అయిపోయింది, ఆమె దిగంతాలకు తరలిపోయింది… 80 ఏళ్ల గానం మూగబోయింది… అందరమూ కన్నీళ్లు పెట్టుకున్నాం… ఆ గొంతు కోసం, ఆ స్వర పారవశ్యాన్ని తలుచుకుంటూ…! అయితే ఆ గొంతు సరే, ఆ ప్రావీణ్యం సరే… కానీ ఆమె తత్వం..? స్వర వైవిధ్యం అనేది ప్రేక్షకుడికి దక్కకుండా, మోనోపలీ వైపు…. మొనాటనీని మాత్రమే ఇచ్చిన ఆమె పోకడ..? మరి వాటి మాటేమిటి..? అదంతా నథింగ్, ట్రాష్, మనకు కావల్సింది ఆమె గొంతులోని మాధుర్యం, ఆమె గానప్రావీణ్యం మాత్రమే, ఆమె వ్యక్తిగతం మనకెందుకు అంటారా..? కరెక్టే కానీ… ఓ గానసామ్రాజ్ఙి వ్యక్తిత్వమూ చర్చల్లోకి వస్తుంది కదా…
లతా మంగేష్కర్‌కు చదువు లేదు… చిన్నప్పటి నుంచీ బడులో, కాలేజీలో లేవు… ఆ సర్కిళ్లు కూడా లేవు… దానికి తోడు కట్టర్ పాలిటిక్స్ రాజ్యమేలే దుర్మార్గమైన సినిమా ఇండస్ట్రీ తీరు సరేసరి… నీ గొంతు పీల, నువ్వు సినిమా గానానికి పనికిరావు అని తిరస్కరించిన అవమానాల నుంచి, కూడు పెట్టని నటన నుంచి, అడుగడుగునా హిపోక్రసీ నుంచి తనను తాను కాపాడుకుంటూ, తన స్థానాన్ని పదిలం చేసుకుంటూ, నిలబడటానికి తను వేరే గొంతుల్ని వినిపించకుండా చేసిందనే ఆరోపణలు బోలెడు…
అహం… లెక్కచేయనితనం… ఆమెలో రోజురోజుకూ బలం పెంచుకున్నయ్… అచ్చం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీద ఉన్న విమర్శలే… మరొకరిని ఎదగనివ్వకపోవడమే మన ప్రస్థానం… బాలు కాస్త నయం… హీరోను బట్టి, పాత్రను బట్టి, సంగీత దర్శకుడి అభిరుచిని బట్టి రకరకాలుగా గొంతును మారుస్తూ, తనే స్వరవైవిధ్యాన్ని చూపిస్తూ సినిమాపాటకు ఓ ఐకన్‌గా ఎదిగాడు… అది అనితరసాధ్యమైన పయనం… కానీ లత..? గానవైవిధ్యం ఉండదు, అంతెందుకు, తనే కొన్ని పాటలు పాడటానికి పనికిరానని చెప్పింది… తన చెల్లె ఆశాభోస్లే పాడిన అనేక పాటల్ని తాను పాడలేనని అంగీకరించింది… ఐనాసరే, వేరే గొంతును సహించలేదు, అదేమంటే ఆ సంగీత దర్శకుడినే సవాల్ చేసి, అలిగి, దూరం పెట్టేసేది…
Ads
ఆమె ఘనచరిత్రకు ఇది మరో పార్శ్వం… ఎవరిదాకో దేనికి..? తన మేనేజర్ గణపతిరావుతో వెళ్లిపోయి, పెళ్లిచేసుకున్న ఆశనే ఆమె చాన్నాళ్లు క్షమించలేదు… దగ్గరకు రానివ్వలేదు… ఆ పెళ్లి పెటాకులై, ఇద్దరు పిల్లలు, కడుపులో మరో శిశువుతో పుట్టింటికి వచ్చిన దుస్థితిలో కూడా ఆశను ఆమె చేరదీయలేదు… ఒకేచోట వేర్వేరు ఫ్లాట్లలో ఉన్నా సరే, ఆ తలుపులు ఎప్పుడూ ఆత్మీయంగా తెరుచుకోలేదు… ఓ పాటకు లత గొంతు సూట్ కాదు అన్నందుకు ఓపీ నయ్యర్‌తో ఎప్పుడూ మాట్లాడలేదు… ఒక్క పాట కూడా పాడలేదు, ఆయన కూడా ఆమెను పట్టించుకోలేదు…
రాయల్టీ విభేదాలతో రఫీతో కూడా చాన్నాళ్లు మాటలు మానేసింది… లత మనస్తత్వం, ఒకరిని సహించలేని తత్వం గురించి గాయని వాణీజయరాం పలుసార్లు బహిరంగంగానే ఆక్షేపించింది… ఆమె మాత్రమే కాదు, సుమన్ కల్యాణ్‌పూర్, షంషాద్ బేగంతోనూ లతకు పడేది కాదు… గీతాదత్, సులక్షణ పండిట్, హేమలత… ఇలా చాలామంది… తన మాట కాదంటే ఎంతటి సంగీత దర్శకుడైనా సరే దూరం పెట్టేసేది… ఆర్డీ బర్మన్‌తో మూడేళ్లు మాటలు మానేసింది… లత స్వర ప్రస్థానానికి తనే కారణమని మాట తూలడమే తను చేసిన తప్పు… సి.రామచంద్రను బాయ్‌కాట్ చేసింది… శారద అనే సింగర్‌ను చేరదీశాడనే కోపంతో మ్యూజిషియన్ శంకర్‌ను కూడా క్షమించలేదు ఆమె…
నాజియా హసన్, అనురాధా పాడ్వాల్ కాస్త నిలదొక్కుకున్నారు… తరువాత మెల్లిమెల్లిగా సంగీత దర్శకులు వైవిధ్యం కోరుకుంటూ లత ఒత్తిళ్లను లైట్ తీసుకోవడంతో అల్కా యాజ్ఙిక్, కవితా కృష్ణమూర్తి వెలుగులోకి వచ్చారు… ఆ తరువాత ఇక సునిధి చౌహాన్, శ్రేయో ఘోషాల్ తరంగాలు ఉప్పొంగాయి… ఆ హిపోక్రటిక్, దుర్మార్గమైన ఇండస్ట్రీ పాలిటిక్స్‌లో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరం చేసుకోవడానికి ఆమె అనుసరించిన పంథాయే కరెక్టు అంటారా..? కావచ్చు… అదే నిజం కావచ్చు..!!
Share this Article