కరోనా దేశాన్ని అతలాకుతలం చేసిన తొలి వేవ్‌లో… లక్షల మంది నగరాలు, పట్టణాల నుంచి సొంతూళ్లకు తరలిపోయారు… చావో బతుకో ఇక అక్కడే అనుకున్నారు… ఏదో ఓ పని చేసుకుని బతకొచ్చులే అన్నారు… బస్సులు, రైళ్లు లేకపోతే కిలోమీటర్ల కొద్దీ నడుస్తూ ఊళ్లకు వెళ్లిపోయారు… తరువాత ఏమైంది..? పల్లెలు మళ్లీ జనంతో కళకళలాడాయా..? లేదు… పల్లెల్లో పనుల్లేవు, ప్రభుత్వానికి పట్టింపులేదు, ఉపాధి పథకాల్లేవు… దాంతో కాస్త కరోనా భయం తొలగేకొద్దీ మళ్లీ నగరాలు, పట్టణాల బాటపట్టారు…
ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఉత్తరాఖండ్ రాష్ట్రాన్నే తీసుకొండి… అది పర్వత రాష్ట్రం… దేవతల భూమి అంటారు… మంచు, ఎత్తయిన పర్వతాలు, నదీప్రవాహాలు, అడవులు… కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు… క్లైమేట్ ఛేంజ్… సగటు ఉష్ణోగ్రత పెరిగింది… ఇప్పుడు గ్లేసియర్ ఉత్పాతాలు, మెరుపు వరదలు, అకాల వర్షాలు, దావానలాలు, కొండచరియలు విరిగిపడటం ఎక్కువైపోయాయ్… బతుకు కష్టమైంది… పంట పొలాలు దెబ్బతిన్నయ్, దిగుబడులు తగ్గినయ్… ఇంకేముంది..? వలసలు స్టార్టయినయ్…
2011 జనాభా లెక్కల ప్రకారం… 40 లక్షల మంది… అంటే జనాభాలో 40 శాతం వలసబాట పట్టారు… పౌరి, గర్వాల్, అల్మోరా జిల్లాల్లో జనాభా వృద్ధి రేటు పడిపోయింది… 2018 లో రాష్ట్ర మైగ్రేషన్ కమిషన్ నిర్వహించిన సర్వేలో 734 గ్రామాలు నిర్మానుష్యమైనట్టు తేలింది… అదీ 2011 నుంచి ఏడేళ్ల వ్యవధిలో…! భూతాల ఆవాసాలుగా పేరు తెచ్చుకున్నయ్… అదీ దురవస్థ… కానీ కోవిడ్ కారణంగా జనం తిరుగుబాట పట్టారు… 2020లో 3.27 లక్షల మంది తమ సొంతూళ్లకు చేరుకున్నారు…
Ads
పౌరి జిల్లా అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లాయే… అదేసమయంలో వలసలు ఎక్కువగా జరిగిన జిల్లా కూడా అదే… అందులో రావత్‌గావ్ గ్రామం ఒకటి… నాలుగయిదేళ్ల క్రితం మేజర్ గోర్కి చండోలా తన సిటీ జీవితానికి వీడ్కోలు చెప్పి సొంతూరికి వచ్చేశాడు… ‘‘సిటీలో పిల్లలకు స్వచ్ఛమైన గాలి లేదు, ఆరోగ్యకరమైన ఆర్గానిక్ ఫుడ్ లేదు, చురుకైనా జీవనశైలి లేదు… అందుకే ఊరికి వచ్చేశాం… మేం వచ్చేసరికి ఊళ్లో పదీపదిహేను మంది మాత్రమే ఉన్నారు…’’ అంటున్నాడు తను…
