్సుమన్నాడు..?
Ads
ఏదో జేడీ చక్రవర్తి, అనుకృతి గురించిన సెర్చింగులో కనిపించిన సినిమా పేరు సావిత్రి కమ్ శ్రీదేవి… దానిపై జరిగిన గొడవలు, కేసులు, వివరణలు ఎట్సెట్రా… అలాగే ఈ సినిమాకు సంబంధించి శ్రీదేవి పంపించిన లీగల్ నోటీసు కూడా..! అదేమిటి..? ఈ సినిమాకు శ్రీదేవికి సంబంధం ఏమిటి అంటారా..? ఈ సావిత్రి అనే సినిమాకు సమర్పకుడు వర్మ, దర్శకుడు జేడీ చక్రవర్తి… ఈ పేరుతో, ఈ గొడవలతో విసిగిపోయి వర్మ సినిమా పేరును శ్రీదేవి అని మార్చాడు…
వర్మ శ్రీదేవి పేరును క్యాష్ చేసుకుంటున్నాడని అసహనంతో బోనీకపూర్ రుసరుసలాడాడు… (శ్రీదేవి అనే పేరు మీద తనకు పేటెంట్ ఉన్నట్టు…!!) పలుసార్లు వర్మకు కాల్ చేశాడు, ఆ పేరు వద్దని చెప్పడానికి… వర్మ తత్వం తెలుసు కదా, లైట్ తీసుకున్నాడు, తాపీగా ఓ వాట్సప్ మెసేజ్ పెట్టాడు అస్పష్టంగా… దాంతో బోనీకి మరింత చిరాకెత్తింది… ఇక శ్రీదేవి పేరిట ఓ లీగల్ నోటీసు పంపించాడు… ప్చ్, ఆమె స్వయంగా వర్మకు కాల్ చేసి, ‘‘వాటీజ్ దిస్ డియర్..?’’ అని ఒక్క మాటంటే సరిపోయేదిగా… జరగలేదు… అఫ్‌కోర్స్ , ఆ సినిమా మీద విరక్తి లేచి, వర్మ దాన్ని కోల్డ్ స్టోరేజీలోకి విసిరేశాడు, అదిప్పటికీ వెలుగు చూడలేదు…!! సో, బయటికి చెప్పబడే ఆరాధన, ప్రేమ అంతా ట్రాష్… వర్మ చెప్పేది వంద రెట్లు ట్రాష్… సినిమా ఇండస్ట్రీలో ఆ పదాలే అతి పెద్ద ట్రాష్..!!
Share this Article