అసలు వాళ్లకేమీ ఉండదు… మధ్యలో ఎవరో రిపోర్టరో, పేజ్ త్రీ పోర్టరో, సబ్బెడిటరో తీటకు ఏదో పేరు పెడతాడు… అంతే ఇక, అందరూ దాన్నే వాడుతూ సంబరపడిపోతారు, ఫ్యాన్స్ వాళ్లకు వాళ్లే చక్కిలిగిలి పెట్టేసుకుంటారు… మీడియా, సోషల్ మీడియా తెగ ఆనందపడిపోతూ ఉంటయ్… ఏమిటంటారా..? సెలబ్రిటీ జంటలకు పేర్లు పెట్టడం… అబ్బే, వేరే పేర్లు కాదు… ఆ ఇద్దరి పేర్లూ వచ్చేలా… హైబ్రీడ్ పేరు… అనగా ముద్దు పేరు… ఉదాహరణకు… జస్ట్, ఉదాహరణకు.,. ఇది ఆంధ్రజ్యోతి సైటు…
శ్రీవారి సన్నిధిలో నిశ్చయ్ అని ఓ హెడ్డింగు… కాసేపు అర్థం కాలేదు… తరువాత వెలిగింది ఏమిట్రా అంటే..? ఆమె పేరు నీహారిక, ఆయన గారి పేరు చైతన్య… కలిపి నిశ్చయ్ అట… నిహా ప్లస్ చై కలిపితే నిశ్చయ్ అవుతుందా అని అడిగితే మర్యాద దక్కదు సుమా… పత్రికల్లోనూ వాళ్లను ఫ్యాన్స్ ఉంటారు… వాళ్లు ప్రేమగా పెట్టిన పేర్లు అవి… అంతే… పేర్లు, సమాసాలు, వ్యాకరణాలూ, సమీకరణాలూ, నామకరణాలూ వంటివి అడగొద్దు…
Ads
బిగ్బాస్ జంటలకు సంబంధించి కొన్ని వెబ్ సైట్లు, కొన్ని యూట్యూబ్ వార్తల్లో చదివినట్టు గుర్తు… అభిక… అంటే అభిజిత్ ప్లస్ హారిక అన్నమాట… ఆ పేరుతో ఏదో ఫేస్బుక్ పేజీలు కూడా ఉన్నట్టున్నయ్… ప్రేమ బాసూ… తమ అభిమాన జంటల మీద లవ్వు, ఇష్క్, ప్యార్, అభిమానం…
నిజానికి ఈ పేర్లకు సంబంధించి చాలా ఫేమస్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ఉమ్మడి ముద్దుపేరు… విరుష్క… జాతీయ మీడియాలో కూడా చాలాసార్లు సరదాగా రాస్తుంటారు ఆ పేరును… మన తెలుగు పత్రికలు, టీవీలు చాలాసార్లు నాగ చైతన్య, నాగ సమంత పేరును కూడా ఇలాగే కలిపి కుట్టేసి… చైసామ్ అని రాశారు, ఎందుకో కొన్నాళ్లకు వాళ్లకే నచ్చక వదిలేసినట్టున్నారు…
అసలు ఇలా పేర్లను కలిపి కుట్టేయడం దేనికి..? అనబడే అనే తింగరి ప్రశ్న జోలికి వెళ్లకుండా… ఇలా ఎవరెవరి పేర్లను ఎలా కలిపి కుట్టి, అంతిమంగా ఏం నామకరణాలు చేయవచ్చో సరదాగా ఆలోచించండి.,. వాడండి… మీ అభిమానాన్ని చాటుకొండి… అరె, ట్రెండ్ అదే బాసూ… కమాన్… ఉదాహరణలు కావాలా..? పోనీ, ఇవి చదివి, స్ఫూర్తి పొందండి…
మహేష్ బాబు, నమ్రత… నమ్రేష్
యాంకర్ అనసూయ, భర్త భరద్వాజ… భరసూయ
యాంకర్ సుమ, భర్త రాజీవ్… సుజీవ్
యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్… సురష్మి
యాంకర్ ప్రదీప్, సింగర్ హారిక… ప్రహారి
యాంకర్ ప్రదీప్, డాన్సర్ పూర్ణ… ప్రపూర్ణ
హైపర్ ఆది, దీపిక పిల్లి… ఆదీపిక
అవినాష్, అరియానా… అవియానా
అఖిల్, మోనాల్… మోఖిల్
దీపిక పడుకోన్, రణవీర్ సింగ్… రణదీపిక
ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్… ప్రియానిక్
ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచ్చన్… ఐశాభీ
……… నిశ్చయ్లాగే వీళ్ల పేర్లు కూడా నిశ్చయంగా క్లిక్కవుతయ్… కావాలి… సబ్బెడిటర్లూ ఇంకాస్త మీ మెదళ్లకు పదును పెట్టండి… వీలయితే కాస్త పంచాంగాలు గట్రా చూసి, జాతకరీత్యా కుదిరే పేర్లు ఫిక్స్ చేసి మీమీ సైట్లలో, పత్రికల్లో, టీవీల్లో నామకరణాలు చేసేయండి… మన క్రియేటివిటీ అక్కడే కదా ఆగిపోయింది… మరేటి చేస్తం..?!
Share this Article