Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఈ కోకిలకూ ఓ విషాద ప్రేమగాథ… ఆ రాజావారు తొక్కిపడేశారు…

June 26, 2025 by M S R

.

సంగీత ప్రియుల్లో చాలామందికి తెలిసిన కథే కావచ్చు… కానీ మరోసారి మననం చేసుకోవచ్చు… లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోలేదు… ఎందుకు..? అదే ఈ కథ… నిజానికి ఓ నవలగానో, ఓ సినిమాగానో రాదగిన ప్రేమకథ… కానీ విషాదాంతం…

భారతరత్నకు నిజమైన అర్హురాలు, కొన్ని వేల భారతీయ భాషల పాటల్ని పల్లవించిన గొంతులోని ఈ విషాద వీచికను తలుచుకుంటే తప్పేమీ లేదు… ఓ రాజావారి అహానికి బలైన ప్రేమకథ… అలాగని ఆ ప్రేమికుడు ఈమె ప్రేమ తాలూకు జ్ఞాపకాలనీ వదిలేసి మరో పెళ్లి చేసుకుని, మనసు మార్చుకోలేదు కూడా…

Ads

మాజీ క్రికెటర్, బీసీసీఐని కొన్నేళ్లు ఏలిన రాజ్‌సింగ్ దుంగార్పూర్ గురించి ఇప్పటి జనరేషన్‌కు తెలియకపోవచ్చుగాక… ఆయన లా చదవడానికి ముంబై వచ్చినప్పుడు లత బ్రదర్ ద్వారా ఆ రాజ్‌సింగ్ లతకు పరిచయమయ్యాడు… మనసులు కలిశాయి… ప్రేమ చిగురించింది…

ఆమె గొంతులో ప్రేమరాగాలు మరింత అందంగా ప్రాణాలు పోసుకున్నయ్… ఆమె కెరీర్ క్రమేపీ ఎదుగుతూ… బాలీవుడ్ పాట అంటేనే లత అనుకునే రోజులవి… ఆమె పాడితేనే సినిమా హిట్ అని నిర్మాతలందరూ బలంగా ఫిక్సయిపోయిన కాలం అది…

ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు… రాజ్‌సింగ్ తన తల్లిదండ్రులకు చెప్పాడు… తండ్రి మహర్‌వాల్ లక్ష్మణ్ సింగ్… రాజస్థాన్‌లో ఓ సంస్థానానికి రాజావారు… ఆ రాజరికం తాలూకు అహం ఒకటి ఉంటుంది కదా…

ఆఫ్టరాల్ సినిమాల్లో పాటలు పాడుకునే ఓ గాయని ఈ రాజకుటుంబానికి కోడలు కావడం ఏమిటి అనుకున్నాడు… ఠాట్, వీల్లేదు అన్నాడు… బహుపరాక్ అని కొడుకును హెచ్చరించాడు… సదరు రాజ్‌సింగ్ పేరొందిన క్రికెటర్ కావచ్చుగాక, తండ్రిని ఎదిరించి నిర్ణయం తీసుకోలేకపోయాడు…

లతా మంగేష్కర్‌కు ఈ విషయాన్నే చెప్పాడు… తల్లిదండ్రులకు కూడా చెప్పాడు… లత దక్కని జీవితంలో ఇక పెళ్లే చేసుకోను అన్నాడు… భీష్మ ప్రతిజ్ఞ…ఇది విన్న లత కన్నీరు మున్నీరైంది… నువ్వే దక్కనప్పుడు నాకు పెళ్లి దేనికి రాజ్, నేనూ జీవితాంతం పెళ్లి చేసుకోను అని చెప్పింది… ఆమె గొంతులో విషాదం, వైరాగ్యం మరింతగా ప్రాణం పోసుకున్నయ్…

నిజం… ఇద్దరూ జీవితాంతం పెళ్లి చేసుకోకుండానే గడిపారు… ఎప్పుడూ ‘‘మంచి స్నేహితులు’’గానే కాలం వెళ్లదీశారు… ఆయన అల్జీమర్స్‌తో బాధపడుతూ 2009లో కన్నుమూశాడు… ఆమెలోని ప్రేమ భావనలు పూర్తిగా ఎండిపోయాయి…

కొన్ని వేల పాటలు, అనేక భాషలు… భారతీయ సినిమా పాట అంటేనే లత… ఎందరెందరో వస్తుంటారు, పోతుంటారు… కానీ లత అజరామరం… ఇది బయటికి కనిపించేదే, కానీ ఆమె గుండె లోతుల్లో నిత్యం విషాద కంపనాలు రేకెత్తించే ఆమె ప్రేమకథ ఎవరికీ అక్కర్లేదు… పాడుతూ పాడుతూ అన్నీ మరిచిపోతూ… సినిమా పాటల ప్రపంచాన్ని మహారాణిలా ఏలిందామె…

2022లో ఆ గొంతు కూడా మూగబోయింది… ఓ అమృతగళం వెళ్లిపోయింది… 90 ఏళ్ల వయస్సులో కూడా జవాన్ల కోసం వీసమెత్తు వృద్ధఛాయలు లేకుండా, అదే మాధుర్యంతో, చివరి పాటపాడిన ఆ గొంతు ఇప్పుడు సంగీతప్రియుల్ని విషాదంలో ముంచెత్తుతూ లోకాన్ని వీడిపోయింది…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జీవనపోరాటం… మానవ సంబంధాలన్నీ జస్ట్, మనీబంధాలే…
  • పాపం బమ్మెర పోతన ప్రాజెక్టు… ఎక్కడికక్కడ ఆగి ఏడుస్తోంది…
  • ప్రకృతి సౌందర్యానికి ప్రతీక… సముద్రపు ఒడిలో తేలియాడే గ్రామం..!
  • ఓ చిక్కు ప్రశ్న… పీటముడి… మీరేమైనా విప్పగలరా..? చెప్పగలరా..?
  • ఓహ్… కేటీయార్ ప్రేమించిన కంచె ఐలయ్య కాంగ్రెస్ సలహాదారా..?!
  • వాట్సప్‌లో పెళ్లిపత్రిక వచ్చిందా..? వెంటనే క్లిక్ చేయకండి, ఆరిపోతారు..!!
  • ఆహా… సబ్‌స్క్రయిబ్ చేయాలంటేనే ‘అల్లాడిస్తున్నారుగా’…
  • కేసీయార్‌కు కుదుటపడని ఆరోగ్యం… తరచూ ఏవో సమస్యలు..!?
  • ‘సోషల్ పొల్యూషన్’… కంట్రోల్ చేయలేమా..? మనల్ని కాపాడుకోలేమా..?
  • కేసీయార్ వాయిస్‌పై కుట్ర… *నమస్తే సర్వర్లపై సైబర్ అటాక్..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions