ఓ పిల్లాడికి దడుపు జ్వరం… తల్లి వాడిని భుజాన వేసుకుని దగ్గరలోని మసీదుకు వెళ్లింది… అక్కడ ఓ మతపెద్ద అరచేతుల్ని గాలిలోకి చాపి, ఏదో పఠించి… మూడుసార్లు ఉఫ్ ఉఫ్ ఉఫ్ అంటూ పిల్లాడి మీద ఊదాడు… దీనివల్ల పిల్లాడిని పీడించే సాతాను, నెగెటివ్ ఫోర్స్ తొలగిపోతాయనేది ఒక నమ్మకం…… చాలాచోట్ల చిన్నప్పటి నుంచీ మనం గమనిస్తున్నదే… స్వస్థత కోసం దేవుడికి ప్రార్థన ఇది… లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ముందు షారూక్ ఖాన్ ఆమెకు నివాళి అర్పించడానికి వచ్చి, ఉమ్మేశాడనే ఫోటోలు, పోస్టులు, ప్రచారం చూస్తుంటే ఇదే గుర్తొచ్చింది… షారూక్‌ను ఛీత్కరిస్తున్నవాళ్లు ఉన్నారు, సమర్థిస్తున్నవాళ్లు కూడా ఉన్నారు…
తన వెంట వచ్చిన మేనేజర్ పూజా దడ్లాని మృతదేహానికి దండం పెడితే… షారూక్ అరచేతుల్ని చాచి ఏదో ప్రార్థించాడు… ఇదిరా మన భారతదేశం, మతసమైక్యతకు ప్రతీక అంటూ బోలెడు చప్పట్ల పోస్టులు కూడా కనిపించినయ్… ఇక్కడ ఓ చిక్కు ప్రశ్న… షారూక్ తనకు తెలిసిన పద్దతిలో తను నివాళి అర్పించాడు సరే… అయితే నివాళిని ఏ మతపద్ధతిలో అర్పించాలి..? మృతురాలి మత పద్ధతిలోనా..? నివాళి అర్పించే వ్యక్తి మత పద్ధతిలోనా..? నిజానికి నివాళి అంటే ఏమిటి..? ఎందుకు..?
Ads
మరణించిన వ్యక్తి పట్ల తన గౌరవాన్ని ప్రదర్శించడం, ఇహలోకాలను దాటేసి ఇక శ్రేష్టమైన ఉన్నత లోకాలకు వెళ్లాలని కోరుకోవడం, దుష్టశక్తుల నుంచి విముక్తం కావాలని దేవుడిని ప్రార్థించడం… ఇదే అంతిమ నివాళి ఉద్దేశం..! ఇక నివాళికి ఏ మతపద్దతయితేనేం..? నిజానికి ఓ చల్లపెట్టెలో శవం పడుకుని ఉంటే, అందరూ వెళ్తున్నారు, బొకేలు పెడుతున్నారు, పూలు జల్లుతున్నారు, ఈ నివాళిని ఏ మతపద్ధతిగా పరిగణించాలి, ఇప్పుడు ఎవరు మరణించినా ఈ సీన్లే కదా కనిపిస్తున్నయ్… ఇక ఈ షారూక్ విషయానికొస్తే… తను అక్కడికి వచ్చాడు, ఆ వీడియోలు ఫస్ట్ నుంచి చూస్తే తన మేనేజర్, తను అక్కడ చేతులు జోడించి దండం పెట్టినట్టు కనిపిస్తోంది.., తరువాత షారూక్ అరచేతులు చాచి, దేవుడిని ప్రార్థించి, మాస్క్ తీసి ఊదాడు… ఉమ్మినట్టుగా ఏమీ లేదు…
‘‘నో, నో, ఉమ్మేశాడు, వాటీజ్ దిస్, ఇదేం సంస్కారం..? అసలు ఈ ఉమ్మేయడమేం నివాళి..?’’ అంటూ సోషల్ మీడియా పోస్టులు ఓరకం వ్యతిరేక భావనల్ని వ్యాప్తి చేస్తున్నయ్… ఉమ్మేశాడా అనే ప్రశ్నకు కాస్త కామన్ సెన్స్ విశ్లేషణతో జవాబు వెతుకుదాం… (నిజానికి షారూక్ ఖాన్ ఓ ట్వీట్ చేస్తే సరిపోయేది…) ద్వేషంతో ఉమ్మేశాడు అనుకుందాం కాసేపు, అనాలిసిస్ కోసం… అయితే లతా మంగేష్కర్తో షారూక్‌కు విభేదాల్లేవు… ఉన్నాసరే ఒక మృతదేహం వద్దకు వచ్చి ఉమ్మేసేంత నైచ్యం షారూక్‌కు లేదు… ఒకవేళ అంత ద్వేషం ఉన్నా సరే వేలాది మంది శ్రద్ధాంజలి ఘటిస్తున్న విషాద వాతావరణంలో బహిరంగంగా ఉమ్మేస్తాడా ఎవడైనా..?
పాస్ట్ ఈజ్ పాస్ట్… నిజంగానే మరణించిన వాళ్లతో అంతకుముందు తలలు పగులగొట్టుకునేంత శతృత్వం ఉన్నా సరే, ఒకసారి మరణం ఒకరిని మింగేశాక, ఇక శతృత్వం ఏముంది..? దాన్ని ప్రదర్శించాల్సిన పనేముంది..? పైగా అన్ని కెమెరాలు, లైవ్ కవరేజీల నడుమ చేస్తారా..? తను అక్కడి దాకా వచ్చి రెండు చేతులూ జోడించాడు, అరచేతుల్ని చాచి దేవుడిని ప్రార్థించాడు… అంటే ఆమెకు నిజాయితీగా శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చినట్టే కదా… లేకపోతే అక్కడి దాకా రావడం దేనికి..?
సరే, ఉమ్మాడనే అనుకుందాం.., అయితే దాని వెనుక తన ఉద్దేశం ఏమిటి..? తనకు తెలిసిన పద్ధతిలో నివాళి అర్పించడమే కదా…! ద్వేషప్రకటన కాదు కదా…! ఆ అవసరమూ లేదు కదా…! సో, షారూక్ మీద అనవసర, అనుచిత ప్రచారం సాగుతున్నట్టు అనిపిస్తోంది…! ఇంతగా నిజనిర్ధారణ కథనాలు, శూలశోధన పోస్టులు కూడా అవసరమా..?!
Share this Article