పండించుకోవడానికి విస్తారమైన పొలాలున్నయ్, సాగు చేసేవాళ్లు లేరు… తను ఎక్కడైతే చదివాడో, దగ్గరలో ఉన్న అదే బడిలో తన 12 ఏళ్ల బిడ్డను చేర్పించాడు… ఆరేళ్ల కొడుకు ఇంకా ఆ గుట్టల్లో, చెట్లల్లో ట్రెక్కింగ్ చేస్తూ, ఆడుకుంటూ ఉన్నాడు… చండోరీ దంపతుల ప్రథమ లక్ష్యం గ్రామాన్ని స్వయంసమృద్ధం చేసుకోవడం… తామేం తినాలో తామే పండించుకోవాలి… సిటీలో ఉన్న సదుపాయాలే వాళ్లూ సమకూర్చుకున్నారు… వైఫై ఉంది, శాటిలైట్ టీవీ పెట్టుకున్నారు… కానీ ఎక్కువగా బయట పనుల్లోనే బిజీ బిజీ…
ఊరికి వచ్చే దారికి మరమ్మత్తులు చేయించారు… పొలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను కొట్టేశారు… శతాబ్దాల క్రితం రాళ్లతో కట్టిన ఇంటిని నివాసయోగ్యంగా మార్చుకున్నారు… ఇంకుడుగుంతలు, కుంటలు తవ్వారు… పొలాలకు నీళ్లు మళ్లించుకున్నారు… ఆ చుట్టుపక్కల ఊళ్ల నుంచి వలస వెళ్లిన వాళ్లను తిరిగి ఊళ్లకు రప్పించే ఆలోచనల్లో పడ్డాడు మేజర్ సాబ్… అందుకే వ్యవసాయంలో సంప్రదాయ పద్ధతులు, నిర్మాణం, టూరిజంపై దృష్టి పెట్టాడు…
పట్టువదలని విక్రమార్కుడు తను… అక్కడ ఇప్పుడు ఉల్లి, వెల్లుల్లి, అల్లం, అపరాలు, బీన్స్, బెండ, జామ, మామిడి… ఇలా దాదాపు 30 రకాలు పండిస్తున్నారు… పళ్లు, కూరగాయలపై ఎక్కువగా కాన్సంట్రేషన్… ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి, కొన్ని పాలీ హౌజులు కట్టారు… కాలుష్యరహిత వాతావరణంలో ఔషధ మొక్కల సాగు ప్రారంభించారు… ఎరువులు, పురుగుమందుల్లేకుండా కేవలం జీవఎరువులు, గోమూత్రం మాత్రమే వాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట తీయాలనేది టార్గెట్…
పథాల్ ఆగ్రో పేరిట వంద శాతం ఆర్గానిక్ దినుసుల్ని మార్కెటింగ్ చేస్తున్నాడు… అంతేకాదు, పథాల్ హోమ్ స్టే పేరిట ఎకో టూరిజం ప్లాన్ చేశాడు… జనం వదిలేసి వెళ్లిన కొన్ని ఇళ్లను రీమోడల్ చేసి, పట్టణప్రాంత టూరిస్టులను ఆకర్షిస్తున్నాడు… ఆ ఇళ్ల రీమోడలింగ్ కోసం రాళ్లు, మట్టి, చెక్క… ఇవే వాడాడు… ఆయన భార్య దీప్తి చండోరి బేసిక్‌గా ఇంటీరియర్ డిజైనర్, పెయింటర్, గార్డెనర్… ఇంకేముంది..? ఆ ఇళ్లు ‘విలేజ్ టూరిస్ట్ పాయింట్స్’గా మారినయ్…
సంప్రదాయ నిర్మాణ పద్ధతులే భూకంపాలను తట్టుకునేవి అని గుర్తించారు… సిమెంటు బదులు మినప్పప్పును వాడుతున్నారు… ఇది ఇళ్లను ఎండకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతాయి… ఇప్పుడు ఆ ఊరిలో ఉపాధి ఉంది… పచ్చగా పంటలు… ఏమీ తక్కువ లేదు… చండోరికి ఓ సక్సెస్ స్టోరీ… తను ఎందరికో ఓ స్పూర్తి… చండోరిలాగా సవాళ్లను ఎదుర్కొని, పల్లెను మళ్లీ జీవింపజేయాలనే లక్ష్యంతో గనుక నిలబడితే… పల్లె కన్నతల్లిలా మారుతుంది… కానీ ఎందరు..?
ఫోటోలు, ఇన్పుట్స్ :: Mongabay.
Share this Article